మహిళ హత్య కేసులో ఒకరి రిమాండ్‌

ABN , First Publish Date - 2022-12-13T23:52:47+05:30 IST

గత రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిలో సుజాత అనే మహిళను హత్య చేసి సొత్తును దోచుకెళ్లిన నిందితుడిని పట్టుకుని రిమాండ్‌ చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

మహిళ హత్య కేసులో ఒకరి రిమాండ్‌
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 13: గత రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డిలో సుజాత అనే మహిళను హత్య చేసి సొత్తును దోచుకెళ్లిన నిందితుడిని పట్టుకుని రిమాండ్‌ చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిలోని సాతెల్లి బేస్‌లో గల శేర్ల సుజాత అనే మహిళ శనివారం హత్యకు గురి కాగా కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆమెను ఎల్లారెడ్డికి చెందిన గంగుల శ్రీనివాస్‌ అలియాస్‌ డీజే శ్రీను సుజాతను ఆమె చీరకొంగుతో గొంతుకు గట్టిగా చుట్టి, దుప్పటి సహాయంతో ఆమె ముఖం మీద గట్టిగా నొక్కి చంపినట్లు తెలిపారు. హత్య చేసిన అనంతరం ఆభరణాలతో పరారు కావడంతో ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ గణేష్‌ ఆధ్వర్యంలో టీములుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టగా మంగళవారం ఉదయం శ్రీనివాస్‌ చిక్కాడని తెలిపారు. అతనిని ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌ విధించిందని తెలిపారు. కేసు ఛేదించేందుకు కృషి చేసిన సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీను వద్ద 2 తులాల బంగారు గొలుసు, 1 తులం బంగారు గుండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు

కల్లు దుకాణాలను అడ్డాలుగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎల్లారెడ్డిలోని ఒకటో నెంబర్‌ కల్లు దుకాణ పరిధిలో ఒక ముసలి వ్యక్తికి లింగంపేట మండలానికి చెందిన నీరుడి సాయిలు అనే వ్యక్తి ఫుల్‌గా మందు తాగించి ఆయన స్పృహ కోల్పోగానే ఆయన వద్దనున్న ఏడు తులాల ఒక కడియం, 10 తులాల రెండు చేతి దండే కడియాలు, 2 మాసాల ఒక బంగారు చెవిపోగు దొంగిలించాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నీరుడి సాయిలు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. గతంలో కూడా లింగంపేట్‌, బాన్సువాడలలో కళ్లు దుకాణాల్లో కళ్లు తాగే వృద్ధులను, మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు. దొంగతనం చేసిన వెండి కడియం, దండే కడియాలు, బంగారు చెవి పోగును స్వాధీనం చేసుకుని నేరస్తుడిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

వార్షిక సమన్వయ సమావేశం

కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జిల్లా పోలీసు వార్షిక సమన్వయ సమావేశంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి శ్రీదేవి, గౌరవ అతిథిగా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలను వెల్లడిస్తు పోలీసుశాఖ ద్వారా కేసుల నమోదు వాటి పురోగతి, నేరస్తుల అరెస్టు, ఆస్తి సంబంధిత నేరాల ఛేదింపు, విలువ గల బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం, మహిళల పట్ల నేరాల తగ్గుదల, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. 58 నేరాల్లో నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు విధించగా అందులో 3 హత్య కేసులు ఉన్నట్లు తెలిపారు. 1852 మంది నేరచరిత్ర గల వారిని ముందస్తు బైండోవర్‌లు చేయడంతో పాటు 8406 పిట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిషేధిత పేకాట ఆడుతున్న 982 మందిపై కేసులు నమోదు చేసి రూ.19,86,822 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:52:47+05:30 IST

Read more