మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2022-11-12T00:31:12+05:30 IST

మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ ఎస్‌ బాలుర పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతతకు గురయ్యారు.

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో

నవీపేట, నవంబరు 11: మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ ఎస్‌ బాలుర పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతతకు గురయ్యారు. పాఠశాలలో 277 మంది విద్యార్థులు చదువుకుంటుండగా శుక్రవారం 188 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత సుమారు 3 నుంచి 4 గంటల సమయంలో పలువురు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొంత మందికి తలనొప్పి, కడుపు నొప్పి వచ్చింది. దీంతో వారిని నవీపేటలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో ప్రశాంత్‌ 8వ తరగతి, రాజు 6వ తరగతి, రోహాన్‌ 6వ తరగతి, నరేష్‌ 7వ తరగతి, సేవక్‌లాల్‌ 6వ తరగతి, అశోక్‌ 8వ తరగతి, కృష్ణ 7వ తరగతి అనే విద్యార్థులను ఆసుపత్రిలో చేరారు. డీఎంహెచ్‌వో సుదర్శనం ఆస్పత్రికి వచ్చి బాధిత విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం వికటించి 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వారిని నవీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, వీరిలో ఏడుగురు తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా వారికి చికిత్స అందిస్తున్నామని అన్నారు. మిగిలిన వారిని ఇంటికి పంపించడం జరిగిందని, చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి ప్రమాదం లేదని, ఈ విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని అన్నారు. బాధిత విద్యార్థులను తహసీల్దార్‌ వీర్‌సింగ్‌ పరిశీలించారు. ఇదిలా ఉండగా ఆసుపత్రికి తరలివచ్చిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అస్వస్థతకు గురైనా తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని వారిని నిలదీశారు. డీఎంహెచ్‌వో సుదర్శనం, తహసీల్దార్‌ వీర్‌సింగ్‌లు శుక్రవారం రాత్రి నవీపేటలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనానికి ఉపయోగించిన బియ్యంతో పాటు వంటలో ఉపయోగించిన సరుకులను పరిశీలించారు. బియ్యం జాలీలు కట్టి ఉండటాన్ని అధికారులు గమనించారు. సంబంధిత వస్తువులను సీజ్‌ చేసి ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కూరగాయలతో కూడిన పప్పును అందించాం..

- అనురాధ, ప్రధానోపాధ్యాయురాలు

మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అన్నంతో పాటు కూరగాయాలతో కూడిన పప్పును భోజనంలో అందించడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల తరువాత పలువురు విద్యార్థులు వాంతులు చేసుకోగా మరికొందరికి తలనొప్పి, కడుపు నొప్పి రావడం జరిగింది. వెంటనే వారిని నవీపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.

Updated Date - 2022-11-12T00:31:12+05:30 IST

Read more