స్వాంత్య్ర వేడుకలకు ముస్తాబు

ABN , First Publish Date - 2022-08-15T06:47:04+05:30 IST

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంరంబానికి జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబైంది. సోమవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌ను అధికారులు సిద్ధం చేశారు.

స్వాంత్య్ర వేడుకలకు ముస్తాబు

పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌అర్బన్‌, ఆగస్టు 14: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంరంబానికి జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ ముస్తాబైంది. సోమవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్‌ను అధికారులు సిద్ధం చేశారు. షామీయానాలు, టెంట్‌లు, కుర్చీలు వేసి ఏర్పాట్లు చేశారు. అధికారులు, ప్రజలు వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం 10.30గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆదివారం ఏర్పాట్లను కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ నాగరాజులు పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వేదిక, ఎగ్జీబీషన్‌స్టాల్స్‌, షకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, తదితర ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వజ్రోత్సవాల వేళ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌డీవో రవి, తదితరులు ఉన్నారు.

అలరించిన జానపద  కళాప్రదర్శన 

నిజామాబాద్‌కల్చరల్‌, ఆగస్టు 14: భారత స్వాతం త్య్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని జానపద కళాకారుల ప్రదర్శన అలరించింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో సమాచార పౌరసంబంధాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద కళాప్రదర్శన ఆధ్యాంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌, నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. కనుమరుగవుతున్న చిందు, యక్షగానం వంటి కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా గౌరవమిస్తూ వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. అనంతరం కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక కళావైభవాన్ని చాటేలా కళాకారులు ఆకట్టుకునే రీతిలో ప్రదర్శనలు చేశారని ప్రతి ఒక్కరిని పేరుపేరున అభినందించారు. ప్రజల్లో జాతీయత భావాన్ని దేశంపట్ల ప్రేమను పెంపొందించేందుకు కళారూపాలు దోహదపడుతాయని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ దేశాభ్యున్నతికి పాటుపడాల్సిన గురుతర బాధ్యతలను ప్రతిఒక్కరు నిర్వర్తించాలని అన్నారు. ఈ కోవలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వజ్రోత్సవ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ జాతీయ స్ఫూర్తిని చాటుతున్నారని అన్నారు. ఇదే తరహా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడించాలని, 16న ఉదయం 11.30 గంటలకు ఎక్కడివారు అక్కడ తప్పనిసరిగా సామూహిక గీతాలాపన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకారశాఖ అధికారి సింహాచలం, మెప్మా పీడీ రాములు, జిల్లా ఉర్దూ విభాగం అధికారి మహ్మద్‌ హర్షద్‌, పెద్ద సంఖ్యలో కళాభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

Read more