పంట రుణాలు ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2022-11-27T00:46:15+05:30 IST

జిల్లాలో యాసంగి సాగు మొదలై నెలరోజులు దాటుతున్నా.. ఇప్పటికీ పంట రుణాల పంపిణీ ఊపందుకోలేదు.

పంట రుణాలు ఇంకెప్పుడు?
నందిపేట్‌, వర్ని మండలాల్లో యాసంగి పనుల్లో బిజీబిజీగా రైతులు

వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా రైతులు

ఇప్పటికీ ఈ దఫా రుణాల పంపిణీ మొదలుపెట్టని బ్యాంకులు

చేతిలో చిల్లిగవ్వ లేక తప్పని తిప్పలు

సాగు పనుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి

ఈ యాసంగిలో రూ.1,538 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం

పూర్తికావస్తున్న ఆరుతడి పంటల సాగు పనులు

ఈ నెలాఖరు నుంచి వరి నాట్లు

జిల్లావ్యాప్తంగా ఈ దఫా 4.96 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటల సాగుకు ప్రణాళిక

నిజామాబాద్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో యాసంగి సాగు మొదలై నెలరోజులు దాటుతున్నా.. ఇప్పటికీ పంట రుణాల పంపిణీ ఊపందుకోలేదు. ఒకవైపు రైతులు పంట రుణాల కోసం ఎదురుచూస్తున్నా.. మరోవైపు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలను అందించడంలేదు. ఇతర పనుల్లో నిమగ్నం కావడంతో పనులు చేస్తున్న రైతులు డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇతర మార్గాల ద్వారా పెట్టుబడి తీసుకువచ్చి పనులు చేస్తున్నారు. రైతుబంధు కూడా ఇంకా రాకపోవడంతో పంటల సాగు కోసం రుణాలు తెచ్చి పనులు చేస్తున్నారు. పంటలు వేయడంతో పాటు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమకు రుణాలు కల్పించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.

నెల కిందటే మైదలైన సాగు

జిల్లాలో యాసంగి సీజన్‌ సాగు మొదలై నెలరోజులు దాటిపోతోంది. రైతులు ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలు సాగు పూర్తికాగానే.. ఇతర పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వరి సాగు కోసం నారుమడులను సిద్ధం చేస్తున్నారు. మరో 15 రోజుల్లో వరినాట్లను మొదలుపెట్టనున్న రైతులు.. ఆలోపే ఆరుతడి పంటల సాగును పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నా రు. జిల్లాలో ఈ యాసంగిలో 4లక్షల 96వేల 279 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు యాసంగి ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇప్పటివరకు 74వేల ఎకరాలకు పైగా సాగు అయ్యింది. జిల్లాలో రైతులు ఆరుతడి పంటలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మొక్కజొన్న 16,590 ఎకరాలలో సాగు చేశారు. శనగ 23,750 ఎకరాలు, ఎర్రజొన్న 27వేల ఎకరాల్లో వేశారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు మొక్కజొన్నతో పాటు శనగ, ఎర్రజొన్న పంటలు ఎక్కువగా వేస్తున్నారు. ఎర్రజొన్న 50వేల ఎకరాల వరకు సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. మంచుపై ఆధారపడి పండే శనగ పంటను ఎక్కువగా వేస్తున్నారు. వీటితో పాటు జవారు, కంది, పెసర, మినుములు, ఇతర పంటలను సాగు చేస్తున్నారు. వరి కోతలు పూర్తవుతున్నందున వరి నారుమడుల పెంపకంలో ఉన్నారు. మరో 15 రోజుల నుంచి జిల్లాలో వరి నాట్లను మొదలుపెట్టనున్నారు. సుమారు నాలుగు లక్షల ఎకరాల వరకు వరి సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. డిసెంబరు మొదటి వారం నుంచి నిజాంసాగర్‌ నీటిని విడుదల చేస్తుండగా.. మూడో వారం నుంచి శ్రీరాంసాగర్‌ నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.

ముందుకు సాగని రుణాల పంపిణీ

జిల్లాలో పంటల సాగు జోరుగా సాగుతున్న బ్యాంకుల నుంచి రుణాలు అందించడంలో మాత్రం అనుకున్నవిధంగా సాగడం లేదు. వానాకాలం సీజన్‌లోనూ నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా రుణ పంపిణీ చేయలేదు. అనుకున్న లక్ష్యంలో 72 శాతం మాత్రమే రుణాలను అందించారు. యాసంగిలోనూ రుణ పంపిణీకి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని నిర్ణయించినా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదు. జిల్లాలో జరిగిన బ్యాంకర్స్‌ కమిటీలో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రైతులు వేసే పంటలకు అనుగుణంగా పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. పంటలు వేసే సమయంలోనే రుణాల పంపిణీ ఎక్కువ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత వానాకాలంలో జిల్లాలో 2,308 కోట్ల రూపాయలను పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించగా.. 1,664 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. నిర్ణయించిన లక్ష్యంలో 72 శాతం మాత్రమే పూర్తి చేశారు. గత సంవత్సరం కన్న మూడుశాతం తక్కువగానే పంట రుణాలు అందించారు. కాగా, ఈ సంవత్సరం యాసంగిలో 1,538 కోట్ల రూపాయలను పంట రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు మాత్రం రుణ పంపిణీ మొదలుపెట్టలేదు. కొన్ని బ్యాంకుల పరిధిలో ఎక్కువ మొత్తంలో ఇవ్వలేదు.

ఇప్పటి వరకు అరకొర పంపిణీ

జిల్లాలో ఈయేడు ఇప్పటి వరకు రూ.40 కోట్లకు మించి రుణాల పంపిణీ చేయలేదు. యాసంగి పంటలకు అక్టోబరు నుంచి మార్చి వరకు పంట రుణాలను బ్యాంకర్లు అందిస్తారు. వానాకాలం సీజన్‌తో పోలిస్తే రైతులకు నవంబరు, డిసెంబరు నెలల్లోనే ఎక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ నెలల్లోనే రైతులు ఆరుతడి పంటలతో పాటు వరి నాట్లను కొనసాగిస్తారు. ఎకరాకు రూ.10 నుంచి రూ.20వేల మధ్య పెట్టుబడులను పెడతారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం కావడంతో రైతులు బ్యాంకుల వైపు గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. ధాన్యం అమ్మకాలు చేపట్టినా.. ఇప్పటి వరకు పూర్తికాకపోవడంతో ఇంకా రైతుల ఖాతాలో ఆ డబ్బులు కూడా జమకావడం లేదు. ఇటు ధాన్యం డబ్బులు రాక.. అటు బ్యాంకుల నుంచి రుణ పంపిణీ లేక రైతులు ఇతర మార్గాల ద్వారా డబ్బులను తీసుకుంటూ పెట్టుడులు పెడుతున్నారు. దుక్కి దున్నడం, పంటలు వేయడం, ఎరువులకు ఈ డబ్బులను వినియోగిస్తున్నారు. బ్యాంకులో రుణాలు నవంబరు, డిసెంబరు, జనవరి నెలలో నిర్ణయించిన లక్ష్యంలో 80 శాతానికి పైగా పంపిణీ జరిగితే రైతులకు మేలు జరగనుంది.

ప్రతీవారం రుణాలపై కలెక్టర్‌ సమీక్ష

కాగా, కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రతివారం పంట రుణాలపై సమీక్షిస్తున్న కిందిస్థాయిలో పట్టించుకోకపోవడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని నెరవేరడం లేదు. ఆయా బ్యాంకు శాఖలకు లక్ష్యాన్ని కేటాయించినా.. నిర్ణయించిన గ్రామాలకు సకాలంలో రుణ పంపిణీ చేయకపోవడం వల్ల రైతులు పెట్టుబడికి ఇతర మార్గాల ద్వారా తెచ్చుకోవడంతో దూరంగా ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతంలోని రైతులకు పంట రుణాలపైన అవగాహన కల్పించడంతో పాటు నిర్ణీత సమయం లో రుణాలు అందిస్తే మేలు జరిగే అవకాశం ఉంది. పెట్టుబడి కోసం ఇతర మార్గాల ద్వారా తెచ్చుకునే పరిస్థితి తప్పనుంది.

లక్ష్యానికి అనుగుణంగానే పంట రుణాల పంపిణీ

: శ్రీనివాస్‌రావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌, నిజామాబాద్‌

జిల్లాలో యాసంగిలో పంట రుణాలను నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా ఇచ్చేందుకు ఏర్పాట్లను చేశాం. ఆయా బ్యాంకులకు లక్ష్యాలను నిర్ణయించాం. వాటికి అనుగుణంగానే రుణాలను పంపిణీ చేస్తాం.

జిల్లాలో మరింత పెరగనున్న సాగు విస్తీర్ణం

:తిరుమల ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో సాగు విస్తీర్ణం మరింత పెరుగనుంది. ఈ నెలాఖరు నుంచి ఎక్కువ మొత్తంలో సాగు జరగనుంది. దీనిలో భాగంగా వారినాట్లు కూడా మొదలుకానున్నాయి. రైతులకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను ముందస్తుగానే చేశాం.

Updated Date - 2022-11-27T00:46:19+05:30 IST