‘మన ఊరు మనబడి’ 15 రోజుల్లో పూర్తికావాలి

ABN , First Publish Date - 2022-10-11T05:53:35+05:30 IST

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీ 15 రోజుల్లో పూర్తయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

‘మన ఊరు మనబడి’ 15 రోజుల్లో పూర్తికావాలి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌అర్బన్‌, అక్టోబరు 10: పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీ 15 రోజుల్లో పూర్తయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం సంబంధిత అధికారులతో పనులపై సమీక్షించారు. ఇప్పటికే తొలి విడతలో ఎంపికైన అన్ని పాఠశాలలకు నిధులు సమకూర్చడం జరిగిందని, చేపట్టిన పనులకు సంబంధిత ఎంబీ రికార్డులు సమర్పించిన వెంటనే మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పనులను వేగవంతంగా జరిపిస్తూ 15 రోజుల్లోగా పనులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రతివారం ఒక్కో మండలం పరిధిలో 30లక్షల రూపాయలలోపు విలువగల పనులు కనీసం 4 బడుల్లో పూర్తికావాలని ఆయన స్పష్టం చేశారు. నాణ్యతపరంగా ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ కింద మంజూరు చేయబడిన పనులను గ్రౌండింగ్‌ జరిగేలా చూడాలన్నారు. పనులు సత్వర పూర్తికోసం మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఏఈలు ప్రత్యేక శ్రద్ధకనబరుస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇకపై తాను మన ఊరు మనబడి పనుల ప్రగతిని నిరంతరంగా సమీక్షిస్తానని పేర్కొన్నారు. ఆయాశాఖల్లో పెండింగ్‌ పనులను పూర్తిచేసుకోవాలని వర్ని, రేంజల్‌ తదితర ప్రాంతాల్లో వరికోతలు ప్రారంభమైనందున ధాన్యం కొనుగోలుకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, చిత్రమిశ్రా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read more