ప్రణాళికలు సిద్ధం!

ABN , First Publish Date - 2022-04-10T07:11:43+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలు ఇక మారనున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థుల కు విద్యతో పాటు ఇతర వసతులను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు ఆయా గ్రామాల పరిధిలోని దాతలు ఇచ్చే నిధుల ద్వారా మరింత అభివృద్ధి చేయనున్నారు.

ప్రణాళికలు సిద్ధం!

జిల్లాలో మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు

మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పనులు

ఈ యేడాది మూడొంతుల బడుల్లో మౌలిక వసతుల కల్పన 

దాతలు ముందుకువస్తే మరిన్ని వసతులు 

జిల్లావ్యాప్తంగా మొత్తం 1,234 పాఠశాలలు కాగా, 

407 పాఠశాలల ఎంపిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలలు ఇక మారనున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థుల కు విద్యతో పాటు ఇతర వసతులను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు ఆయా గ్రామాల పరిధిలోని దాతలు ఇచ్చే నిధుల ద్వారా మరింత అభివృద్ధి చేయనున్నారు. ఈ యేడాదిలో 3వ వంతు పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు మనఊరు- మన బడి కార్యక్రమం కింద పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులను విడుదల చేయగా.. ఎంపిక చేసిన పాఠశాలల ప్రతిపాదనల ఆధారంగా జడ్పీ, ఎమ్మెల్యేల అభివృద్ధి నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను వినియోగించనున్నారు. అన్ని పాఠశాలల్లో భవనాలు బాగు చేయడంతో పాటు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయనున్నారు.

ఫ ఆంగ్ల బోధనతో పాటు వసతులు

జిల్లాలో మొత్తం 1,234 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మండల పరిష త్‌, జడ్పీ పాఠశాలలు 1,039 ఉండగా.. ప్రభుత్వ పాఠశాలలు 117, ఏయిడెడ్‌ పాఠశాలలు 39, మోడల్‌ స్కూల్స్‌ 10, కేజీబీవీ 25, రెసిడెన్షియల్‌ 3, ఉర్దూ రెసిడెన్షియల్‌ 1 ఉన్నాయి. ఈ పాఠశాలలో ఆంగ్ల బోధన మొదలుపెట్టడంతో పాటు ఇతర మౌళిక వసతులను మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టనున్నారు. గడిచిన 15 రోజులుగా ప్రణాళిక లు సిద్ధం చేస్తున్నారు. ఈ యేడాది 3వ వంతు బడులను అకాడమిక్‌ ఇయర్‌ మొదలుపెట్టేలోపే మరమ్మతులను పూర్తిచేయనున్నారు. 

ఫ నిరంతర నీటి సరఫరా చర్యలు

జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మొత్తం 407 పాఠశాలలను ఈ సంవత్సరం అన్ని మౌలిక వసతులను కల్పించనున్నారు. ఈ పాఠశాలలో ప్రధానంగా తాగునీటి వసతిని మెరుగుపర్చడంతో పాటు నిరంతర నీటి సరఫరాను కొనసాగిస్తారు. పాఠశాలలో మరుగుదొడ్లను నిర్మిస్తారు. ప్రతీ పాఠశాలలో 20 మంది బాలికలకు ఒకటి చొప్పున, 40 మంది బాలురకు ఒక్కొక్కటి చొప్పున నిర్మాణాలు కొనసాగిస్తారు. విద్యార్థు ల సంఖ్య ఆధారంగా ఈ నిర్మాణాలు పూర్తి చేస్తారు. అన్ని పాఠశాలల్లో కరెంటు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేస్తారు. తాగునీటి వసతి కల్పిస్తారు. పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన ఫర్నిచర్‌ ముఖ్యంగా బల్లలు, బెంచీలు, ఉపాధ్యాయులకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తారు. పాఠశాలల అన్ని గోడలు, స్లాబ్‌లను మరమ్మత్తులు చేయడంతో పాటు విద్యను తెలియజెప్పే పేయింటింగ్‌లను గోడలపైన వేస్తారు. అన్ని పాఠశాలల్లో ఆకుపచ్చ రాత బోర్డులు, ప్రహరీ నిర్మాణం, శిఽథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో నూతన గదుల నిర్మాణాలు చేపడతారు. అన్ని పాఠశాలల్లో డిజిటల్‌ ఎడ్యూకేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లను చేస్తారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇతర కార్పొరేట్‌ పాఠశాలతో పోటీ పడేవిధంగా మౌలిక వసతులు కల్పిస్తారు. అన్ని పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు విద్యార్థులకు ఏర్పడకుండా చూడడంతో పాటు మధ్యాహ్న భోజనానికి అవసరమైన డైనింగ్‌హాల్‌ నిర్మాణం ఏర్పాటు చేయనున్నారు.  

ఫ ప్రతిపాదనల ఆధారంగానే పనులు

జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ పాఠశాలల ప్రతిపాదన ల ఆధారంగా చేసే పనులు బట్టి నిధులను విడుదల చేయనుంది. ఈ నిధులు కూడా కలెక్టర్‌ అకౌంట్‌తో ఉండేవిధంగా ఏర్పాట్లను చేశారు. పాఠశాలలో నిర్మాణాలు పూర్తయిన విధంగా చెల్లింపులు చేస్తారు. విద్యా కమిటీ ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేసి పనులను పూర్తి చేస్తారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద జిల్లాలోని మొదటి విడ త కింద చేపడుతున్న 407 పాఠశాలలు వచ్చే అకాడమిక్‌ ఇయర్‌లోపు తగిన విధంగా పనులు చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. వీటిలో 19 పాఠశాలలకు ప్రతిపాదనలు రావడంతో ఇప్పటికే కలెక్టర్‌ అను మతి ఇచ్చారు. ఈ పనులను ఒకటి, రెండు రోజుల్లో చేయనున్నారు. మరో 87 పాఠశాలల ప్రతిపాదనలు కలెక్టర్‌ పరిశీలిస్తున్నారు. ఈ వారంలోపు మొత్తం పాఠశాలల ప్రతిపాదనలు పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నా రు. ఈ పాఠశాలలన్నింట్లో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద నిధు లు వెచ్చించి పనులు పూర్తిచేస్తారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్‌, విద్యాశాఖ ఇంజనీరింగ్‌ విభాగంతో పాటు ఇతర శాఖల ద్వారా పనులను చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పాటు దాతల ద్వారా నిధులను సేకరించి అవసరమైన మౌలిక వసతులను ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నా లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులేకాకుండా.. దాతలు ఇచ్చే నిధుల ద్వారా ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఎక్కువ నిధులు వెచ్చించిన దాతల పేర్లను ఆయా పాఠశాలలకు పెట్టనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు మాక్లూర్‌ పాఠశాలకు ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త కుటుంబ సభ్యుల తరపున కోటి రూపాయలు అందించారు. ఇవేకాకుండ మరో మూడు పాఠశాలలకు నిధులు ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు. పనులు మొదలుపెట్టిన తర్వాత ఆయా గ్రామాల పరిధిలో నిర్వహించే సమావేశాల ద్వారా నిధులను సేకరించనున్నారు. వాటిని విద్యా కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలకు ఖర్చు చేస్తారు. దాతలు ఎక్కువ సంఖ్యలో వస్తే వారి నిధులను వెచ్చించి మరిన్ని సౌకర్యాలను పాఠశాలలో కల్పిస్తారు. రానిచోట మొత్తం ప్రభుత్వ నిధులనే వెచ్చించి పనులు పూర్తిచేస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. తాగునీటి, మరుగుదొడ్లు, విద్యుత్‌, ప్రహరీ, డైనింగ్‌హాల్‌ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా అవన్ని పూర్తయ్యే అవకాశం ఉంది.

యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నాం..

: నారాయణరెడ్డి, కలెక్టర్‌

జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద మూడు వంతుల పాఠశాలలను ఎంపిక చేశాం. ఇంజనీరింగ్‌ నిపుణుల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 19 పాఠశాలలకు అనుమతి ఇచ్చాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమం కింద అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులకు భారీగా నిధులను వెచ్చించనున్నాం. ఈ కార్యక్రమానికి దాతలు కూడా సహకరిస్తే మరిన్ని వసతులు విద్యార్థులకు అందనున్నాయి. 

Read more