తగ్గని జోష్‌

ABN , First Publish Date - 2022-03-16T05:47:18+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారి పక్కన అడ్లూర్‌ శివారులో గతంలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ టౌన్‌షిప్‌ ఇళ్లను, ప్లాట్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టగా గత రెండు రోజుల నుంచి ధరణి టౌన్‌షిప్‌ పేరుతో ప్లాట్లను అమ్మకానికి పెట్టింది.

తగ్గని జోష్‌
ధరణి టౌన్‌షిప్‌

- రెండో రోజు మరింత ఆసక్తి చూపిన కొనుగోలుదారులు

- ధరణి టౌన్‌షిప్‌లో ప్లాట్ల కొనుగోలుకు పెరుగుతున్న డిమాండ్‌

- తొలిరోజు 62 ప్లాట్లు విక్రయించగా రెండో రోజు 70 ప్లాట్ల విక్రయం

- అఽత్యధికంగా రెండో రోజు గజానికి రూ.15,300

- రెండో రోజు రూ.15 కోట్ల ఆదాయం

- మరో రెండు రోజుల పాటు కొనసాగనున్న వేలం పాట


కామారెడ్డి, మార్చి 15: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారి పక్కన అడ్లూర్‌ శివారులో గతంలో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ టౌన్‌షిప్‌ ఇళ్లను, ప్లాట్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టగా గత రెండు రోజుల నుంచి ధరణి టౌన్‌షిప్‌ పేరుతో ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. సోమవారం 69 ప్లాట్లు ఓపెన్‌ టెండర్‌లో విక్రయించగా రూ.14 కోట్ల ఆదాయం వచ్చింది. రెండో రోజు మంగళవారం మరింత జోష్‌ కొనసాగింది. 70 ప్లాట్లకు గాను రూ.26.85 కోట్ల ఆదాయం సమకూరింది. ప్లాట్లను ఓపెన్‌ టెండర్‌లో కొనుగోలు చేసేందుకు ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు ఆసక్తి చూపారు. ఇప్పటికే గతంలో ఈ రాజీవ్‌ స్వగృహ ఇళ్లను ప్లాట్లను పొందేందుకు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వారికి సైతం దరఖాస్తు డబ్బులను జిల్లా అధికారులు తిరిగి ఇప్పించారు. రూ.10 వేల డిపాజిట్‌ చేసి టెండర్లలో పాల్గొనాలని గజానికి రూ.7వేల ధరను నిర్ణయించారు. ముందుగా రూ.10వేల గజానికి నిర్ణయించగా కొనుగోలుదారుడు ఆసక్తిచూపుతారో లేదోననే అనుమానంతో పాటు అవగాహన సదస్సులో గజం ధర ఎక్కువ ఉందని పలువురు కలెక్టర్‌కు తెలియపరిచారు. దీంతో ధరను సడలించారు.

గ్రేటర్‌ కమ్యూనిటీ తరహాలో స్వగృహ ఇళ్లు

పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించేందుకు 2001లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన 63 ఎకరాల స్థలంలో గ్రేటర్‌ కమ్యూనిటీ తరహాలో 543 విల్లాలు నిర్మించాలని నిర్ణయించారు. 100, 150, 200, 266 చదరపు గజాల విస్తీర్ణంలో విల్లాలు నిర్మించేందుకు పనులు కూడా ప్రారంభించారు. ఇందులో 310 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. డూబ్లెక్స్‌ తరహాలో విల్లాలు నిర్మించారు. వంద ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. మరో 210 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండిపోయాయి. వీటితో పాటు ఈ టౌన్‌షిప్‌లో మరో 230 ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. వీటిని అమ్మకం పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా గత రెండు రోజుల నుంచి ప్లాట్లకు సంబంధించిన ఓపెన్‌ టెండర్లను నిర్వహిస్తున్నారు. ఇళ్లను సైతం మరోమారు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేపడుతున్నారు.

ఓపెన్‌ టెండర్ల ద్వారా అమ్మకం

రాజీవ్‌ స్వగృహ కార్పోరేషన్‌ ద్వారా విల్లాలతో పాటు స్థలాలను అమ్మేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రేటర్‌ కమ్యూనిటీ వద్ద పెరిగిపోయిన చెట్లను ఇప్పటికే తొలగించి రోడ్లు శుభ్రంచేసే పనులు మొదలుపెట్టారు. మొత్తం వెంచర్‌ను క్లీన్‌ చేసిన తర్వాత ప్లాట్లను ఉన్నది ఉన్నట్లుగా అమ్మకానికి పెట్టారు. అలాగే  ఇళ్లను కూడా అమ్మనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో ఓపెన్‌ టెండర్ల ద్వారా విక్రయించేందుకు ప్రణాళికలు తయారు చేసి అమలు పరుస్తున్నారు. తొలిరోజు 62 ప్లాట్లు విక్రయించగా రూ.14కోట్ల ఆదాయం వచ్చింది. రెండో రోజు 70 ప్లాట్లు విక్రయించగా అత్యధికంగా గజానికి రూ.15,300 ధర పలుకగా రూ.26.85 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇప్పటికే పూర్తయిన పనులు

ధరణి టౌన్‌షిప్‌లో ఇళ్లను, ప్లాట్లను అమ్మేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.  కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ఆధ్వర్యంలో సంబంధిత శాఖ అధికారులు ఈ టౌన్‌షిప్‌లో ప్రతిరోజూ పనులను పర్యవేక్షించి దశాబ్దకాలంగా  పట్టింపులేకుండా ఉండడంతో పూర్తిస్తాయిలో మార్పులు చేశారు. ఏపుగా పిచ్చిమొక్కలు పెరిగి, రహదారులు లేకపోవడం, విద్యుత్‌, మంచినీటి, డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మూలనపడిన టౌన్‌షిప్‌కు కొత్తరూపం తీసుకువచ్చారు. త్వరలో బీటీ రోడ్లు, విద్యుత్‌, తాగు నీరు, డ్రైనేజీ సౌకర్యాలను కల్పించనున్నారు.


మరో రెండు రోజులే అవకాశం

- జితేష్‌ వి.పాటిల్‌, కలెక్టర్‌

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధరణి టౌన్‌షిప్‌లో ప్లాట్లు పొందేందుకు మరో రెండు రోజులే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని తెలిపారు. గత రెండు రోజులుగా ధరణి టౌన్‌షిప్‌లో ప్లాట్ల వేలానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి రోజు అత్యధికంగా గజానికి రూ.14 వేలు పలుకగా రెండో రోజు రూ.15,300 ధర పలికింది.

Read more