ఆర్టీసీకి ప్రజల ఆదరణ

ABN , First Publish Date - 2022-08-15T06:48:02+05:30 IST

ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నారని, పది నెలలుగా సంస్థ అభివృద్ధి పథకంలో ప్రయాణిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని నగర ప్రధాన బస్టాండ్‌, బస్‌ డిపో కార్యాలయాలను ఆదివారం పరిశీలించారు.

ఆర్టీసీకి ప్రజల ఆదరణ

త్వరలో నిజామాబాద్‌ రీజియన్‌కు నూతన బస్సులు

వజ్రోత్సవం సందర్భంగా 75 ఏళ్లు దాటినవారికి నేడు ఉచిత బస్సు సౌకర్యం

ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12ఏళ్లపాటు ఉచిత బస్సు సౌకర్యం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

సుభాష్‌నగర్‌, ఆగస్టు 14: ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నారని, పది నెలలుగా సంస్థ అభివృద్ధి పథకంలో ప్రయాణిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని నగర ప్రధాన బస్టాండ్‌, బస్‌ డిపో కార్యాలయాలను ఆదివారం పరిశీలించారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారి నిజామాబాద్‌ వచ్చిన సందర్భంగా నిజామాబాద్‌ రీజియన్‌ తరఫున ఘనంగా స్వాగతం పలికారు. మొదటగా నగర ప్రధాన బస్టాండ్‌లో జాతీయ గీతాలాపన చేసి బస్‌డిపో 1 కార్యాలయాన్ని పరిశీలించి ఉద్యోగులతో  మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌ ఎం కార్యాలయంలో ఆర్‌ఎం ఉషాదేవితో పాటు డిపో 1 మేనేజర్‌ క్రిష్ణారెడ్డి, డిపో 2 మేనేజర్‌ వెంకటేశంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్‌ రీజియన్‌ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. అనంతరం సజ్జనార్‌ మాట్లాడుతూ.. నాలుగు నెలల్లో నిజామాబాద్‌ రీజియన్‌కు నూతన బస్సులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాఖీ పండగ సందర్భంగా ప్రజలు ఆర్టీసీని ఆదరించారని, ఒక్కరోజే 38లక్షల కిలోమీటర్లు తిరిగి 45లక్షల మంది ఆర్టీసీ బస్సుల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని తెలిపారు. దీనిద్వారా సుమారు రూ. 20కోట్లకు పైగా ఆదాయం లభించిందని తెలిపారు.  అంతకుముందు నిజామాబాద్‌ బస్సుడిపో 1 కార్యాలయంలో ఎండీ సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా సీపీ నాగరాజు కలిసారు. అంతకముందు బస్‌ డిపో-1 కార్యాలయ ఆవరణలో   మొక్కలు నాటారు. కార్యక్రమంలో రీజియన్‌ మేనేజర్‌ ఉషాదేవి, డివియం వి.శంకర్‌, నిజామాబాద్‌ డిపో 1 మేనేజర్‌ కృష్ణారెడ్డి, డిపో 2 మేనేజర్‌ వెంకటేశం, ఎంఎఫ్‌ శ్రీనివాస్‌, పీవోలు, ఏవోలు, ఎస్‌ఎంలు పాల్గొన్నారు.

ప్రయాణికుల సంక్షేమమే ఆర్టీసీ ధ్యేయం 

బోధన్‌ రూరల్‌:  ప్రయాణికులను సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చడమే ఆర్టీసీ ధ్యేయమని ఎండీ సజ్జనార్‌ అన్నారు. ఆదివారం బోధన్‌ ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని నూతన బస్సులను కొనుగోలు చేస్తామన్నారు. బోధన్‌ డిపోలో 23 లక్షల అధిక ఆదాయాన్ని సాధించినందుకు ఉద్యోగులను అభినందించారు. ఉత్తమ కండక్టర్‌ విఠల్‌రెడ్డిని నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో  విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఎం.రవీందర్‌, ఏసీపీ రామారావు, వెల్ఫెర్‌ బోర్డు సభ్యులు శ్రీనివాస్‌, బోధన్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ డి.ఎల్‌.స్వామి, సావిత్రి, డిపో సూపర్‌ వైజర్లు శ్రావణ్‌కుమార్‌, మంజుల, సిబ్బంది ఉన్నారు.

బస్టాండ్‌ పరిశీలన

డిచ్‌పల్లి: జిల్లా పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌ వెళ్తున్న క్రమంలో  డిచ్‌పల్లి బస్టాండ్‌ను ఆర్టీసీ ఎండీ  పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. ఆర్టీసీ చైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆదేశాల మేరకు బస్టాండ్‌ ను  పరిశీలించినట్లు ఆయన తెలిపారు.

ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 75 సంవత్సరాలు దాటిన వారికి ఆగస్టు 15న రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. అంతేకాకుండా ఆగస్టు 15న పుట్టిన పిల్లలందరికీ 12 ఏళ్లపాటు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. 1 కేజీ బరువున్న పార్సిళ్లను 75కిలోమీటర్ల వరకు ఉచితంగా పంపవచ్చని తెలిపారు. మూడు రోజులపాటు నిజామాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.  వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నట్లు ఎండీ పేర్కొన్నారు. 

Read more