పేరుకే కమిటీలు

ABN , First Publish Date - 2022-09-26T05:47:25+05:30 IST

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలంటే క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.

పేరుకే కమిటీలు
మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు

- కానరాని ప్రజల భాగస్వామ్యం

- నియామకాలకే పరిమితమైన వైనం

- పరిష్కారానికి నోచుకోని సమస్యలు

- సర్కారు పథకాల అమలులో కొరవడిని పారదర్శకత


కామారెడ్డి, సెప్టెంబరు 25: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలంటే క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల బలోపేతం, వ్యవసాయంలో సాంకేతికతను ప్రోత్సహించడంతో పాటు పల్లెలు, పట్టణాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, వివిధ నిపుణులతో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్న కమిటీలు మనుగడలో లేక నామమాత్రంగా మారాయి. నిబంధనల ప్రకారం సభ్యులను నియమిస్తున్న కార్యకలాపాలు మాత్రం కాగితాలకే పరిమితవుతున్నాయి. నెలల తరబడి సమావేశాలు నిర్వహించకపోవడంతో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

నామ మాత్రంగానే..

జిల్లాలోని 22 మండలాల పరిధిలో 526 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగానికి ఆయా శాఖల్లో కమిటీలు ఏర్పాటు చేశారు. కానీ అవి నామమాత్రంగా మారడంతో పేదలకు అందించే రేషన్‌ బియ్యం సరఫరా, విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం, అంగన్‌వాడీలకు పోషకాహార పంపిణీలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడం లేదు. మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు అంతంతమాత్రంగానే పని చేస్తుండడంతో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

కనిపించని వ్యవసాయ సాంకేతిక, ఆహార సలహాల కమిటీలు

వ్యవసాయ, పశు సంవర్థక, ఉద్యానవన, మత్స్యశాఖలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం గతంలో సాంకేతిక వ్యవసాయ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఇక ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా పేదలకు నిత్యావసర సరుకులు అందేలా చూసేందుకు ఆహారసలహ సంఘాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌ చైర్మన్‌గా, అఖిలపక్ష పార్టీల నాయకులు సభ్యులుగా ఉంటారు. అక్రమాలు జరగకుండా ఈ కమిటీ నిరంతరం పర్యవేక్షించాలి. ఈ సంఘం ప్రతీ మూడు నెలలకోసారి సమావేశమై ప్రజాపంపిణీ వ్యవస్థ తీరుతెన్నులపై చర్చించాలి. ప్రస్తుతం ఈ సంఘాలు ఎక్కడ సమావేశం కావడం లేదు. దీంతో పూర్తిస్థాయిలో సరుకుల పంపిణీ జరగడం లేదు. రేషన్‌ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతోంది.

పాఠశాల యాజమాన్య, మధ్యాహ్న భోజన కమిటీ

విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీలు నామమాత్రంగా మారాయి. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో ఆయా సమస్యల పరిష్కారానికి వసతుల కల్పనకు, ఫలితం పెంపునకు కృషి చేయాలి. కానీ ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నభోజనం నాణ్యతతో పాటు నిబంధనల మేరకు మెనూ అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రతీ మండలంలో మధ్యాహ్నభోజన కమిటీని ఏర్పాటు చేసింది. తహసీల్దార్‌ కమిటీ చైర్మన్‌గా, హెచ్‌ఎంలు కన్వీనర్‌గా, ఎంపీడీవో, ఎంఈవో, ఎంపీపీ, జడ్పీటీసీ, తల్లిదండ్రులు, విద్యాకమిటీ చైర్మన్‌ సభ్యులుగా ఉంటారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ జిల్లాలో ఎక్కడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు.

అంగన్‌వాడీ పర్యవేక్షక సహాయక సంఘం

గ్రామీణ స్థాయి నుంచి ప్రతీ పేదకు సంపూర్ణ పోషకాహారం అందించి మాతాశిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షించేందుకు అంగన్‌వాడీ పర్యవేక్షక సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సర్పంచ్‌, మున్సిపాలిటీల్లో చైర్మన్‌, అంగన్‌వాడీ టీచర్‌ కన్వీనర్‌గా, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, కిశోరబాలిక, ఉపాధ్యాయుడు, చిన్నారుల తల్లి, గర్భిణులు సభ్యులుగా ఉంటారు. ప్రతినెల సమావేశమై అందుతున్న సేవలను పర్యవేక్షణ చేయాల్సి ఉండగా తూతూమంత్రంగా సాగుతున్నాయి.

Updated Date - 2022-09-26T05:47:25+05:30 IST