కొలువైన అమ్మలగన్న అమ్మ

ABN , First Publish Date - 2022-09-27T06:25:36+05:30 IST

జిల్లావ్యాప్తంగా దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని మేళతాళాల తో, మంగళహారతులతో పురవీదుల గుండా ఊరేగిస్తూ మంటపానికి తరలించారు. ముస్తాబైన మంటపాలలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారిని ప్రతిష్ఠించారు. మంటపాలలో దేవిమాతను వేదపండితులు వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన పూజలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు.

కొలువైన అమ్మలగన్న అమ్మ
నిజామాబాద్‌లో గల లలితాదేవి ఆలయంలో శైలపుత్రిగా అమ్మవారి దర్శనం

జిల్లావ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు 

మంటపాల్లో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన పూజలు 

తొలిరోజు శైలపుత్రిగా దర్శనం 

నిజామాబాద్‌ కల్చరల్‌, సెప్టెంబరు 26:  జిల్లావ్యాప్తంగా దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని మేళతాళాల తో, మంగళహారతులతో పురవీదుల గుండా ఊరేగిస్తూ మంటపానికి తరలించారు. ముస్తాబైన మంటపాలలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై అమ్మవారిని ప్రతిష్ఠించారు. మంటపాలలో దేవిమాతను వేదపండితులు వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన పూజలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ముందుగా గణపతి, గౌరీ స్వస్తి పుణ్యవచన పూజలు నిర్వ హించి ఆదిత్యాది నవగ్రహాల మంటపం, ఇంద్రాది అష్టదిక్పాలకుల మంట పం, నవకళశ మంటపానికి భక్తిప్రపత్తులతో పూజించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులచే పూజలు అందుకోనున్నారు. కాగా, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నగరంలోని లలితాదేవి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వ హించి శైలపుత్రిక దేవి రూపంలో అలంకరించారు.

తొలిరోజు శైలపుత్రి (దుర్గాదేవి)కి పప్పు, పాయసం

సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిరపర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయైు అవతరించినందున ఆమెకు శైలపుత్రి అనునామం. వృషభ వాహన రూఢయైున ఈ మాతకు కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం విరాజిల్లుతుంది. తలపై చంద్రవంక ధరిస్తుంది. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు, వాంచితములను తీర్చే తల్లిగా అమ్మ వారిని భక్తులు పూజించారు. అమ్మవారికి ప్రసాదంగా చలిమెడి వడ, పప్పు, పాయసంను భక్తులు సమర్పించుకున్నారు. 

రెండో రోజు బ్రహ్మచారిణి (బాలత్రిపురసుందరి) అవతారం

బ్రహ్మచారిణి యగు తపస్సును ఆచరించిన తల్లి బ్రహమునందు చరించునది, కుడిచేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలం ధరించును. పరమేశ్వరుని పత్నిగా అవుటకు తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించిన తల్లి. ఈ తల్లిని పూజించిన సర్వసిద్ది, విజయప్రాప్తి కలుగును. ప్రసాదంగా తీపి బూంది, శనగలు సమర్పించారు. 

బోధన్‌ రూరల్‌: బోధన్‌లో సోమవారం  ఏక చక్రేశ్వరాలయంలో సార్వజనిక్‌ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి విగ్రహాన్ని కొలువుదీర్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మఽధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోధన్‌లో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు తొమ్మిది రోజుల పాటు రోజుకో అలంకరణలో దర్శనం ఇవ్వనున్నట్లు వేద పండితులు తెలిపారు. అదే విధంగా మండలంలోని సాలూర, మినార్‌పల్లి, సంగం, పెగడాపల్లి, కల్దుర్కి తదితర అన్ని గ్రామాలలో అమ్మవారి విగ్రహాలను కొలువుదీర్చారు. ఉదయం నుంచి అమ్మవారి విగ్రహాలను గ్రామాల్లోకి భజాభజంత్రీలతో, డప్పు వాయిధ్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. గ్రామాల్లో ఇప్పటి నుంచే దసరా పండుగ వాతావరణం నెలకొంది. 

నవీపేట: మండలంలోని పలు గ్రామాలలో  దేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గామాత మండపాలను అందంగా ఆలంకరించి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. నవీపేటలోని జై భవానీ దుర్గ మాత మండపం, మార్కండేయ మందిరం ఆవరణలో ఉన్న దుర్గమాత మందిరంలలో  అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జై భవానీ దుర్గమాత మండపం  ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుతో మండపానికి తీసుకువచ్చారు. ఈ ఊరేగింపులో వరంగల్‌కు చెందిన 18 మంది డప్పు కళాకారులు, ఇద్దరు పులివేషధారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 

మెండోర: మండలంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపనలు మండపాల నిర్వాహకులు యూత్‌ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో కోడిచర్ల, సావెల్‌, చాకిర్యాల్‌, మెండోర, పోచంపాడ్‌, దూదిగాం గ్రామాలలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారిని మంగళహారతులతో భజనలతో మండపానికి తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. 

వేడుకల్లో నియమాలు పాటించాలి : సీపీ నాగరాజు

ఖిల్లా: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే నిర్వహకులు పోలీసుశాఖ వారు సూచించే పలు నియమాలను పాటించాలని పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు. దుర్గామాత విగ్రహ ఏర్పాటు కోసం తప్పనిసరిగా పోలీసుశాఖ నుంచి అనుమతి పొందాలి. దుర్గామాత విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేయరాదన్నారు. విగ్రహ మండలీల సందర్శనకు వచ్చే మహిళలపై, యువతులపై ఈవ్‌టీజింగ్‌ జరగకుండా చూడాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా లౌడ్‌ స్పీకర్‌ల విషయంలో జాగ్రత్తలు వహించాలని, అలాగే అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. 


Updated Date - 2022-09-27T06:25:36+05:30 IST