త్వరలో కరెంటు బాదుడు!

ABN , First Publish Date - 2022-01-03T07:09:45+05:30 IST

విద్యుత్‌ సంస్థలు త్వర లో అన్ని వర్గాల వినియోగదారులకు షాక్‌ ఇవ్వనున్నాయి. పేద, మధ్య తరగతి, పరిశ్రవమలు అనే తేడా లేకుండా అన్ని రకాల విద్యుత్‌చార్జీలు పెంచాలని నిర్ణయించాయి.

త్వరలో కరెంటు బాదుడు!

ఏప్రిల్‌లో పెరగనున్న విద్యుత్‌ చార్జీలు 

గృహోపకరణాలకు యూనిట్‌కు 50పైసలు 

పరిశ్రమలకు రూపాయి 

జిల్లాపై రూ.6 కోట్ల అదనపు భారం 

సుభాష్‌నగర్‌, జనవరి 2: విద్యుత్‌ సంస్థలు త్వర లో అన్ని వర్గాల వినియోగదారులకు షాక్‌ ఇవ్వనున్నాయి. పేద, మధ్య తరగతి, పరిశ్రవమలు అనే తేడా లేకుండా అన్ని రకాల విద్యుత్‌చార్జీలు పెంచాలని నిర్ణయించాయి. విద్యుత్‌ సంస్థల ఆదేశాలు అందగానే అదనపు చార్జీల బాదుడుకు జిల్లా విద్యుత్‌శాఖ అధికారులు రం గం సిద్ధం చేస్తున్నారు. పెంచే విద్యుత్‌ చార్జీలను ఏప్రిల్‌నుంచి అమలుఅవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నా యి. మే నెల నుంచి బిల్లుల మోత మోగనుంది.

ఏప్రిల్‌ నుంచి పెంపు..

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కరెం ట్‌ చార్జీలు పెరగనున్నాయి. డిస్కంలో ఇచ్చిన ప్రతిపాదనలు ఈఆర్‌సీ నిర్ణయించి మార్చి 30లోగా తీర్పు చెబుతుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త చార్జీలు అమలులోకి రావడం లాంఛనమే. పెరిగిన చార్జీలతో వినియోగదారులపై అదనంగా రూ.5 నుంచి 6 కోట్ల భారం పడే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా 5లక్షల 86వేల గృహోపకరణాలు, మిగతా కనెక్షన్‌లు ఉండగా వ్యవసాయ కనెక్షన్‌లు లక్షా 73వేలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజు 83లక్షల యూనిట్లు ఖర్చవగా వ్యవసాయానికి ప్రతిరోజూ 30లక్షల యూనిట్లు ఖర్చవుతుంది. మిగతా 53లక్షల యూనిట్లు గృహాలు, పరిశ్రమలకు ఖర్చవుతుంది. గృహోపకరణాలకు సంబంధించి 50 పైసలు అదనంగా చార్జీలు పెంచనుండగా మిగతా వాటికి రూపాయి అదనపు భారం పడనుంది. అయితే  ఐదేళ్లుగా చార్జీలు పెరగలేదు. ఒక్కసారిగా చార్జీల పెంపుతో సామాన్యుడిపై మరోసారి భారం పడనుంది. డిస్కంలో లోటును పూడ్చుకునేందుకు చార్జీలు పెంచాలని ఈఆర్‌సీకి విన్నవించాయి. ఈఆర్‌సీ చార్జీలు పెంచేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. చార్జీల పెంపుతో గృహ, కమర్షీయల్‌, ఇండస్ర్టీయల్‌ అన్ని వర్గాలపై కరెంట్‌ చార్జీల భారం పడనుంది. చార్జీల టారీఫ్‌ ప్రకారం ప్రతి యూనిట్‌కు గృహ వినియోగదారులపై 50పైసలు, కమర్షీయల్‌ హెచ్‌డి, ఇండస్ర్టీయల్‌ వినియోగదారులపై ఒక్క రూపాయి భారం పడనుంది. ఈ పెంపు వల్ల సామాన్య, మధ్య తరగతి వినియోగదారులపై భారం పడనుంది. 

పరిశ్రమలపై రూపాయి పెంపు..

కమర్షియల్‌ పరిశ్రమల కనెక్షన్‌లపై రూపాయి పెంచాలని డిస్కంలో ప్రతిపాదించాయి. కమర్షియల్‌ వినియోగదారులు 50 యూనిట్ల వరకు కరెంట్‌ వాడి తో ప్రస్తుతం యూనిట్‌కు 6 రూపాయలు వసూలు చేస్తున్నారు. పెంపు అమలైతే యూనిట్‌కు 7 రూపాయలు వసూలు చేయనున్నారు. వంద యూనిట్ల వరకు వాడే కమర్షియల్‌ కనెక్షన్‌కు 7.50 వసూలు చేస్తుండగా చార్జీల పెంపుతో 8.50కి చేరనుంది. 500 యూనిట్లకంటే ఎక్కువగా వాడే కమర్షియల్‌కి 10 రూపాయలు ఉండగా పెరిగే ధరలతో 11 రూపాయలకు చేరనుంది. 

పేదలపై భారం..

గృహోపకరణాలకు యూనిట్‌కు 50 పైసలు పెంచడంతో అధికంగా పేదలపై భారం పడనుంది. జిల్లాలో పేద, మధ్యతరగతి కనెక్షన్‌లే ఎక్కువగా ఉండడంతో 50 పైసల భారం పేదలపైనే పడనుంది. 50 యూనిట్లలోపు కరెంటు వాడే గృహ వినియోగదారులకు 1.40పైసలు అమలు చేస్తున్నారు. 50 పైల పెంపుతో యూనిట్‌ చార్జ్‌ 1.90 పైసలు కానుంది. 

యథాతథంగా రాయితీలు అమలు..

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, అగ్రికల్చర్‌, తదితరులకు ఇస్తు న్న రాయితీలు ఎప్పటిలాగే ఉన్నాయి. అగ్రికల్చర్‌ కనెక్షన్‌లకు ఫ్రీ, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకం యథాతథంగా కొనసాగనుంది. నాయీబ్రాహ్మణుల సెలూన్‌లకు, రజకుల లాండ్రిలకు 250 యూనిట్ల ఉచిత కరెంటు అమలుకానున్నాయి.

Read more