సాదాసీదాగా బడ్జెట్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-03-04T07:07:42+05:30 IST

నిజామాబాద్‌ నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం గురువారం సాదాసీదాగా జరిగింది. నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో మేయర్‌ నీతూకిరణ్‌ అధ్యక్షతన నిర్వహించిన 2022-23 బడ్జెట్‌ సమావేశంలో రూ. 260 కోట్ల 77లక్షల అంచనా బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు.

సాదాసీదాగా బడ్జెట్‌ సమావేశం

నిజామాబాద్‌అర్బన్‌, మార్చి 3: నిజామాబాద్‌ నగరపాలక సంస్థ బడ్జెట్‌ సమావేశం గురువారం సాదాసీదాగా జరిగింది. నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో మేయర్‌ నీతూకిరణ్‌ అధ్యక్షతన నిర్వహించిన 2022-23 బడ్జెట్‌ సమావేశంలో రూ. 260 కోట్ల 77లక్షల అంచనా బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఇన్‌చార్జి కమిషనర్‌ చిత్రమిశ్రాలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర సవరణ బడ్జెట్‌తో పాటు 2022-23 ఆర్థిక సంవత్సరం కోసం రూ పొందించిన అంచనా బడ్జెట్‌ను ఆమోదం తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను మిగులు బడ్జెట్‌ 82కోట్ల 60లక్షలు కాగా 2022-23 సంవత్సరానికిగాను అన్ని మార్గాల ద్వారా సమకూరే ఆదాయం 260 కోట్ల 77లక్షల 52వేలుగా ప్రతిపాదించారు. ఇందులో పన్నుల ద్వారా నేరుగా 74కోట్ల 66లక్షల 52వేల ఆదాయం డిపాజిట్లు, అప్పుల ద్వారా 13 కోట్ల 20లక్షలు సమకూరుతాయని తెలిపారు. గ్రాంట్స్‌ రూపంలో 172 కోట్ల 91 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వ్యయానికి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 74 కోట్ల 63లక్షల 25వేల ఖర్చు అవుతుందని తెలిపారు. కార్పొరేషన్‌ ఆదాయం నుంచి గ్రీన్‌ బడ్జెట్‌ కింద 10శాతం 8కోట్ల 83లక్షల 45వేలు ప్రతిపాదించారు. 3వ వంతు నిధులను నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాలకు, మురికివాడలు, మైనార్టీ ఏరియాల అభివృద్ధికి వెచ్చించాలని పేర్కొన్నారు. పన్నుల వసూళ్లలో, కార్పొరేషన్‌కు రావాల్సిన ఆదాయం విషయంలో అధికారులు శ్రద్ధపెట్టడంలేదని కార్పొరేటర్లు గడుగు రోహిత్‌, న్యాలం రాజులు అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే పన్నుల వసూళ్ల విషయంలో కార్పొరేషన్‌ మెరుగైందని విస్తృతస్థాయిలో సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నందున ట్యాక్స్‌లు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కార్పొరేటర్ల సమస్యలపై సత్వరమే పరిష్కరిస్తామని ఇన్‌చార్జి కమిషనర్‌ చిత్రమిశ్రా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ ఇద్రిస్‌ఖాన్‌, డిప్యూటీ కమిషనర్‌ రవిబాబు, బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ స్రవంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read more