కొనుగోళ్లు ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-06-07T06:11:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వమేప్రతి సీజన్‌లో మార్క్‌ఫెడ్‌ ద్వారా శనగలు, మక్కలు, జొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండేది.

కొనుగోళ్లు ఎప్పుడో?
పిట్లం మార్కెట్‌యార్డులో కుప్పలుగా పోసిన జొన్న

జొన్న రైతులను దగా చేస్తున్న దళారులు!

యాసంగిలో వరికి బదులు జొన్నలు సాగు చేయాలన్న ప్రభుత్వం

చివరకు పంటను కొనుగోలు చేయని వైనం

జొన్నలను విక్రయించేందుకు దళారులను ఆశ్రయిస్తున్న రైతులు

మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోళ్లు

క్వింటాలుకు రూ.1000 వరకు నష్టపోతున్న రైతులు

32 వేల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి

కామారెడ్డి, జూన్‌6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వమేప్రతి సీజన్‌లో మార్క్‌ఫెడ్‌ ద్వారా శనగలు, మక్కలు, జొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండేది. అయితే యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయమని రైతులు వరి సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, శనగ, ఇతర పంటలను సాగుచేయాలని ఆదేశించింది. దీంతో కామారెడ్డి జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా వేల ఎకరాలలో జొన్న పంటను సాగుచేశారు. ఈ యాసంగి సీజన్‌లోనూ జిల్లాలో సుమారు 18వేల ఎకరాలలో జొన్నల పంటలను రైతులు సాగు చేశారు. అయితే పంట చేతికి రావడం, ఉత్పత్తులను మార్కెట్‌కు రైతులు తరలిస్తున్నారు. కానీ ఈ  పంటను కొనుగోళ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో జొన్నలను అమ్ముకునేందుకు రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓ వైపు అకాల వర్షాలు కురుస్తుండడం జొన్నలు తడిసి ముద్దవుతున్నాయి. దీంతో ఏమీ చేయలేక రైతులు దళారులు, ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.1000 వరకు తక్కువకే కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌చేస్తున్నారు.

వేల ఎకరాల్లో జొన్నల సాగు

జిల్లాలో వరి పంట తర్వాత ఎక్కువగా ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, శనగతో పాటు ఇతర పప్పుదినుసు పంటలను రైతులు వేల ఎకరాలలోనే సాగు చేస్తుంటారు. ఈ యాసంగి సీజన్‌లో 18 వేల ఎకరాల్లో జొన్న పంటను సాగుచేయగా 60 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు రానున్నాయి. నీటి లభ్యత ఎక్కువగా లేని ప్రాంతాలైన సదాశివనగర్‌, గాంధారి, పిట్లం, తాడ్వాయి, రాజంపేట, మద్నూర్‌, జుక్కల్‌, బిచ్కుంద, తదితర మండలాల్లో ఈ పంటల సాగు ఎక్కువగా ఉంది. కేంద్రప్రభుత్వం సీఎంఆర్‌రైస్‌ను సేకరించడంలేదని యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయబోమని రైతులు సైతం వరిపంటను సాగుచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో కొందరు వరిపంట సాగుచేయక పంటసాగుకు విరామం ఇచ్చారు.మరికొందరు ప్రత్యామ్నాయంగా జొన్నతో పాటు మొక్కజొన్న,శనగ, పెసర,మినుము తదితర పంటల ను సాగుచేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర ్యంలో శనగలను కొనుగోలు చేసింది. ప్రతి ఏటా జొన్నలను సైతం ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తూ వచ్చేది గత ఏడాది 8 కేంద్రాలను మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏర్పాటుచేసి రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలుచేశారు. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు జొన్నలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలను జారిచేయలేదు. ప్రభుత్వం చెబితేనే వరికి బదులు జొన్నసాగుచేశామని తీరా చూస్తే ఇప్పటికీ కేంద్రాలను ఏర్పాటుచేయడం లేదని రైతులు మండి పడుతున్నారు.

కొనుగోళ్లకు ఎదురుచూపులు

ప్రభుత్వం జొన్నలను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటుచేస్తుందోనని జిల్లా రైతులు ఎదురుచూస్తున్నారు. సర్కారు సూచన ప్రకారమే తాము వరిని కాదని జొన్నపంటను సాగుచేశామని రైతులు పేర్కొంటున్నారు. జొన్నలకు ధర లేక కొనేవారు లేక వేల క్వింటాళ్ల జొన్నలు ఇళ్లలోను,మార్కెట్‌ యార్డులలోను నిల్వ చేస్తున్నారు. పిట్లం, గాంధారి, సదాశివనగర్‌ తదితర మార్కెట్‌యార్డులలో రైతులు జొన్నలను అమ్మకానికి తరలించి కుప్పలుగా పోసి ఉంచారు. 10 రోజులుగా జొన్నలను అమ్మేందుకు నిరీక్షిస్తున్నారు. ప్రతీ సీజన్‌లోనూ ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తూ వస్తోంది. ఈ సీజన్‌లోనూ ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటుచేసి మద్దతు ధరకు కొనుగోలు చేపడుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ముందుకువచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని రైతులు వేడుకుంటున్నారు.

దళారులకు విక్రయిస్తూ నష్టపోతున్న రైతులు


జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో జొన్న దిగుబడులు బాగానేవచ్చాయి. ఏకరానికి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. అయితే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోవడంతో పంటలను అ మ్ముకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జొన్నలకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2 వేల 700 మద్దతు ధర ప్రకటించింది. కానీ కొనుగోలుకేంద్రాలను ఏర్పాటుచేయడం లేదు. మరోవైపు జొన్న కొనుగోళ్లపై ప్రైవేట్‌ వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో పంటనుఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి రైతుల్లో ఎదురవుతోంది. డబ్బులు అత్యవసరమై దళారులు, ప్రైవేట్‌ వ్యాపారుల వద్దకు తీసుకెళ్తే క్వింటాల్‌కు రూ.1700 వరకు మాత్రమే ధర చెల్లిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. దీంతో జొన్న రైతులు రూ.1000 వరకు నష్టపోతున్నారు.  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయకపోవడంతో నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more