ఉమెన్స్‌ కళాశాల విద్యార్థినుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-11-23T01:38:05+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఉమెన్స్‌ కళాశాల స్థలాన్ని కొంత మంది అధికార పార్టీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. సోమవారం నగరంలోని కంఠేశ్వర్‌ ప్రధాన రహదారిపై విద్యార్థినులు ఆందోళన చేశారు.

ఉమెన్స్‌ కళాశాల  విద్యార్థినుల రాస్తారోకో

గంట పాటు కంఠేశ్వర్‌ ప్రధాన రహదారిపై బైఠాయింపు

కళాశాల స్థలాన్ని అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆగ్రహం

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 22: జిల్లా కేంద్రంలోని ఉమెన్స్‌ కళాశాల స్థలాన్ని కొంత మంది అధికార పార్టీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. సోమవారం నగరంలోని కంఠేశ్వర్‌ ప్రధాన రహదారిపై విద్యార్థినులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సుమారు గంట పాటు కంఠేశ్వర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించారు. అనంతరం పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. 70ఏళ్ల చరిత్ర గల ఉమెన్స్‌ కళాశాల ఆస్తులపై కొంతమంది కబ్జాదారుల కళ్లు పడ్డాయన్నారు. అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు కళాశాల మైదానాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులు చదివే మహిళా కళాశాలను కబ్జా చేయడం దారుణమన్నారు. తక్కువ ఫీజుతో ఎంతోమంది పేద విద్యార్థినులకు విద్యనందిస్తున్న మహిళా కళాశాల స్థలాన్ని కాపాడాలని వారు అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థినుల ఆందోళనతో గంట పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థినులకు నచ్చచెప్పి.. ఆందోళన విరమింపజేశారు. కాగా.. విద్యార్థినుల ఆందోళనకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు ప్రకటించారు.

Updated Date - 2022-11-23T01:38:05+05:30 IST

Read more