మాస్టర్‌ ప్లాన్‌ ప్రజల కోసమేనా?

ABN , First Publish Date - 2022-12-04T23:33:19+05:30 IST

ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటు చేయాల్సిన మాస్టర్‌ ప్లాన్‌ కొంత మంది స్వార్థం కోసం లక్షలాది మంది ప్రజల, వేలాది మంది రైతులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.

మాస్టర్‌ ప్లాన్‌ ప్రజల కోసమేనా?
ప్రజలకు అవగాహన కోసం ఏర్పాటు చేసిన నూతన మాస్టర్‌ ప్లాన్‌

- గత నాలుగు నెలల కిందటే మాస్టర్‌ ప్లాన్‌కు బీజం పడిందా

- వ్యక్తుల స్వలాభం కోసం పక్కా ప్లాన్‌ ప్రకారమే మాస్టర్‌ తయారు చేశారా?

- కొందరు ప్రైవేట్‌ వెంచర్ల స్వలాభం కోసం ప్లాన్‌ చేశారంటూ ఆరోపణలు

- జనాభా పెరిగి, ట్రాఫిక్‌ పెరిగితే రోడ్ల విస్తీర్ణం పెంచాల్సింది పోయి.. కుదించడం ఎందుకో?

- గతంలో ఉన్న ఇండస్ట్రియల్‌ ఏరియాను ఎందుకు ముందుకు జరిపినట్లు

- అసైన్డ్‌ భూములను వదిలి రైతుల పట్టా భూముల్లో ఇండస్ట్రియల్‌ ఏరియాల ఏర్పాటు

- మాస్టర్‌ ప్లాన్‌పై ఎక్కడా నిబంధనలు పాటించలేదని ఆరోపణలు

కామారెడ్డి/కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 4: ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటు చేయాల్సిన మాస్టర్‌ ప్లాన్‌ కొంత మంది స్వార్థం కోసం లక్షలాది మంది ప్రజల, వేలాది మంది రైతులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. ఒక్కసారి మాస్టర్‌ ప్లాన్‌ అప్రూవల్‌ అయితే మరో 20 సంవత్సరాల వరకు ఎలాంటి మార్పులు ఉండవని తెలిసినా అధికారులు తూతూ మంత్రంగా మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేశారా లేక కొందరు వ్యక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసే ముందు ఎన్నో రకాల కసరత్తు చేయాల్సి ఉంటుంది. మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసే ముందు ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సౌకర్యార్థం ఎలాంటి ప్లాన్‌ తయారు చేయాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు, పట్టణ ప్రజలతో చర్చించిన తర్వాత ప్రజా శ్రేయస్సుకు అవసరమైన అని వివరాలు సేకరించి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఆయా విభాగాలను కేటాయిస్తూ ప్లాన్‌ తయారు చేయాల్సి ఉండగా ఎక్కడా నిబంధనలు పాటించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గత నాలుగు నెలల కిందటే మాస్టర్‌ ప్లాన్‌కు బీజం పడి పక్కా ప్లాన్‌ ప్రకారమే తమ స్వార్థం కోసం కొందరు వ్యక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రజల సౌకర్యార్థం మాస్టర్‌ ప్లానా.. లేక ప్రైవేట్‌ వ్యక్తుల స్వలాభం కోసమా?

ప్రజల సౌకర్యార్థం మాస్టర్‌ ప్లాన్‌ చేశారా లేక ప్రైవేట్‌ వ్యక్తుల స్వలాభం కోసం మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేశారా అనే అనుమానాలు గత మాస్టర్‌ ప్లాన్‌కు, ఇప్పటి మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతోంది. గత 20 ఏళ్ల కిందట తయారు చేసిన మాస్టర్‌ ప్లాన్‌లో ఓల్డ్‌ ఎన్‌హెచ్‌ 7 రోడ్డు 200 ఫీట్లుగా ఉండగా ప్రస్తుతం ఆ రోడ్డు 150 ఫీట్లకు కుదించారు. జన్మభూమి రోడ్డు నుంచి విద్యానగర్‌ మీదుగా కొత్త బస్టాండ్‌ వరకు, కొత్త బస్టాండ్‌ నుంచి అశోక్‌నగర్‌ వరకు ఉన్న 80 ఫీట్ల రోడ్డును 60 ఫీట్లకు కుదించారు. మరికొన్ని చోట్ల గత మాస్టర్‌ ప్లాన్‌లో చూపిన రోడ్డులో కొందరు రోడ్డును ఆక్రమించుకుని గృహాలను ఏర్పాటు చేసుకున్న వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు ఆ ప్రాంతంలో అసలు రోడ్డునే తీసేశారు. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత నిత్యం రద్దీగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వాహనదారులు ప్రయాణించాలంటే అపాసోపాలు పడాల్సి వస్తోంది. మరికొన్ని సందర్భాల్లో జనాభా పెరిగి వాహనాలు ఏ విధంగా ప్రయాణం చేయాలనే కనీసం అవగాహన లేకుండా గతంలో ఉన్న రోడ్లను కుదించడంను చూస్త్తేనే అర్థం చేసుకోవచ్చు మాస్టర్‌ ప్లాన్‌ను ఏ విధంగా మాస్టర్‌ మైండ్‌తో తయారు చేస్తున్నారో అనేది. ఏ చిన్న అనుమాన ం లేకుండా ఈ తగ్గించిన రోడ్లను కొందరు ప్రైవేట్‌ వ్యక్తుల వెంచర్లకు అనుకూలంగా ఉండేందుకు అసలు మరో 10 సంవత్సరాల వరకు జనభా రద్దీ పెరగని చోట్లలో 100 ఫీట్ల రోడ్లను వేసేందుకు ప్లాన్‌ చేశారంటే మాస్టర్‌ మైండ్‌లను ఏ విధంగా ఉపయోగించారోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 12.25శాతం రోడ్లను ప్రజా అవసరాలు ఉన్న చోట తగ్గించి కొందరు ప్రైవేట్‌ వ్యక్తుల సౌకర్యార్థం పెంచారనే లోగుట్టు పాత, కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.

పట్టా భూముల్లోనే ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎందుకో?

అసైన్‌ భూములు వేల ఎకరాల్లో ఉండగా కేవలం పట్టా భూముల్లోనే ఇండస్ట్రియల్‌ జోన్‌ చేయడం, గతంలో ఉన్న ఇండస్ట్రియల్‌ జోన్‌ను మరికొంత ముందుకు జరిపి దాని ప్రస్తుతం మరో రకంగా వినియోగించుకునేలా చేయడంపై ఎవరి స్వార్థం ఉందనే ఆలోచనలు ఆయా ప్రాంతాల్లో భూములు ఉన్న వారు ఆరా తీస్తున్నట్లు సమాచారం. గతంలో సిరిసిల్లా రోడ్డులోని పార్క్‌ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్‌ జోన్‌ వెనుక గతంలో ఓ వ్యాపారి వెంచర్‌ చేయగా ఇక్కడి కొందరు నాయకులు దానికి అడ్డుతగిలి ఆ ప్రాంతం ఇండస్ట్రియల్‌ ఏరియా కిందకు వస్తుందని ఆ వెంచర్‌ను ముందుకు కదలనీయకుండా చేసి తక్కువ డబ్బులకు సదరు వ్యాపారి నుంచి ఆ భూములను బినామీల పేర్లతో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భూములను ప్రస్తుత మాస్టర్‌ ప్లాన్‌ నుంచి ఇండిస్ట్రియల్‌ ఏరియా నుంచి తొలగింపజేసుకునేందుకే ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్‌ ఏరియా నుంచి తొలగింపజేసేందుకు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కడా అనుమానం రాకుండా ఆ ప్రాంతాన్ని మరికొంత ముందుకు జరిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పంట పొలాలు ఉన్న రైతులు ఇటీవల కామారెడ్డి మున్సిపల్‌లో ఆందోళన చేసిన సమయంలో చర్చించుకోవడం గమనార్హం.

నిబంధనలు పాటించకపోవడంతో ఇప్పటికీ ప్రజలకు అవగాహన లేని వైనం

మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసే ముందు చేపట్టాల్సిన ఏ నిబంధనలను అధికారులు పాటించలేదనే ఆరోపణలు ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి. లింగపూర్‌, దేవునిపల్లి, టెక్రియాల్‌ ప్రాంతాల్లో కొందరికి ఉన్న వెంచర్లు, భూములకు అధిక ధరలు వచ్చేందుకు రైతుల భూములను ఫణంగా పెడుతున్నారని తెలుస్తోంది. ఆ భూముల విలువ ఇప్పుడు రూ.కోట్లలో ఉండగా వారు నష్టపోతారనే కనీస ఆలోచన అఽధికారులు చేయకపోవడం, వారికి మాస్టర్‌ ప్లాన్‌పై వివరించేందుకు చర్యలు చేపట్టకపోవడంపై అన్ని వర్గాల ప్రజలు, ప్రతిపక్ష నాయకులు మండి పడుతున్నారు. కేవలం మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేసి అక్కడక్కడా మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కొందరు చదువుకున్న వ్యక్తులు, మాస్టర్‌ ప్లాన్‌పై అవగాహన వ్యక్తులు మాత్రమే మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-12-04T23:33:21+05:30 IST