ఈకేవైసీకి నేడే చివరి రోజు

ABN , First Publish Date - 2022-09-22T05:16:07+05:30 IST

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి అర్హులైన రైతులు ఈకేవైసీ చేసుకునేందుకు ఇంకా ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. రైతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకం పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి. ఈ పథకం కింద ఇప్పటికే 11 విడతలుగా డబ్బుల రైతుల ఖాతాల్లో జమ కాగా త్వరలో 12వ విడత డబ్బులు కూడా అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే ఈ దఫా నుంచి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అకౌంట్లో పడనున్నాయి.

ఈకేవైసీకి నేడే చివరి రోజు
సదాశివనగర్‌లో ఈకేవైసీ రైతులకు కల్పిస్తున్న ఏవో ప్రజాపతి

- మళ్లీ పొడగిస్తారా లేదోనని రైతుల్లో సందోహం
- ఇప్పటికే పలుమార్లు గడువుపెంచిన ప్రభుత్వం
- ఈకేవైసీ చేసుకోకపోతే పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి డబ్బులు రానట్లే
- ఇప్పటికే అనేకసార్లు రైతులను చైతన్యపరిచిన అధికారులు

సదాశివనగర్‌, సెప్టెంబరు 21:
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధికి అర్హులైన రైతులు ఈకేవైసీ చేసుకునేందుకు ఇంకా ఒక్కరోజే గడువు మిగిలి ఉంది. రైతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకం పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధి. ఈ పథకం కింద ఇప్పటికే 11 విడతలుగా డబ్బుల రైతుల ఖాతాల్లో జమ కాగా త్వరలో 12వ విడత డబ్బులు కూడా అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే ఈ దఫా నుంచి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అకౌంట్లో పడనున్నాయి. 11వ విడతకు ముందే రైతులు ఈకేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల వారిగా పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు ఈకేవైసీ చేసుకోని పక్షంలో డబ్బులు బ్యాంక్‌ అకౌంట్‌లో పడవని అధికారులు హెచ్చరిస్తున్నారు. గడువు సమీపించడంతో మిగిలిన వారు నేడు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు గడువు పెంచిన దృష్ట్యా మరోమారు పెంచదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈకేవైసీ చేసుకోని వారికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు రానట్లేనని తెలుస్తోంది.
నేటితో ముగియనున్న గడువు
మొదటగా ఆగస్టు 31 తేదీ వరకు  గడువు చివరి తేదీగా ప్రకటించారు. అయినా కొంతమంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదు. దీంతో తేదీ గడువును పెంచి ఈ నెల 22 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈకేవైసీ పూర్తి చేయలేని రైతులకు ఈ విడత నుంచి డబ్బులు ఖాతాల్లో పడే అవకాశం లేదని తేల్చి చెప్పింది. 2019లో రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్‌ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ రూ.6వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రతీ నాలుగు నెలలకు రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున మూడు దఫాలుగా వేస్తోంది.
ఈకేవైసీ తప్పనిసరి
ఈకేవైసీ పూర్తికాక కొంత మంది రైతులకు 11వ విడత డబ్బులు రాలేదు. ఈకేవైసీ ఇప్పటికే పూర్తి చేయకుంటే 12వ విడత డబ్బులు కూడా అందకుండా పోతాయి. అందుకే భూములున్న రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేసిన వారికి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈకేవైసీ పూర్తి చేయాలంటే తప్పకుండా ఫోన్‌ నెంబర్‌ ఆధార్‌తో లింక్‌ అయ్యి ఉండాలి. ఆధార్‌ లింక్‌ లేకుంటే మీ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్‌కు వెళ్లి ఆధార్‌తో ఫోన్‌ నెంబర్‌ లింక్‌ చేయాలి.
ఇలా చేసుకోవాలి
ముందుగా పీఎం కిసాన్‌.గౌట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌కు వెళితే అందులో ఫార్మర్‌ కార్నర్‌ ఉంటుంది. ఫార్మర్‌ కార్నర్‌లో మొదటి ఆప్షన్‌ ఈకేవైసీ ఉంటుంది. ఈకేవైసీని క్లిక్‌ చేసి అక్కడ మీ ఆధార్‌ నెంబర్‌ను ఎంట్రీచేసి సెర్చ్‌పై క్లిక్‌ చేయాలి. ఈ తర్వాత ఆధార్‌ లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. తర్వాత గెట్‌ ఓటీపీ క్లిక్‌ చేస్తే మీ మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేస్తే ఈకేవైసీ ప్రక్రియపూర్తి అవుతుంది.

Read more