జోరుగా మద్యం విక్రయాలు

ABN , First Publish Date - 2022-04-05T06:13:08+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. ఉమ్మడి జిల్లాతో పాటు నిర్మల్‌ జిల్లాలో నూ భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం చేకురింది. సంవత్సరకాలంలో జిల్లాలోని మాక్లూర్‌ డిపొ పరిధిలో ఊహించని రీతిలో అమ్మకాలు పెరిగాయి.

జోరుగా మద్యం విక్రయాలు

ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా లిక్కర్‌ అమ్మకాలు

మాక్లూర్‌ డిపో పరిధిలోని మూడు జిల్లాల్లో రూ.1,679 కోట్ల మద్యం విక్రయాలు

బెల్ట్‌షాప్‌లతో అమ్మకాల జోరు 

ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జోరుగా మద్యం విక్రయాలు జరిగాయి. ఉమ్మడి జిల్లాతో పాటు నిర్మల్‌ జిల్లాలో నూ భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు  భారీగా ఆదాయం చేకురింది. సంవత్సరకాలంలో జిల్లాలోని మాక్లూర్‌ డిపొ పరిధిలో ఊహించని రీతిలో అమ్మకాలు పెరిగాయి. లిక్కర్‌పాటు బీర్ల అమ్మకాలు కూడా ఎక్కువ మొత్తంలో జరిగాయి. పండగలతో పాటు ఇతర కార్యక్రమాలు కరోనా వల్ల తగ్గినా మద్యం అమ్మకాలు మాత్రం డిపొ పరిధిలో పెరిగాయి.

మాక్లూర్‌ నుంచి మూడు జిల్లాలకు సరఫరా..

జిల్లాలోని మాక్లూర్‌ మద్యం డిపొ నుంచి ఉమ్మడి జిల్లాతో పాటు నిర్మల్‌ జిల్లాకు మద్యం సరఫరా అవుతోంది. ఈ మూడు జిల్లాల పరిధిలోని మద్యం షాప్‌లకు వాటి కెపాసిటీ ఆధారంగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 102 మద్యం షాప్‌లు, 15 బార్‌లు, కామారెడ్డిలో 41 మద్యంషాప్‌లు, 3 బార్‌లు, నిర్మల్‌లో 47 మద్యంషాప్‌లు, 8 బార్‌లు ఉన్నాయి. వీటికి లైసెన్స్‌ ఆధారంగా ప్రతి నెలా కోటా ప్రకారం మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. అమ్మకాలు ఎక్కువగా జరిగితే మద్యాన్ని కూడా ఎక్కువ మొత్తంలో అనుమతి ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌కు మించి అమ్మకాలు జరిగేవిధంగా ఎక్సైజ్‌ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు జిల్లాల పరిధిలో కరోనా ఉన్నా.. మద్యం అమ్మకాలు మాత్రం తగ్గలేదు. కరోనా సమయంలో శుభకార్యాలు, కొన్ని పండగలు మామూలుగా జరుపుకున్నా మద్యం సేల్స్‌ మాత్రం తగ్గలేదు. గడిచిన సంవత్సరం 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి 31 వరకు భారీగా అమ్మకాలు జరిగాయి. ఈ డిపొ పరిధిలో మొత్తం రూ.1679 కోట్ల  మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ డిపొ పరిధిలో 12 నెలల్లో ఐఎంఎల్‌ లిక్కర్‌ 19లక్షల 48వేల 154 కేసుల అమ్మకాలు జరిగాయి. బీర్లు 23లక్షల 91వేల 57 కేసుల అమ్మకాలు అయ్యాయి. గత సంవత్సరం 2020తో పోలిస్తే అమ్మకాలు పెరిగాయి. 2020-21లో డిపొ పరిధిలో 1378 కోట్ల 14లక్షల 29వేల 129 రూపాయల అమ్మకాలు జరిగాయి. కరోనా వ్యాప్తితో ఆశించిన మేరకు అమ్మకాలు ఉండవని భావించినా రెండో విడతతో పోలిస్తే కొంత తక్కువ ప్రభావం ఉండడంతో మద్యం అమ్మకాలు ఎక్కువగానే జరిగాయి. 

బెల్ట్‌షాప్‌ల్లోనూ అధిక వినియోగం..

మూడు జిల్లాల పరిధిలో మద్యం షాప్‌లతో పాటు బెల్ట్‌షాప్‌ల్లో అమ్మకాలు ఎక్కువగా జరగడం వల్ల సేల్స్‌ పెరిగాయి. ప్రతీ మద్యం షాప్‌ పరిధిలో 10 నుంచి 15 వరకు బెల్ట్‌షాప్‌లు అనధికారికంగా నడుస్తుండడంతో మద్యం అమ్మకాలు ప్రతినెలా పెరుగుతున్నాయి. ప్రభుత్వ టార్గెట్‌లకు అనుగుణంగా మద్యం అమ్మకాలు జరిగేవిధంగా చూస్తున్న ఎక్సైజ్‌ అధికారులు బెల్ట్‌షాప్‌లను పట్టించుకోకపోవడం వల్ల సేల్స్‌ భారీగా పెరుగుతున్నాయి. పలు గ్రామాల్లో బెల్ట్‌షాప్‌లకు టెండర్‌ వేసి అమ్మకాలు చేస్తున్నారు. ప్రతి గ్రామానికి రూ.3 నుంచి 10 లక్షల వరకు చెల్లిస్తూ బాటిళ్లపైన రూ.10 నుంచి 20 వరకు ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు మాత్రం పన్నుల రూపంలో రూ. 167 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూడు జిల్లాల పరిధిలో ఈ సంవత్సరం మద్యం అమ్మకాలు  మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో..

జిల్లాలో ప్రభుత్వ ఖజానా ఆదాయం తెచ్చే స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖలో కూడా భారీగానే ఆదాయం వచ్చింది. ఈ శాఖకు సంవత్సర టార్గెట్‌ రూ.120 కోట్లు ఉండగా ఈ సంవత్సరం 157 కోట్ల లక్షా 35వేల రూపాయలు వచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని పది సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల ద్వారా 69వేల 856 డాక్యూమెంట్‌లను రిజిస్ర్టేషన్‌ చేశారు. ఈ సంవత్సరం భూముల రేట్లు పెంచడం వల్ల మరింత ఎక్కువగా ఆదాయం ఖజానాకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని మార్కెటింగ్‌శాఖ ద్వారా రూ.34కోట్ల 60లక్షలకు పైగా ఆదాయం ప్రభుత్వానికి చేరింది. జిల్లాలోని వాణిజ్యపన్నుల శాఖ ద్వారా భారీగా ఆదాయం వచ్చింది. వివిధ సంస్థలు, పరిశ్రమల ద్వారా సుమారు వెయ్యి కోట్లకు పైగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయం వచ్చినట్లు అధికార వర్గాల సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. గనులు, భూగర్భశాఖ, రవాణాశాఖ తహసీల్దార్‌ కార్యాలయాలు రిజిస్ర్టేషన్‌ల ద్వారా మరికొంత ఆదాయం ఖజానాకు చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లా నుంచి ఖజానాకు 10 నుంచి 20 శాతం మేర ఆదాయం పెరిగినట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. టార్గెట్‌కు అనుగుణంగా పన్నులు వసూలు చేసినట్లు వారు తెలిపారు.

Read more