ప్రమాదాలకు నెలవు ఇసుక క్వారీలు

ABN , First Publish Date - 2022-03-16T05:43:48+05:30 IST

జిల్లాలో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా కొనసాగుతున్న ఇసుక క్వారీలు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి.

ప్రమాదాలకు నెలవు ఇసుక క్వారీలు
మంజీరాలోని ఇసుక క్వారీల వద్ద లారీలలో జేసీబీలతో ఇసుకను లోడ్‌ చేస్తున్న దృ

- గడిచిన మూడు రోజుల్లో నలుగురు మృతి

- ఇసుక లారీలు ఢీకొనడంతోనే ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజలు

- అనుమతుల పేరిట ఇష్టారీతిన తవ్వకాలు

- మంజీరా పరివాహక ప్రాంతాల్లో భారీగా డంపులు

- అక్కడి నుంచి వేబిల్లులు లేకుండానే భారీ లోడ్ల వాహనాల్లో తరలింపు

- ప్రధానంగా రాత్రులలో ఇసుక లారీల అక్రమ రవాణాతో రోడ్డు ప్రమాదాలు

-  గతంలోనూ ఇసుక వాహనాలు ఢీకొని పలువురికి గాయాలు

- క్వారీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

- ప్రమాదాలను నివారించలేకపోతున్న పోలీసుశాఖ


కామారెడ్డి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా కొనసాగుతున్న ఇసుక క్వారీలు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పోలీసుశాఖ నిఘా కరువవడంతో క్వారీల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడ్లతో అక్రమంగా తరలిస్తున్న సమయంలో స్థానిక గ్రామాల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రధానంగా రాత్రి సమయాల్లో ఇసుక లారీలు అక్రమంగా తరలుతుండడంతో ఎదురుగా వచ్చే వాహనాలను లెక్కచేయకుండా ఢీకొంటూ అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో ఇసుక క్వారీల నుంచి వెళ్తున్న ఇసుక లారీలు, ట్రాక్టర్‌లు ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు నిదర్శనం.  మంజీరా నుంచి తవ్విన ఇసుకను పరివాహక ప్రాంతాల్లో భారీగా డంపులు ఉంచి ఎలాంటి వేబిల్లులు లేకుండానే వందల సంఖ్యలో భారీ వాహనాలలో అధిక లోడ్లతో తరలిస్తుండడంతో స్థానికంగా ఉండే రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి.  అధిక లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలు పలుమార్లు ప్రమాదాలకు కారణమయ్యాయి. మరోవైపు అక్రమంగా ఇసుక రవాణ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా జిల్లా యంత్రాంగం మాత్రం నిద్రావస్థలో ఉందని ఆరోపణలు వస్తున్నాయి.


  • ఇసుక రీచ్‌లో ప్రమాదాలు

జిల్లాలోని మంజీరా నదిపై బీర్కూర్‌ మండల పరిధిలో ప్రభుత్వం చెక్‌డ్యాం నిర్మాణం చేపడుతోంది. అయితే చెక్‌డ్యాం నిర్మించి పైభాగంలోని మంజీరా నదిలో ఉన్న ఇసుకను తోడెయ్యాలని బీర్కూర్‌ మండలంలోని బీర్కూర్‌ గ్రామంలో, బిచ్కుందలోని ఖద్గాం గ్రామపరిధిలో, మద్నూర్‌లోని కూర్ల పంచాయతీ పరిధిలో ఉన్న మంజీరా నదిలో ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం గత రెండేళ్ల కిందట అనుమతి ఇచ్చింది. 31 లక్షల 56 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వకాలకు టీఎస్‌ఎండీసీ ద్వారా కాంట్రాక్టర్‌లు తవ్వకాలు జరుపుతున్నారు. అయితే అనుమతుల  పేరిట మంజీరాలో కాంట్రాక్టర్‌లు, ఇసుకాసురులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతున్నారు. అధిక లోడ్లతో వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. సంవత్సరం కిందట బిచ్కుంద మండల కేంద్రంలో ఇసుక లారీ ఓ వ్యక్తిని ఢీకొనడంతో కాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎనిమిది నెలల కిందట ఇసుక తవ్వకాలతో నదిలో ఏర్పడిన భారీ గుంతల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మునిగిపోయి మృత్యువాత పడ్డారు. మూడు రోజుల కిందట పుల్కల్‌ గ్రామ శివారుల్లో అధికలోడ్‌తో ఇసుక లారీ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయాయి. ఈ సంఘటన జరిగిన మరుసటిరోజే హస్గుల్‌ గ్రామ శివారుల్లో ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం బీర్కూర్‌ ఇసుక రెండో క్వారీ సమీపంలోని రహదారిపై ఇసుక లారీ ఓనర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడిపోయాడు. మృతదేహాన్ని బట్టి చూస్తుంటే ఇసుక లారీ అతనిపై నుంచి పోవడంతోనే మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందాడా, ఎవరితోనైన గొడవపడి హత్యకు గురయ్యాడా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఇసుక రీచ్‌లు, రవాణా వల్ల స్థానిక ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

వేబిల్లులు లేకుండా అక్రమంగా తరలింపు

బిచ్కుంద, బీర్మూర్‌ మంజీరా ఇసుక క్వారీల నుంచి  అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అనుమతుల పేరిట క్వారీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతూ ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బిచ్కుంద, మద్నూర్‌, పిట్లం, జుక్కల్‌ మండలాల పరిధిలో ఎలాంటి వేబిల్లులు లేకుండా అధిక లోడ్లతో భారీ వాహనాలలో ఇసుకను జిల్లా మీదుగా దాటుతున్న ఇసుక వాహనాలను అధికారులు పట్టుకున్నారు. అనుమతులు పొందిన కాంట్రాక్టర్‌లు ఇసుక క్వారీ నిర్వహణను ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ సంపాదన కోసం వేబిల్లు లేకున్నా ఇసుక మాఫియాదారులతో కుమ్మక్కై అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతిరోజూ వందల లారీలు, టిప్పర్లు ప్రభుత్వ వేబిల్లులు లేకుండానే వెళ్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఇంతలా ఇసుక క్వారీలలో అక్రమ దందా కొనసాగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

పరిమితికి మించినా.. తనిఖీలు మాత్రం అంతంతే..

ఇసుకను ఏ వాహనంలో ఎంతమేర రవాణా చేయాలో టీఎస్‌ఎండీసీ నిబంధనలు రూపొందించింది. పరిమితికి మించి తరలిస్తే చర్యలు తీసుకుంటారు. లారీ లేదా టిప్పర్‌లలో టైర్ల సంఖ్య సామర్థ్యాన్ని బట్టి లోడింగ్‌ చేయాలి. పది టైర్ల వాహనంలో 19 టన్నులు, 12 టైర్ల వాహనంలో 26 టన్నులు, 14 టైర్ల వాహనంలో 32 టన్నుల ఇసుకను రవాణా చేయాలి. అనుమతించిన మేరకు సీనరైజ్‌ చెల్లించి వే బిల్లులు పొందుతున్న లోడింగ్‌ సమయంలో మాత్రం ఐదారు టన్నులు ఎక్కువ నింపుతున్నారు. కానీ వాహన యజమానులు, కాంట్రాక్టర్‌ కుమ్మక్కై డబ్బులు చెల్లించిన దానికంటే ఎక్కువ ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. అదనంగా నింపిన ఇసుకకు వినియోగదారుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని జేబుల్లో వేసుకుంటున్నారు. కాంట్రాక్టర్‌, టీఎస్‌ ఎండీసీ సిబ్బందికి కూడా ఇందులో వాటాలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దందా బహిరంగగానే కొనసాగుతున్న రవాణా, పోలీసుశాఖలు పట్టించుకున్న దాఖలాలు లేవు. మామూళ్ల మత్తులోనే పెద్దల కనుసన్నలో పని చేయాల్సి రావడం వల్లనో ఆయా శాఖల అధికారులు తనిఖీల జోలికి వెళ్లడం లేదు. బిచ్కుంద నుంచి హైదరాబాద్‌, మహారాష్ట్ర వందల సంఖ్యలో ఇసుక లోడ్‌ టిప్పర్‌లు, లారీలు వెళ్తున్నప్పటికీ ఏ ఒకలారీని కూడా తనిఖీ చేసిన దాఖాలలు లేవంటే ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ వందల టన్నుల ఇసుక అక్రమంగా తరలిపోతున్న టీఎస్‌ఎండీసీ అధికారులు మాత్రం అంతా బాగుందంటూ కితాబిస్తున్నారు. ఇసుక వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళ్లడంతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయి. తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

Updated Date - 2022-03-16T05:43:48+05:30 IST