సబ్సిడీ గొర్రెలు ఏవీ?

ABN , First Publish Date - 2022-11-25T00:06:09+05:30 IST

సబ్సిడీ గొర్రెల పథకం ఆశావహులకు అందని ద్రాక్షల మారింది. మూడేళ్ల క్రితమే పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ గొర్రెలను అందజేయకపోవడంతో పథకంపై లబ్ధిదారులు ఆశలు వదులుకుంటున్నారు.

సబ్సిడీ గొర్రెలు ఏవీ?
గొర్రెల పెంపకం చేపడుతున్న లబ్ధిదారులు

- రెండో విడతలో 6,378 మందికి పంపిణీ చేయాల్సి ఉంది

- ఇప్పటికే లబ్ధిదారుల నుంచి దరఖాస్తు స్వీకరణ

- పెరిగిన నూతన యూనిట్‌ ధర

- లబ్ధిదారుల వాటా 25శాతం

- మార్గదర్శకాలు జారీ చేయని ప్రభుత్వం

- జిల్లాలో మొత్తం 17వేలకు పైగా గొల్లకుర్మ కుటుంబాలు

- ఇందులో మొదటి విడతలో 10వేల మందికి పైగా అందజేత

కామారెడ్డి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): సబ్సిడీ గొర్రెల పథకం ఆశావహులకు అందని ద్రాక్షల మారింది. మూడేళ్ల క్రితమే పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ గొర్రెలను అందజేయకపోవడంతో పథకంపై లబ్ధిదారులు ఆశలు వదులుకుంటున్నారు. మొదటి విడతలో కొంతమంది గొల్లకుర్మల లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను అందించిన ప్రభుత్వం ఉప ఎన్నికల సందర్భంగా రెండో విడత కింద మిగిలిన గొల్లకుర్మల కుటుంబాలకు గొర్రెలను పంపిణీ చేస్తామని ప్రకటిస్తూ వచ్చింది. హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా రెండో విడత గొర్రెల పంపిణీ మాత్రం జరగడం లేదు. రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం లేదని సంబంధితశాఖ అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ లబ్ధిదారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే సబ్సిడీ గొర్రెలు అందజేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

రెండో విడతకు 6,378 మంది లబ్ధిదారుల ఎదురుచూపులు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో గొర్రెల పంపిణీ, ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 17,174 గొల్లకుర్మ కుటుంబాలు ఉండగా 314 సొసైటీలు ఉన్నాయి. ప్రభుత్వం 2017 జూన్‌లో గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టగా జిల్లాలో ఉన్న లబ్ధిదారుల కుటుంబాలకు రెండు విడతల్లో పంపిణీ చేసేందుకు ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి విడతల్లో గొర్రెలు పొందిన లబ్ధిదారులు 10,779 అందించారు. మిగిలిన 6,378 మంది లబ్ధిదారులకు రెండో విడతలో పంపిణీ చేయనున్నారు. ఈ లబ్ధిదారుల నుంచి 25 శాతం వాటా కింద డీడీలు చెల్లించే పనిలో పడ్డారు.

పెరిగిన యూనిట్‌ ధర

పథకం ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం మార్కెట్‌లో గొర్రెలు, పొటెళ్ల ధరలు చాలా వరకు పెరగడంతో పథకం అమలు చేయడం సాధ్యం కావడం లేదని గొర్రెల పెంపకందారుల సహకార సంఘం పాలకవర్గం, అధికారులు ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి యూనిట్‌ ధరను రూ.50వేలకు పెంచింది. దీంతో రూ.1లక్షా 25వేలు ఉన్న యూనిట్‌ ధర ప్రస్తుతం రూ.1లక్షా 75వేలకు పెరిగింది. ఇందులో లబ్ధిదారుడి వాటా 25శాతం డీడీ రూపంలో జిల్లా పశు సంవర్థకశాఖ అధికారిక ఖాతా పేరున తీయాలి. మిగతా 75శాతం డబ్బును ప్రభుత్వం జమచేస్తే లబ్ధిదారుడికి 20 గొర్రెలు, 1 పొట్టేలు కొని ఇస్తారు. జిల్లాలో మొత్తం 314 గొర్రెల పెంపకం సంఘాలు ఉండగా అందులో 17,500 మంది సభ్యులు ఉన్నారు. సబ్సిడీ గొర్రెలు తీసుకున్న లబ్ధిదారులకు మూడేళ్ల పాటు దాణా అందిస్తారు. ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తారు.

మార్గదర్శకాలు జారీ చేయని ప్రభుత్వం

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా రెండో విడతలో గొల్లకుర్మల లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద గతంతో పోలిస్తే యూనిట్‌ కాస్ట్‌ ధర పెరగడంతో ప్రభుత్వం పెరిగిన ధరల ప్రకారమే గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో సుమారు 6 వేల మందికి పైగా లబ్ధిదారులు రెండో విడతకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి వద్ద నుంచి డీడీల రూపంలో లబ్ధిదారుడి వాటా సొమ్మును కట్టించుకున్నారు. డీడీల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించి అధికారులు ఈ లాబ్‌ పోర్టల్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి రిజిష్టర్‌ చేశారు. తద్వారా వచ్చే వర్చువల్‌ ఖాతాకు లబ్ధిదారులు తమ సొమ్మును ఆర్‌టీజీఎస్‌ ద్వారా నెఫ్ట్‌ ద్వారా గాని చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ పూర్తయి రెండు నెలలు గడుస్తోంది. గొర్రెల కొనుగోలు చేసేందుకు బడ్జెట్‌ను విడుదల చేయకపోగా మార్గదర్శకాలను సైతం జారీ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గొర్రెల పంపిణీకి మార్గదర్శకాలు జారీ చేసి పంపిణీ చేయాలని లబ్ధిదారుల నుంచి డిమాండ్‌ వస్తోంది.

Updated Date - 2022-11-25T00:06:09+05:30 IST

Read more