అన్నదాతకు తేమ పోటు

ABN , First Publish Date - 2022-11-23T23:36:42+05:30 IST

ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేసి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు.

అన్నదాతకు తేమ పోటు
కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు కుప్పలుగా ఉన్న వరి ధాన్యం

- తేమ శాతం రాక కేంద్రాల్లోనే రోజుల తరబడి ఆర బెడుతున్న రైతులు

- తేమ, తాళ్లు పేరిట తూకంలో కోత

- క్వింటాల్‌ ధాన్యానికి 3 నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తున్న వైనం

- తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు

- ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

- జిల్లాలో ఇప్పటి వరకు 2.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

కామారెడ్డి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేసి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాగు చేసేది మొదలు పంట విక్రయించే వరకు అన్నదాతలు ఆగమవుతునే ఉన్నారు. సకాలంలో కొనుగోలు లేక పట్టించుకునేవారు కానరాక రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా తేమ శాతం విషయంలో కొన్నిచోట్ల కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. చాలా చోట్ల నిర్ధేశిత 17 కంటే తక్కువ తేమ శాతం ఉన్నప్పటికీ కొనుగోలు చేయడం లేదు. నిర్ధేశిత తేమ శాతం వస్తున్నా కాంటాపెట్టే పరిస్థితులు లేకపోవడంతో కేంద్రాల్లో కుప్పలు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నాయి. మద్దతు ధర కల్పించేందుకు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

తేమ ప్రధాన అడ్డంకి

రైతులు హర్వేస్టర్‌ ద్వారా వరి కోతలు చేపట్టారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకురావడం ముమ్మరమైంది. అక్కడ స్థలం కొరతతో ధాన్యం ఆర బోసేందుకు సమస్య తలెత్తుతోంది. దీంతో వడ్లలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉండాలి. కానీ 30 శాతానికి తక్కువగా నమోదు కావడం లేదు. నిర్ధేశిత తేమ కోసం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబెట్టే పరిస్థితి కూడా లేదు. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే రైతులు వడ్లు నేర్పుతున్నారు. మంచుతో మరింత తేమ చేరుతుందనే ఉద్దేశ్యంతో సాయంత్రం కుప్పగా పోసి దానిపై కవర్లు కప్పుతున్నారు. దీనికి తోడు నాణ్యతగా ఉన్న ధాన్యం కుప్పను కూడా ప్యాడీ క్లీనర్‌ ద్వారా తూర్పార పట్టాలని నిర్వాహకులు హుకూం జారీ చేయడం రైతులకు ఇబ్బందిగామారుతోంది. ఒక్కో కేంద్రంలో దాదాపు 20 క్వింటాళ్ల వరకు ధాన్యం ఉండడం, ప్యాడీ క్లీనర్‌లు సరిపడా లేకపోవడంతో వడ్లను శుభ్రం చేసేందుకు చాలా రోజుల సమయం తీసుకుంటుంది. ఇది చాలదన్నంటూ కొనుగోలు కేంద్రాల నుంచి రైసుమిల్లుకు ధాన్యం తరలించినా హమాలీ కొరత, ఒకేసారి లారీలు రాకపోవడంతో సకాలంలో ఆన్‌లోడ్‌ కావడం లేదు. చాలా కొనుగోలు కేంద్రాల నుంచి రోజుకు ఒక్కలారీ కూడా మిల్లుకు వెళ్లలేకపోతోంది.

సంచికి మూడు నుంచి ఐదు కిలోల కోత

కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన తర్వాత రైసుమిల్లుకు వెళ్తే 40 కేజీల సంచిపై మూడు నుంచి 5 కిలోల వరకు కోత విధిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో రైసుమిల్లర్లతో ఒప్పందాలు చేసుకుని తూర్పారా పట్టకుండా సంచికి మూడు కేజీల కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పారా పట్టి నాణ్యమైన ధాన్యం పంపించినా మిల్లర్లు ఖచ్చితంగా సంచిపై రెండు నుంచి నాలుగు కేజీల కోత విధిస్తే తమకు ఫిర్యాదు చేయాలని స్వయానా అధికారులు సూచిస్తున్నారు. అయినా గ్రామాల్లోని పరిస్థితుల దృష్ట్యా రైతులుపెద్దగా ముందుకు రావడం లేదు. దీనికి తోడు రైతుల కష్టాన్ని దోచుకుంటే రైతులు ఐకమత్యంగా ఉండి మిల్లర్లను నిలదీయాలని పలురైతు సంఘాలు చెబుతున్నాయి. తరుగు పేరిట రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సుమారు 3 నుంచి 5 కిలోల వరకు బస్తాకు తరుగు తీస్తుండడంతో రైతులు సంచికి రూ.100కు పైగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది.

2.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో ఈ వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం 350 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు గత 25 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కేంద్రాలకు పెద్దమొత్తంలో ధాన్యాన్ని రైతులు తరలించడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రతిరోజూ 17వేల నుంచి 20వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 47,800 మంది రైతుల నుంచి రూ.577 కోట్లు విలువ చేసే 2.95లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ.259 కోట్ల ధాన్యం డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లో జమ చేశారు.

Updated Date - 2022-11-23T23:36:44+05:30 IST