రెండో విడత దళితబంధుకు కసరత్తు

ABN , First Publish Date - 2022-10-01T05:28:30+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దళితబంధు పథకాన్ని అమలులోకి తెచ్చింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు పథకాన్ని రెండో విడతలో మరికొందరికి లబ్ధి చేకూరనుంది.

రెండో విడత దళితబంధుకు కసరత్తు
ఇటీవల నిజాంసాగర్‌ మండలంలో దళితబంధు లబ్ధిదారులకు వాహనాలను అందించిన దృశ్యాలు

- ఒక్కో నియోజకవర్గానికి 500 కుటుంబాలకు
- నాలుగు నియోజకవర్గాల్లో 1,750 మందికి ఇచ్చేందుకు చర్యలు
- జిల్లాలో మొదటి విడతలో 350 కుటుంబాలకు ప్రయోజనం
- పైలెట్‌ ప్రాజెక్ట్‌కు ఎంపికైన నిజాంసాగర్‌లో 1,298 మందికి లబ్ధి
- ట్రాన్స్‌పోర్టు వాహనాలకే మొగ్గు చూపుతున్న లబ్ధిదారులు
- యూనిట్ల కేటాయింపులో జిల్లా మొదటి స్థానం


కామారెడ్డి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వం దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దళితబంధు పథకాన్ని అమలులోకి తెచ్చింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు పథకాన్ని రెండో విడతలో మరికొందరికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే మొదటి విడతలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసిన మండలంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను అందజేశారు. దళితబంధు పథకం యూనిట్ల పంపిణీలో రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 1,648 మందికి లబ్ధి చేకూరింది. రెండో విడతలోనూ ఈ యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో విడుతకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సైతం ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మొదటి విడతలో 1,648 మందికి లబ్ధి
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి 100 మంది చొప్పున దళితబంధుకు దళితులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం అందజేసేందుకు మొదటి విడతలో నిర్ణయించింది. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గంలోనూ లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యేలకే ప్రభుత్వం అప్పగించింది. జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలు చేపట్టి లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో ఆయా గ్రామాల్లో 100 మందిని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 7 మండలాల్లో 100 మంది, జుక్కల్‌ నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో 100 మందిని, బాన్సువాడ నియోజకవర్గంలో 3 మండలాల్లో 50 మంది చొప్పున మొత్తం 350 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.10 లక్షల విలువచేసే యూనిట్లను అందజేశారు. దళితబంధు పథకానికి పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపికైన జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలంలో 1,298 కుటుంబాలకు దళితబంధు మంజూరైంది. ఇటీవల జరిగిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు.
రెండో విడతలో ఒక్కో నియోజకవర్గానికి 500 యూనిట్లు
జిల్లాలో దళితబంధు పథకం కింద మొదటి విడతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మందికి మంజూరు చేశారు. అయితే ఇటీవల నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో ప్రతీ నియోజకవర్గానికి రెండో విడతలో 500 మంది చొప్పున దళితబంధు యూనిట్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో 500 మంది చొప్పున మొత్తం 1500 మందికి, బాన్సువాడ నియోజకవర్గంలో 250 మందికి ప్రయోజనం చేకూరనుంది. దీంతో జిల్లాలో రెండో విడతలో 1,750 కుటుంబాలకు లబ్ధి కల్గుతుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. అయితే దళితబంధు యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులు ఎక్కువగా వాహనాలవైపే మొగ్గు చూపుతున్నారు. మొదటి విడతలో లబ్ధిదారులు ఎక్కువగా ట్రాన్స్‌ఫోర్ట్‌ వాహనాలతో పాటు హర్వేస్టింగ్‌లు, జేసీబీలు ఎంపిక చేసుకున్నారు. వీటితో పాటు పెంట్‌హౌజ్‌, డెయిరీ ఫాంలను మరికొందరు ఎంపిక చేసుకున్నారు. రెండో విడతలోనూ ఇవే యూనిట్లను అందజేయనున్నట్లు సంబందిత శాఖ అధికారులు చెబుతున్నారు.
అవసరం కానున్న రూ.175 కోట్లు
జిల్లాలో రెండో విడత దళితబంధుకు రూ.175 కోట్లు అవసరం కానున్నాయి. మొదటి విడతలో జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో 1,648 కుటుంబాల కోసం దాదాపు 165 కోట్లు ఖర్చు చేశారు. దళితబంధు పథకం కింద ఒక్కో యూనిట్‌కి రూ.10లక్షల చొప్పున లబ్ధిదారునికి ప్రభుత్వం కేటాయించనుంది. లబ్ధిదారుల ఖాతాలోని ఈ యూనిట్‌ నగదును ప్రభుత్వం జమ చేయనుంది. ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున రెండో విడతలో 1,750 లబ్ధిదారులకు గాను రూ.175 కోట్లు ఖర్చు కానున్నాయి. మొదటి విడతలో లబ్ధిదారుల ఎంపిక ప్రకియ ఎమ్మెల్యేలే ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించారు. రెండో విడతలోనూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సూచించిన వారినే లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు తమకు అనుకూలమైన వారి పేర్లను సిఫారస్‌ చేసుకుంటున్నారు. మొదటి విడతలో అవకాశం దక్కని వారు రెండో విడతలోనైన అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేలు, చోటామోటా నాయకులతో పాటు సంబంధిత శాఖ అధికారుల చుట్టూ దళితబంధు యూనిట్ల కోసం తిరుగుతున్నారు.

Read more