యాసంగికి నీటి విడుదల ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-12-12T00:02:40+05:30 IST

ఈ ఏడాది నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద యాసంగి నీటి పారుదల కోసం ప్రణాళికను అధికార యంత్రాంగం ఖరారు చేశారు.

యాసంగికి నీటి విడుదల ఎప్పుడో?
నిజాంసాగర్‌లో 1404.89 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న దృశ్యం

- ఇప్పటికీ నీటి విడుదలపై నిర్వహించని సమావేశం

నిజాంసాగర్‌, డిసెంబరు 11: ఈ ఏడాది నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద యాసంగి నీటి పారుదల కోసం ప్రణాళికను అధికార యంత్రాంగం ఖరారు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఆయకట్టు కింద సాగయ్యే భూములకు ప్రధానకాల్వ వెంట నీటిని ఎప్పుడు విడుదల చేసేది ఖరారు చేయలేక పోయారు. దీంతో నీరు ఎప్పుడు విడుదల చేస్తారోనని రైతులు ఎదురు చూస్తారు. ప్రతీఏట యాసంగి సాగు కోసం డిసెంబరు మొదటి, రెండు వారాల్లో తేదీలు ఖరారు చేసి నీటిని విడుదల చేసే వారు. కానీ ఇంత వరకు సలహ మండలి సమావేశం నిర్వహించలేకపోయారు. లక్షా 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటి పారుదల శాఖ అధికార యంత్రాంగం ఖరారు చేయగా, ఇప్పటికే ఆయకట్టు కింద రైతాంగం వరి నారు మళ్లు వేసుకున్నారు. ప్రాజెక్టులో 1405 అడుగులకు గాను 1404.89 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను 17.643 టీఎంసీల నీరు ఉంది. రెండు నెలలుగా 233 క్యూసెక్కుల నీరు ఆవిరితో పాటు లీకేజీ రూపంలో వెళుతునే ఉంది. ఇప్పటి వరకు సాగర్‌ ప్రాజెక్టులో 333 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో కరిగి పోయింది. ప్రాజెక్టు 0 డిస్ర్టిబ్యూటరీ నుంచి అలీసాగర్‌ వరకు నీటిని విడుదల చేస్తారు. అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల పథకాలకు సాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ సరఫరా అవుతుంది. కేవలం 17.643 టీఎంసీల నీటిని లక్షా 15వేల ఎకరాలకే నీరు 10 విడతలుగా అందించేందుకు ఖరారు చేశారు. పుష్కలంగా నీరు ఉండటంతో ఆయకట్టు కింద ఎలాంటి వాణిజ్య పంటలు వేసేందుకు నేల అనుకూలంగా ఉండదని రైతులు భావించి ఈ యాసంగిలో కూడా వరి పైరును సాగు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సాగర్‌కు దిగువన మంజీరా వెంట ఉన్న లిఫ్టు ఇరిగేషన్‌ కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధమై వరి నారుమళ్లు వేస్తున్నారు. పుష్కలంగా మంజీరాలో నీరు ఉండటంతో నాన్‌ కమాండింగ్‌ ఏరియాల్లో వరి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టు నీటి విడుదల ఈ యాసంగికి ఎప్పుడు విడుదల చేస్తారో, నీటి పారుదల శాఖ సలహ మండలి ఎప్పుడు నిర్వహించి విడతల వారీగా నీటి విడుదల ఖరారు చేస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు. వర్షాకాలం పుష్కలంగా వరి సాగైనా సాగర్‌లో పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం ఉండటంతో ఆయకట్టు రైతులు యాసంగి పంటలపై ఆశలు చిగురిస్తున్నాయి. అధికార యంత్రాంగం నీటి విడుదల ఎప్పుడు చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2022-12-12T00:02:42+05:30 IST