గడువులోగా ‘మన ఊరు మన బడి’ పూర్తిచేస్తాం

ABN , First Publish Date - 2022-12-09T00:44:15+05:30 IST

ప్రభుత్వ పాఠ శాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు.

గడువులోగా ‘మన ఊరు మన బడి’ పూర్తిచేస్తాం

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 8: ప్రభుత్వ పాఠ శాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేనలతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లు, అదనపు కలెక్టర్‌లతో ‘మన ఊరు-మన బడి’ పనులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9123 పాఠశాలలు ఎంపిక కాగా అందులో 96శాతం బడులకు పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చామని మంత్రి తెలిపారు. 30లక్షల పై చిలుకు విలువ కలిగిన పనులు చేపట్టాల్సి ఉన్న 257 బడులను మినహాయిస్తే మిగతా పాఠశాలల్లో పనులు ప్రారంభమై వివిధ దశల్లో కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే 300 బడులలో సివిల్‌ వర్క్స్‌ పూర్తయి పేంటింగ్‌ పూర్తి చేసుకోగలిగామన్నారు. మరో 400 పాఠశాలల్లో పేంటింగ్‌ పనులు జరుగుతున్నాయన్నారు. వారం క్రితమే వంద కోట్ల నిధులు విడుదల చేశామని గురువారం ఒక్కరోజే ఎఫ్‌టీవోలు జనరేట్‌ అయిన వాటికి సంబంధించి 40కోట్లు డ్రా అయ్యా యని మంత్రి తెలిపారు. ఈ నెలాఖరునాటికి ప్రతీ మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో పనులన్నీ సంపూర్ణంగా జరిగేలా చూడాలన్నారు. మార్చి నెలాఖరునాటికి మొత్తం 9123 పాఠశాలల్లో పనులు పూర్తయ్యేలా ప్రణాళికబద్ధంగా పర్యవేక్షణ జరపాలన్నారు. 30లక్షల పైచిలుకు విలువ కలిగిన పనులను స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రౌండింగ్‌ జరిగేలా కృషి చేయాలన్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి ఎంపిక చేసిన బడుల్లో ల్రైబ్రరీలు ప్రారంభం కావాలన్నారు.

కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడతగా మంజూరు తెలిపిన మొత్తం 114 పాఠశాలల్లో గడువులోపు పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే సివిల్‌ పనులు పూర్తయిన బడులలో 8 బృందాలచేత పేంటింగ్‌ పనులు జరుగుతున్నాయని పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా క్షేత్రస్థాయిలో బృందాలను బడులను సందర్శించి పర్యవేక్షణ చేసేలా ఏర్పాటు చేశామన్నారు. మండల లైబ్రరీల కోసం అవసరమైన గదులను ఎంపిక చేసి సిద్ధంగా ఉంచామన్నారు. 30లక్షల పైచిలుకు విలువల కలిగిన పనులు చేపట్టేందుకు ఏజెన్సీలు ముందుకు రానందున పాఠశాల యాజమాన్యాల చేత పనులు జరిపంచేందుకు అనుమతించే పనులు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ కోరారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ ఆఫీసర్‌ నర్ర రామారావు, ఇంజనీరింగ్‌ విభాగం అదికారులు, తదితరులు పాల్గొన్నారు.

పార్కును పది రోజుల్లో పూర్తిచేయాలి..

మాక్లూర్‌: చిన్నాపూర్‌ అర్బన్‌ పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పది రోజుల్లో పనులన్నీ పూర్తికావాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అర్బన్‌ పార్కును కలెక్టర్‌ ఫారెస్టు జిల్లా అధికారి వికాస్‌మీనాతో కలిసి పరిశీలించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌లు, ప్లేజోన్‌ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, సర్కులేషన్‌ ట్యాంక్‌లు, వాష్‌ టవర్‌లు, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించి ఫారెస్టు అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కుకు నిధుల కొరత ఏమాత్రం లేదని అదనంగా మరో రూ.5 కోట్ల నిధులను ప్రభుత్వం త్వరలో మంజూరు చేయనుందని తెలిపారు. పిల్లలకు ఆటవిడుపు కోసం ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్స్‌ ప్లే జోన్‌ ఏరియాతో పాటు ప్రధాన ప్రవేశ మార్గానికి ఇరువైపుల పర్యటకులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా అటవీశాఖ అధికారి వికాస్‌మీన, ఎఫ్‌డీవో భవాని శంకర్‌, తహసీల్దార్‌ శంకర్‌, ఎంపీడీవో క్రాంతి, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారులు సౌమ్య, అశోక్‌కుమార్‌, లక్ష్మి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T00:44:16+05:30 IST