పండుగకు ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2022-09-25T06:12:31+05:30 IST

తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలే ప్రధానమైనవి. ఈ పండుగల సందర్భంగా విద్యాసంస్థలకు ఆదివారం నుంచి విద్యాశాఖ సెలువులు ప్రకటించింది.

పండుగకు ప్రత్యేక బస్సులు
కామారెడ్డి బస్టాండ్‌లో బస్సులు

అదనపు సర్వీసులు సిద్ధం చేసిన ఆర్‌టీసీ

రీజియన్‌ వ్యాప్తంగా 315 బస్సులు నడిపేలా ప్రణాళిక

చార్జీల పెంపు లేకపోవడంతో ఆదరణ ఉంటుందని ఆశాభావం

కామారెడ్డి, సెప్టెంబరు 24: తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగలే ప్రధానమైనవి. ఈ పండుగల సందర్భంగా విద్యాసంస్థలకు ఆదివారం నుంచి విద్యాశాఖ సెలువులు ప్రకటించింది. దీంతో పిల్లాపాపలతో సహా కుటుంబాలు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏ ర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆర్టీసీ వచ్చేనెల 4 వర కు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. నిజామాబాద్‌ రీజియన్‌లోని నిజామాబాద్‌-1,2, ఆర్మూర్‌, బోదన్‌, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు 315 ప్రత్యేక సర్వీసులు తిప్పనున్నారు. ఇందులో హైదరాబాద్‌ రూట్‌లోనే అత్యధికంగా బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రత్యేక సర్వీసుల్లో రిజర్వేషన్‌ సౌకర్యం కూడా ఉండగా, గతంలో మాదిరి అదనపు చార్జీలేవి లేకుండా సాధారణ చార్జీలతో ఈ ప్రత్యేక సర్వీసులు నడపనుండడం విశేషం.

వచ్చే నెల 4 వరకు సర్వీసులు

ఆర్టీసీ పండుగల సందర్భంగా శనివారం నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది. శనివారం నుంచి వచ్చేనెల 4 వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తామని, దసరా పండుగ అయిన వచ్చేనెల 5వ తేదీన విరామం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక పండుగ అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా 6వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటురీజియన్‌లోని ఆరు డిపోల నుంచి హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటుచేయనున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు బస్సుల సంఖ్య పెంచేలా సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల నుంచి హైదరాబాద్‌తో పాటుగా కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు కూడా ఈ బస్సులు నడవనున్నాయి.


సాధారణ చార్జీలే..

ప్రత్యేక బస్సుల్లో ఈ సారి అదనపు చార్జీలేవి ఉండవని అధికారులు వెల్లడించారు. గతంలో పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటుచేసే సర్వీసుల్లో సాధారణానికి మించి ఎక్కువ చార్జీలు ఉండేవి. కానీ గత ఏడాది నుంచి ప్రత్యే క బస్సులో 50 శాతం అదనపు చార్జీలు వసూ లు చేయడం లేదు. దీంతో ప్రయాణికుల నుంచి ఆదరణ లభించి, ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా కామారెడ్డిలో 53, బాన్సువాడలో 51, నిజామాబాద్‌-1లో 54, నిజామాబాద్‌-2లో 54, ఆర్మూర్‌లో -50, బోధన్‌లో 53 సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

315 బస్సుల ఏర్పాటు..

- ఉష, ఆర్‌ఎం, నిజామాబాద్‌

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రీజియన్‌లోని 6 డిపోల నుంచి 315 బస్సులను నడపనున్నాం. అయితే ప్రయాణికుల రద్దీ పెరిగితే అప్పటికప్పుడు అదనంగా బస్సులు ఏర్పాటుచేస్తాం. పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని వివిధ రూట్లకు ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధంచేశాం. 49 బస్సులకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం సైతం కల్పించాం.


Read more