పోడు గోడు

ABN , First Publish Date - 2022-06-11T07:25:15+05:30 IST

లింగంపేట మండలం నల్లమడుగు తండాలో తమ పోడు భూముల్లో పంటలు సాగు చేయకుండా ఫారెస్ట్‌ అఽధికారులు అడ్డుకుని మొక్కలు నాటేందుకు ప్రయత్నం చేయగా స్థానిక రైతులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.

పోడు గోడు
రామారెడ్డిలో ఉన్న పోడు భూములు

- జిల్లాలో వీడని పోడు భూముల పంచాయితీ

- 69వేల ఎకరాల వరకు పోడు భూములు

-  20వేల ఎకరాలపైగా పోడు భూములు వివాదంలో ఉన్నట్లు గుర్తింపు

- ఐదు మండలాల్లో ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి

- దశాబ్దాలుగా ఈ భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలు

- ఆ భూముల్లో పంటలు సాగును అడ్డుకుంటున్న అటవీశాఖ

- జిల్లాలో 27 వేలకు పైగా పోడు భూముల కోసం దరఖాస్తులు

- పోడు రైతులకు తప్పని నిరీక్షణ


కామారెడ్డి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): లింగంపేట మండలం నల్లమడుగు తండాలో తమ పోడు భూముల్లో పంటలు  సాగు చేయకుండా ఫారెస్ట్‌ అఽధికారులు అడ్డుకుని మొక్కలు నాటేందుకు ప్రయత్నం చేయగా స్థానిక రైతులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో మనస్థాపానికి గురైన బాధిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గతంలో రాజంపేట మండలంలోని ఓ పోడు రైతు భూముల్లో అటవీ అధికారులు పంట సాగును అడ్డుకోవడంతో బాధిత రైతు అధికారులను కాళ్లావేళ్ల బతిమిలాడే క్రమంలో సొమ్మసిల్లి పడిపోయాడు. గాంధారి మండలంలోని గుర్జల్‌ తండా శివారులో ఓ రైతు పోడు భూముల్లో సాగు చేసిన సోయా పంటను సంబంధిత శాఖ అధికారులు తొలగించారు. మాచారెడ్డి మండలంలోని మరో తండా పరిధిలో పోడు భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఇలా జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూముల వివాదం నెలకొంటూనే ఉంది. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఉన్నప్పటికీ ఆ భూములన్నీ తమవేనంటూ అటవీశాఖ అధికారులు అడ్డు పడుతుండడంపై బాధిత రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రతిపక్షపార్టీల నేతలు సైతం పోడు భూములపై పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం బాధిత రైతుల సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదు. దీంతో ప్రతీ వానాకాలం సీజన్‌లో పోడు భూముల రైతుల, అటవీశాఖ అధికారుల మధ్య పంచాయితీ నెలకొంటునే ఉంటుంది. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి బాధిత రైతుల్లో ఆశలు రేకెత్తించింది. దరఖాస్తులు తీసుకుని నెలలు గడుస్తున్నా పోడు భూముల సమస్యలు పరిష్కరించకపోవడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. 

ఏళ్ల తరబడి పోడు భూముల్లో సాగు

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్దాల కాలంగా పోడు సేద్యం నడుస్తోంది. అప్పట్లో పని చేసిన అటవీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వేలాది ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అయితే కొందరు డబ్బు ఉన్నోళ్లు, బడాబాబులు కూడా అటవీ భూములను ఆక్రమించి అమ్ముకున్నారు. వారి నుంచి కొనుగోలు చేసినా ఎంతో మంది పేదలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా అడవిని నరికేసి, భూములను కబ్జా చేసిన వారిని వదిలేసి ఏళ్ల తరబడిగా పంటను సాగు చేసుకుంటున్న వారిపై ప్రతాపం చూపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఇచ్చిన పట్టాలు ఉన్నవారిని వదలడం లేదు. జిల్లాలో 2008 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 2,031 మంది రైతులకు 3,438 ఎకరాలలోని పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. వాటి ఆధారంగా రుణాలు తీసుకుని పంటలు సాగు చేసుకున్నారు. అయినప్పటికీ అటవీ అధికారులు అవేమి పట్టించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

జిల్లాలో 7వేల ఎకరాలకు పైగా వివాదంలో పోడు భూములు

జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుంచి అటవీ, రెవెన్యూ భూములు వివాదంలోనే ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 7వేల ఎకరాలకు పైగా అటవీ భూములు వివాదంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కామారెడ్డి డివిజన్‌ పరిఽధిలో 60,920 ఎకరాలలో అటవీ భూములు ఉండగా ఇందులో వివాదం లేని భూములు 58,434 ఉన్నాయి. వివాదంలో ఉన్న భూములు 2,484 ఎకరాలలో ఉన్నాయి. ఎల్లారెడ్డి డివిజన్‌లో మొత్తం 82,835 ఎకరాలలో ఫారెస్ట్‌ భూములు ఉండగా ఇందులో వివాదంలో లేనివి 80,814 ఎకరాలలో వివాదంలో ఉన్న భూములు 2,021 ఎకరాలలో ఉన్నాయి. బాన్సువాడ డివిజన్‌లో 55,319 ఎకరాలలో అటవీ భూములు ఉండగా ఇందులో వివాదం లేని భూములు 52,622 ఎకరాలలో, వివాదంలో ఉన్న భూములు 2,697 ఎకరాలలో ఉన్నాయి. అయితే ఈ వివాదంలో ఉన్న భూములు ఈ ఐదు మండలాల్లోనే ఉన్నట్లు అఽధికారులు గుర్తించారు. మాచారెడ్డి, జుక్కల్‌, నాగిరెడ్డిపేట, గాంధారి, లింగంపేట మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 5 వేల మంది పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని మండలాల్లో రెవెన్యూ భూములు అటవీ శాఖ పరిధిలో వస్తాయంటూ ఆ శాఖ అధికారులు కందకాలు తవ్వేశారు. సంయుక్త సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించిన అటవీశాఖ అధికారులు ససేమిరా అంటున్నారు.

దరఖాస్తుల స్వీకరణకే పరిమితం

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మూడు డివిజన్‌ల పరిధిలో పోడు భూములు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూముల్లో బాధిత రైతులు పంటలు సాగు చేసుకుంటున్న హక్కు పత్రాలకు మాత్రం నోచుకోవడం లేదు. గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వ పోడు భూములకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే జిల్లాలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో గల 394 గ్రామాలలో పోడు భూములు ఉన్నట్లు గుర్తించి ఆ గ్రామాల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27,397 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులకు గాను మొత్తం 69,229 ఎకరాలలో భూ విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులో ఎస్టీ(గిరిజనులు) 11,463 మంది దరఖాస్తుల చేసుకోగా వీరి పరిధిలో 30 వేల 881 ఎకరాలలో ఉండగా గిరిజనేతురులు 27,397 మంది దరఖాస్తు చేసుకోగా వీరి పరిధిలో 38,347 ఎకరాలలో ఉన్నట్లు దరఖాస్తుల ద్వారా తేలింది.


గాంధారిలో అత్యధికం

జిల్లాలో అత్యధికంగా గాంధారి మండలం నుంచి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 27 వేలకు పైగా దరఖాస్తులు రాగా ఇందులో గాంధారి మండలంలోనే 7,997 దరఖాస్తులు వచ్చాయి. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండల పరిధిలో 1,725 మంది దరఖాస్తు చేసుకోగా వీటి పరిధిలో 4,179 ఎకరాలు ఉంది. బిచ్కుందలో 974 దరఖాస్తుల్లో 2,193 ఎకరాలు, బీర్కూర్‌లో 26 దరఖాస్తులలో 34.26 ఎకరాలు, జుక్కల్‌లో 804 దరఖాస్తులలో 2,038 ఎకరాలు, మద్నూర్‌లో 95 దరఖాస్తులలో 165 ఎకరాలు, నస్రూల్లాబాద్‌లో 174 దరఖాస్తులలో 406.11 ఎకరాలు, నిజాంసాగర్‌లో 1,631 దరఖాస్తులు 2,937 ఎకరాలలో, పెద్ద కొడప్‌గల్‌లో 334 దరఖాస్తులలో 805.36 ఎకరాలలో, పిట్లంలో 1200 దరఖాస్తుల్లో 1,562 ఎకరాలు, మాచారెడ్డిలో 2,383 దరఖాస్తుల్లో 7,748 ఎకరాలు, రామారెడ్డిలో 252 దరఖాస్తుల్లో 637 ఎకరాలు, దోమకొండలో 13 దరఖాస్తులకు గాను 16.15 ఎకరాలలో, భిక్కనూర్‌లో 344 దరఖాస్తుల్లో 666.22 ఎకరాలు, రాజంపేటలో 1,327 దరఖాస్తులో 2,331 ఎకరాలు, సదాశివనగర్‌లో 1,207 దరఖాస్తులో 3,172 ఎకరాలు, తాడ్వాయిలో 2 దరఖాస్తులకు 1.25 ఎకరాలు, ఎల్లారెడ్డిలో 527 దరఖాస్తుల్లో 1235.6 ఎకరాలు, గాంధారిలో 7,900 దరఖాస్తుల్లో 24,972 ఎకరాలు, లింగంపేట్‌లో 2,514 దరఖాస్తుల్లో 5,653 ఎకరాల్లో, నాగిరెడ్డిపేటలో 125 దరఖాస్తులో 232.14 ఎకరాలు ఉన్నట్లు తేలింది. అయితే ఇందులో ఎంతమంది అర్హులు, అనర్హులు అనే దానిపై విచారణలో తేలనుంది.

ముందుకు సాగని పోడు భూములపై విచారణ

జిల్లాలోని పోడు భూముల పరిష్కారానికి దరఖాస్తుల ప్రక్రియ ఇది వరకే ముగిసింది. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినా విచారణ ముందుకు సాగడం లేదు. పోడు భూములకు హక్కు పత్రాల జారీపై ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం 2005 డిసెంబరు 13కు ముందు పోడు సాగులో ఉన్నవారికే హక్కు పత్రాలను ఇవ్వనుంది. ఒక్కో కుటుంబానికి నాలుగు హెక్టార్ల నుంచి 10 ఎకరాల భూమికే హక్కుల పత్రాలు జారీ చేయనుంది. అంతకన్న ఎక్కువ భూమిలో ఆ కుటుంబం పోడు సాగు చేస్తుంటే దానిని స్వాధీనం చేసుకోనుంది. ఒక కుటుంబం ఇన్నాళ్లు ఎన్ని ఎకరాలలో పోడు సాగు చేసుకుంటున్న హక్కు మాత్రం 10 ఎకరాలకు మాత్రమే కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చిన దరఖాస్తుల ప్రకారం భూమి ఎంత విస్తీర్ణంలో ఉంది. బాధితులు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు. అనే వివరాలు సేకరించేందుకు విచారించేందుకు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో విచారణ ముందుకు సాగడం లేదు.


ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది

- అంబాజీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి, కామారెడ్డి

పోడు భూముల కోసం బాధిత రైతుల నుంచి ఇది వరకే దరఖాస్తులు స్వీకరించాం. జిల్లా వ్యాప్తంగా 27 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో కమిటీలను సైతం ఏర్పాటు చేశాం. పోడు భూముల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

Updated Date - 2022-06-11T07:25:15+05:30 IST