టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

ABN , First Publish Date - 2022-11-16T00:34:07+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయి బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం

కమ్మర్‌పల్లి, నవంబరు 15: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయి బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. మంగళవారం మండలంలోని ఇనాయత్‌నగర్‌ నుంచి బీజేపీ నాయకుడు డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి చేపట్టిన ‘జనంతో మనం’ మహా పాదయాత్రను బాల్కొండ నియోజకవర్గంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటూ పబ్బంగడుపుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెక్‌డ్యామ్‌లు తెచ్చాడని పాలాభిషేకాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. నిధుల్లో కేంద్రం వాటా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో మూతబడిన షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపించే దమ్ము టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి లేదన్నారు. రైతు సమస్యలపై ఉద్యమాలు నడిపిన 25 మంది రైతుసోదరులు బీజేపీలో చేరారని చెప్పారు. ఉచిత కరెంటు అంటూ మనల్ని అప్పుల్లో నెట్టుతున్నాడని మండిపడ్డారు. పలు రాష్ట్రాల్లో సోలార్‌ పంప్‌సెట్లను 40 శాతం రైతులకు సబ్సిడీపై అందజేస్తుందని తెలిపారు. సోలార్‌ ప్లాంట్‌లతో కరెంటు బిల్లులకు చెక్‌ పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుంటుపడిందని, 33 జిల్లాల్లో విద్యాశాఖ అధికారుల పోస్టులు 27 ఖాళీగా ఉన్నాయన్నారు. కవిత ఎంపీగా ఐదేళ్లలో రైతులకు బైలర్లు, పాటిటవర్లు, టార్ఫాలిన్లు పంపిణీ చేసిన దానికంటే తాను అతితక్కువ కాలంలో పదింతలు అందించానన్నారు. బాల్కొండ నియోజికవర్గంలో డాక్టర్‌ మల్లికార్జున్‌ రెడ్డి 14 రోజులు 222 కిలో మీటర్ల 62 గ్రామాల్లో పాదయాత్ర ఉంటుందన్నారు. ఈ పాదయాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులు వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. అన్నపూర్ణమ్మను బీజేపీలో కావాలని చేర్చుకున్నామన్నారు. రానున్న కాలంలో బాల్కొండ నియోజవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తదేనన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కట్ట సంజీవ్‌, భూమారెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T00:34:08+05:30 IST