కీచక గురువులు!

ABN , First Publish Date - 2022-12-08T01:49:37+05:30 IST

సమాజంలో గురువులకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. తల్లిదండ్రుల తర్వాత పిల్లలు అన్ని విషయాల్లోనూ గురువులనే ఆదర్శంగా తీసుకుంటారు. ఇంట్లోకంటే ఎక్కువగా పిల్లలు బడిలో ఉంటూ ఉపాధ్యాయులతో తమ అనుబంధాన్ని పెంచుకుంటారు.

కీచక గురువులు!

ఉపాధ్యాయుల ముసుగులో దారుణాలు

వికృతచేష్టలకు పాల్పడుతున్న టీచర్లు

ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన ఘటనలు

ఆందోళనలో తల్లిదండ్రులు

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 7: సమాజంలో గురువులకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. తల్లిదండ్రుల తర్వాత పిల్లలు అన్ని విషయాల్లోనూ గురువులనే ఆదర్శంగా తీసుకుంటారు. ఇంట్లోకంటే ఎక్కువగా పిల్లలు బడిలో ఉంటూ ఉపాధ్యాయులతో తమ అనుబంధాన్ని పెంచుకుంటారు. బాలికలైతే గురువులను తమ తండ్రిలాగా భావిస్తారు. కానీ కొందరు ఉపాధ్యాయుల వెకిలి చేష్టల వల్ల సమాజంలో గురువులపై ఉండే గౌరవం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ థాయ్‌లాండ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నంతోపాటు ఇటీవల జిల్లా కేంద్రంలో బాలికల పట్ల ఓ ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలు వెలుగులోకి రాగా.. వస్తుండగా ఇంకా బయటకు రాని ఘటనలు ఎన్నో ఉన్నాయి. తండ్రిలాగా భావించి ఉపాధ్యాయులకు దగ్గరవుతున్న అభం శుభం తెలియని బాలికలకు వారిలోపల ఉన్న వక్రబుద్ధి తెలియడంలేదు. గురువులే కదా అని చనువుగా ఉంటే వారి వెకిలి చేష్టలకు బాలికలు బలవుతున్నారు. చూపులలో తేడా, బాలికలపై చేతులు వేయడం వంటివేకాకుండా ద్వందఅర్థం వచ్చే మాట లు మాట్లాడుతూ చాలామంది బాలికలను వేధిస్తున్నావారే. కొన్ని ఘటనలతో వేధింపులు బయటకు వస్తున్న ఎంతోమంది బాలికలు కీచక గురువులతో ఇబ్బందులు పడుతూ బయటకు చెప్పలేక మానిసిక సంఘర్షణకు గురవుతున్నారు. చాలామంది బాలికలు గ్రామీణ ప్రాంతాల్లో గురువుల వికృత చేష్టలకు చదువును మధ్యలోనే ఆపివేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి గురువులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

బలవుతున్న బాల్యం!

తమ దృష్టిలో హీరోలుగా ఉండే గురువులలో ఉన్న కీచక బుద్ధిని గ్రహించలేక ఎంతోమంది బాలికలు చిన్న వయసులోనే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు వెలుగుచూసిన ఘటనల్లో బాలికలను ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, తలనిమరడం, అదోలాచూస్తూ సైగలు చేయడం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇం కా వెలుగులోకి రాని అనేక విషయాలు ఉన్నాయి. పెద్ద తరగతుల బాలికలైతే కొన్ని విషయాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు కానీ 6,7 తరగతుల బాలికలు కొన్ని విషయాలను బయటకు చెప్పలేకపోతున్నారు. గురువులంటే భయం, చెబితే ఏమవుతుందోనన్న ఇబ్బందులతో చాలామంది బాలికలు తమకు జరుగుతున్న దారుణాలను బయటకు చెప్పలేక మానసికంగా ఆందోళన చెందుతున్నారు. ఇళ్లలో ఉండే ఇబ్బందులు, ఉపాధ్యాయులు మానసిక స్థితి, వ్యక్తిగత జీవితంలో సమస్యలు, తదితర ఇబ్బందులు ఉన్న వారు ఎక్కువగా పాఠశాలల్లో బాలికలపట్ల వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

సమాజంలో బాలికలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపట్ల కఠినమైన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాలస్థాయిలో వేధింపులవల్ల బాలికల భవిష్యత్‌లో ఇబ్బందులు పడే అవకాశం ఉన్న దృష్ట్యా ఇలాంటి ఘటనలు జరగకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చట్టాలపట్ల బాలికలకు విస్తృతమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని విషయాలను బయటకు చెప్పలేక బాలికలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న దృష్ట్యా నెలకోసారి పాఠశాలల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం ఉంది. బాలికలపై వేదింపులు, ఇతర వెకిలిచేష్టలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయో అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో పాఠశాలల్లో సూచికలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పోక్స్‌ వంటి చట్టాలు ఉన్నా ఇంకా కఠినమైన చట్టాలను అమలు చేయాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Updated Date - 2022-12-08T01:49:38+05:30 IST