రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం

ABN , First Publish Date - 2022-02-23T05:53:54+05:30 IST

భూముల మార్కెట్‌ విలువ పెంపు రిజిస్ర్టేషన్‌లపై పడింది. భూముల వాల్యుతో పాటు రిజిస్ర్టేషన్‌ల ఫీజు పెరగడంతో జిల్లాలో రిజిస్ర్టేషన్‌ల సంఖ్య భారీగా తగ్గింది. ఫీజులతో పాటు భూముల విలువ పెరగడంతో రియల్‌ ఎస్టేట్‌లో క్రయవిక్రయాలు తగ్గాయి.

రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం

పెరిగిన భూముల విలువ, రిజిస్ట్రేషన్‌ ఫీజు

తగ్గిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

గత నెలలో భారీగా రిజిస్ట్రేషన్లు

అక్రమ రిజిస్ట్రేషన్‌లపై కొనసాగుతున్న విచారణ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనవరిలో 7,542 డాక్యుమెంట్‌ల రిజిస్ట్రేషన్‌లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భూముల మార్కెట్‌ విలువ పెంపు రిజిస్ర్టేషన్‌లపై పడింది. భూముల వాల్యుతో పాటు రిజిస్ర్టేషన్‌ల ఫీజు పెరగడంతో జిల్లాలో రిజిస్ర్టేషన్‌ల సంఖ్య భారీగా తగ్గింది. ఫీజులతో పాటు భూముల విలువ పెరగడంతో రియల్‌ ఎస్టేట్‌లో క్రయవిక్రయాలు తగ్గాయి. భూముల రేట్లు పెరుగుతున్నాయనే సమాచారంతో గత నెలలో ఎక్కువ మొత్తంలో రిజిస్ర్టేషన్‌లు కాగా వాటిలో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో అధికారులు ఇంకా తనిఖీలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు సబ్‌ రిజిస్ర్టార్‌లను సస్పెండ్‌ చేయగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  ఫ జనవరిలో రిజిస్ట్రేషన్లు అధికం..

జిల్లాలో గత నెలలో ఎన్నడూ జరగనన్ని రిజిస్ర్టేషన్‌లు జరిగాయి. భూముల మార్కెట్‌ విలువతో పాటు రిజిస్ర్టేషన్‌ ఫీజులు ఫిబ్రవరి నుంచి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయడంతో భారీగా రిజిస్ర్టేషన్‌లు జరిగాయి. వ్యవసాయేతర ఆస్తులతో పాటు అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లు, ఇతర స్థలాలను రిజిస్ర్టేషన్‌లు చేసుకున్నారు. వీటితో పాటు ఎలాంటి నాలాకన్వెర్షన్‌ లేని భూములను కూడా ప్లాట్లుగా చేసి రిజిస్ర్టేషన్‌లను చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో గత నెలలో 7542 డాక్యుమెంట్‌ల రిజిస్ర్టేషన్‌లు జరిగాయి. వీటిలో ఎక్కువగా నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌ పరిధిలో జరిగాయి. కామారెడ్డి, బాన్సువాడలో కూడా కొంతమేరకు రిజిస్ర్టేషన్‌లు ఎక్కువగా జరిగాయి. అలాగే భీమ్‌గల్‌, దోమకొండ, బిచ్కుందలో కూడా కొంతమేరకు జరిగాయి. భూముల ధరలు పెరుగుతున్నాయనే ప్రకటనలతో ఎక్కువ మంది క్రయవిక్రయదారులు రిజిస్ర్టేషన్‌లు చేసుకోవడంతో ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లా నుంచి రూ.19.40 కోట్ల ఆదాయం వచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతినెలా 4వేల నుంచి 5వేల మధ్య డాక్యుమెంట్‌ల రిజిస్ర్టేషన్‌లు జరుగుతున్నాయి. వీటి ద్వారా నెలకు రూ.10కోట్ల వరకు రిజిస్ర్టేషన్‌ ఫీజు రూపంలో ప్రభుత్వానికి వస్తోంది. గత నెలలో జోరుగా రిజిస్ర్టేషన్‌లు జరగగా ఈ నెల మాత్రం తక్కువగానే జరుగుతున్నాయి. నెలాఖరుకు వచ్చిన ఇప్పటి వరకు 3284 డాక్యుమెంట్‌ల రిజిస్ర్టేషన్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి 8.17 కోట్ల రూపాయలు ఫీజు రూపంలో వచ్చింది. మార్కెట్‌ ఫీజు భారీగా పెరగడంతో ఎక్కువ మంది ప్లాట్స్‌ కొన్న రిజిస్ర్టేషన్‌కు ముందుకు రావడంలేదు. అపార్ట్‌మెంట్‌లు, కొన్ని ఇళ్లు మాత్రమే ఎక్కువగా రిజిస్ర్టేషన్‌లు అవుతున్నాయి. మార్కెట్‌ వాల్యు 50శాతం వరకు పెరగడం, దానికి అనుగుణంగా రిజిస్ర్టేషన్‌ ఫీజు పెరగడం వల్ల భారం ఎక్కువగా పడుతుండడంతో కొంతమేర వెనకడుగు వేస్తున్నారు.

  ఫ ముగ్గురు సబ్‌ రిజిస్ర్టార్‌లపై వేటు

గత నెలలో కొన్ని రిజిస్ర్టేషన్‌లు నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో అధికారులు, ముగ్గురు సబ్‌ రిజిస్ర్టార్‌లపై వేటు వేశారు. వారు చేసిన డాక్యుమెంట్‌లన్నీ పరిశీలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేసిన డాక్యుమెంట్‌ల రిజిస్ర్టేషన్‌లను రద్దుచేయడంతో పాటు వీరికి సహకరించిన మరికొంతమంది ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ భూముల అక్రమ రిజిస్ర్టేషన్‌లకు సహకరించిన డాక్యుమెంట్‌ రైటర్లపైన మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యథావిధిగా వారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగులు సస్పెండ్‌ అయినా ఇప్పటికీ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో వీరిదే హవా కొనసాగుతోంది. ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్‌చేసిన వారికి కూడా వీరు సహకరిస్తే తప్ప రిజిస్ర్టేషన్‌లు కావడంలేదు. అధికారులపై చర్య తీసుకున్న విధంగానే వీరిపైన కూడా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతే కొంతమేర అక్రమ రిజిస్ర్టేషన్‌లు తగ్గేవని పలువురు పేర్కొంటున్నారు. వీరితో పాటు ఒత్తిళ్లు తెచ్చి రిజిస్ర్టేషన్‌లు చేసిన నేతలపైన చర్యలు తీసుకుంటే మరికొన్ని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ర్టేషన్‌లు జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మాత్రం ఇంకా తనిఖీలను కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈనెలలో రిజిస్ట్రేషన్‌లు తగ్గాయని జిల్లా ఇన్‌చార్జ్‌ రిజిస్ర్టార్‌ ఫణిందర్‌రావు తెలిపారు. మార్కెట్‌ విలువ పెరగడంతో కొంతమేర తగ్గాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే అన్ని కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్‌లు జరిగే విధంగా చూస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-02-23T05:53:54+05:30 IST