పాలకవర్గం ఏర్పాటు ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-09-28T05:45:10+05:30 IST

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం పదవీకాలం ముగిసి నాలుగేళ్లవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. రాజకీయ కారణాలతో పాలకవర్గానికి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు నియమించలేదు. దీంతో రైతుల సమస్యలు పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నారు.

పాలకవర్గం ఏర్పాటు ఎప్పుడో?

నాలుగేళ్లవుతున్నా ఏర్పాటు చేయని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం

పూర్తి స్థాయి కమిటీ లేక రైతులకు తప్పని ఇబ్బందులు

త్వరగా పాలకవర్గం ఏర్పాటు చేయాలని రైతుల వినతి 

రాష్ట్రంలో ఆదాయం వచ్చే మార్కెట్‌లో నిజామాబాద్‌ ఒకటి

నిజామాబాద్‌, సెప్టెంబరు 27: (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం పదవీకాలం ముగిసి నాలుగేళ్లవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. రాజకీయ కారణాలతో పాలకవర్గానికి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు నియమించలేదు. దీంతో రైతుల సమస్యలు పరిష్కారం కాక ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పసుపుతో పాటు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా అమ్మకాలు జరిగే ఈ మార్కెట్‌కు పాలకవర్గం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలపై అధికారులకు మొరపెట్టుకున్నా పాలకవర్గం లేక పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలోనే హైదరాబాద్‌ తర్వాత అత్యధిక ఆదాయం వచ్చే మార్కెట్‌లో ఒక్కటైన నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌పై పట్టింపు లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో అమ్మకాలకు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువచ్చిన రైతులకు పాలకవర్గం లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను విన్నవించేందుకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అధికారులను ఆశ్రయిస్తూ అమ్మకాలను చేస్తున్నారు. 

సర్కారుకు ఏడాది గడువు

రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా సంవత్సరంలోపే గడువు ఉండడంతో ఆశావహులు కూడా ప్రయత్నాలు చేసి విరమించుకున్నారు. మార్కెట్‌ చైర్మన్‌తో పాటు పాలకవర్గ డైరెక్టర్‌ల నియామకంపై మాత్రం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు నోరుమెదపడంలేదు. మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ మార్కెట్‌కు ప్రతి సంవత్సరం వేలాదిమంది రైతులు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకువచ్చి అమ్మకాలు చేస్తారు. మార్కెట్‌ టర్నోవర్‌ కూడా వేలకోట్లలో ఉంది. ప్రతి సంవత్సరం మార్కెట్‌కు సుమారు వందకోట్ల వరకు ఆదాయం వస్తుంది. రాష్ట్రస్థాయిలో ఈ-నామ్‌ అమలు చేయడంలో కూడా ఈ మార్కెట్‌ ముందుంది. హైదరాబాద్‌, వరంగల్‌ మార్కెట్‌లకు దీటుగా ఆదాయం వస్తున్నా ప్రభుత్వం మాత్రం ఈ మార్కెట్‌ను పట్టించుకోవడంలేదు. 

నాలుగేళ్ల క్రితం ముగిసిన పాలకవర్గం

మార్కెట్‌కు నాలుగేళ్ల క్రితం వరకు పాలకవర్గం ఉంది. చైర్మన్‌, పాలకవర్గ సభ్యుల పదవీకాలం 2018లో పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం కొత్తపాలకవర్గం నియామకం చేపట్టలేదు. అయితే మార్కెట్‌ పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. నలుగురు ప్రయత్నాలు చేయడం రాష్ట్రస్థాయిలో ఒత్తిడి పెరగడంతో ఎవరికీ పదవి ఇవ్వలేదు. మార్కెట్‌ కమిటీకి పాలకవర్గాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎమ్మెల్యేల మధ్య పోటీ ఉండడం వల్ల ఏవైపు మొగ్గు చూపలేదు. గత పాలకవర్గం రూరల్‌ నుంచి చైర్మన్‌గా ఎం పిక కావడంతో ఈ దఫా మిగతా నియోజకవర్గాల పరిధిలోనివారికి ఇవ్వాలని పట్టుపట్టారు. రాష్ట్ర స్థాయిలో ఎవరికివారే ప్రయత్నాలు కొనసాగించారు. పోటీ పెరగడం వల్ల ఎవరినీ నియమించలేదు.

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతల ప్రయత్నాలు

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి కోసం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు ఎక్కువగా ప్రయత్నాలు చేశారు. తమకున్న పలుకుబడిని ఉపయోగించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుపా, షకిల్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డిల ద్వారా ప్రయత్నాలు చేశారు. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్‌ పదవులు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నైనా అవకాశం కల్పించాలని కోరారు. చివరకు కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా మంత్రి కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌లను కలిశారు. పార్టీకి చేసిన సేవలను వివరించడంతో పాటు తమకు ఎలాగైనా అవకాశం కల్పించాలని కోరారు. ప్రతిసారి నామినేటెడ్‌ పదవులను భర్తీచేసే సమయంలో ప్రయత్నాలు చేసిన ఏదో కారణంతో నాలుగేళ్లుగా వాయిదా పడుతోంది. ఇంకా ప్రభుత్వం సంవత్సరంలోపే ఉండడం, ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ఎవరికివారే గట్టి ప్రయత్నాలు చేశారు. చివరకు నామినేటెడ్‌ పదవి అయిన చైర్మన్‌, పాలకవర్గం సభ్యులను బర్తిచేయకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. ఎన్ని సార్లు తిరిగినా ఒకేమాట చెబుతుండడంతో తమకు అవకాశం లేదంటూ వారు భావిస్తున్నారు. తమకు ఇవ్వకున్నా కీలకమైన మార్కెట్‌ చైర్మన్‌ పదవిని భర్తీచేయాలని టీఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్‌నేతలు కోరుతున్నారు. జిల్లాలోని రైతులతో పాటు రైతు సంఘాల నేతలు యాసంగిలో వ్యవసాయ ఉత్పత్తులు తీసుకువచ్చేలోపే చైర్మన్‌, పాలకమండలి సభ్యులను భర్తీచేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-09-28T05:45:10+05:30 IST