ఆసుపత్రుల్లో అన్నీ లొసుగులే!

ABN , First Publish Date - 2022-09-26T05:42:59+05:30 IST

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అన్ని లొసుగులే. వైద్యుల పేరున అనుమతులు తీసుకున్నప్పటికీ.. పర్మినెంట్‌ వైద్యులూ లేరు.. సిబ్బంది లేరు. రోగులు వచ్చిన విధంగా వైద్యులను కన్సల్టెంట్‌ పేరున రప్పిస్తున్నారు. రోగులకు చికిత్సను అందిస్తున్నారు. వేలకు వేల రూపాయలు ప్యాకేజీ రూపంలో డబ్బులను వసూలు చేస్తున్నారు. జనరల్‌ ఆసుపత్రుల నుంచి ప్రత్యేక చికిత్స పొందిన

ఆసుపత్రుల్లో అన్నీ లొసుగులే!
జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో రోగితో మాట్లాడుతున్న బృందంలోని సభ్యులు

జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వైద్యులు లేరు.. సిబ్బంది రారు

కన్సల్టెంట్‌ పేరిట వైద్యులను రప్పిస్తున్న యాజమాన్యాలు

మామూళ్లతో అధికారులను మభ్యపెడుతున్న వైనం

ప్యాకేజీ పేరున రోగుల నుంచి భారీగా ఫీజుల వసూలు

ఆసుపత్రుల్లోని మందుల దుకాణాల్లో ఎక్కువ మొత్తంలో ధరలు

ఇప్పటి వరకు ఏ ఆసుపత్రికి జారీ కాని నోటీసులు

మరో నాలుగు రోజుల పాటు తనిఖీలు చేయనున్న బృందాలు

జిల్లావ్యాప్తంగా రోగులకు తప్పని తిప్పలు

నిజామాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అన్ని లొసుగులే. వైద్యుల పేరున అనుమతులు తీసుకున్నప్పటికీ.. పర్మినెంట్‌ వైద్యులూ లేరు.. సిబ్బంది లేరు. రోగులు వచ్చిన విధంగా వైద్యులను కన్సల్టెంట్‌ పేరున రప్పిస్తున్నారు. రోగులకు చికిత్సను అందిస్తున్నారు. వేలకు వేల రూపాయలు ప్యాకేజీ రూపంలో డబ్బులను వసూలు చేస్తున్నారు. జనరల్‌ ఆసుపత్రుల నుంచి ప్రత్యేక చికిత్స పొందిన ఆసుపత్రుల వరకు ఇదే వైఖరిని అవలంభిస్తున్నారు. ఈ ఆసుపత్రులపైన తనిఖీలు రెగ్యులర్‌గా లేకపోవడంతో నిర్దిష్ట ఫీజు లు లేకుండా ఒక్కో చికిత్సకు ఒక్కో రేటు, ఒక్కో పరీక్షకు ఒక్కో రేటును చెబుతూ ముక్కుపిండి రోగుల నుంచి డబ్బులను వసూలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎవరైనా తనిఖీలకు వస్తే తమకున్న పలుకుబడితో మేనేజ్‌ చేస్తున్నారు. వారికి కావాల్సిన మామూళ్లను అందిస్తున్నారు. ఆసుపత్రు ల్లో కనీస వసతులు లేకున్న సేవలను అందిస్తున్నారు.

ఆసుపత్రుల్లో ముమ్మర తనిఖీలు

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులపైన కలెక్టర్‌ నియమించిన ఎనిమిది బృందాల తో పాటు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ తరపున మరో తొమ్మిది బృందాలు ఈ ఆసుపత్రులను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నాయి. అయితే ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. మూడు నెలల క్రితం కలెక్టర్‌ నియమించిన బృందాలు కొన్ని ఆసుపత్రులను పరిశీలించి నివేదిక ఇవ్వడంతో, అప్పుడు పలు ఆసుపత్రులకు నోటీసులను జారీ చేశారు. చర్యలు చేపట్టకపోవడం వల్ల యఽథేచ్ఛగా అదే రీతిలో కొనసాగిస్తున్నారు.

ఫీల్డ్‌కు సంబంధంలేని వారితో..

నగరం పరిధిలోని కొన్ని నర్సింగ్‌ హోంలు ఎలాంటి వైద్యులు లేకుండానే ఏర్పాట్లను చేశారు. ఈ నర్సింగ్‌ హోంలలో మెడికల్‌ ఫీల్డ్‌కు సంబంధం లేనివారు నిర్వహిస్తున్నారు. కొంతమంది ఎంబీబీఎస్‌, ఇతర వైద్యులను నియమించుకుని సేవలను అందిస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో గర్భిణులతో పాటు ఇతర రోగాలకు సైతం వైద్య సేవలను అందిస్తున్నారు. గ్రామాలు, ఇతర ప్రాంతాల నుంచి తమ ఆసుపత్రులకు రోగులు వచ్చేవిధంగా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుని వైద్య సేవలను అందిస్తున్నారు. వివిధ సమస్యలతో ఈ ఆసుపత్రులకు వచ్చేవారికి ప్యాకేజీల పేర డబ్బులను ముందే నిర్ణయించి కన్సల్టెంట్‌ డాక్టర్‌లను వైద్య సేవలు అందిం చేందుకు పిలిపిస్తున్నారు. సిజేరియన్‌ల తో పాటు ఇతర ఆపరేషన్‌లను కొనసాగిస్తున్నారు. ఈ ఆసుపత్రులను తనిఖీ చేసిన వైద్యుల బృందం ఏర్పాట్లను చూసి నివ్వెరపోయారు. నగరం పరిధిలో ఇప్పటి వరకు తనిఖీ చేసిన వాటిలో మొత్తం ఎని మిది ఆసుపత్రులు ఇదే తరహా ఉండడం, స్పెషలిస్టు వైద్యులు లేకున్నా.. ఉన్నట్లు బోర్డులు పెట్టడం గుర్తించారు. ఈ ఆసుపత్రుల్లో రోగుల రిజిస్ర్టేషన్‌తో పాటు ఏ రికార్డులను నిర్వహించక పోవడం గమనించారు. అంతే కాకుండా పలు ప్రైవేట్‌ ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన నర్సులు, ఇతర సిబ్బంది లేకపోవడం గుర్తించారు. అయినా వివిధ రోగాలకు సేవలు అందించడం వారు పరిశీలనలో తేలడంతో ఈ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ అదికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

నిబంధనల మేరకు కొన్నే..

జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 80కి పైగా ఆసుపత్రులను తనిఖిలు నిర్వహించారు. రెండు రకాల బృందాలు ఆయా ఆసుపత్రులను పరిశీలించగా కొన్ని ఆసుపత్రులు మాత్రం నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. జిల్లా లోని అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులకు నేరుగా రోగులు రాకుండా నెట్‌వర్క్‌ ద్వారానే ఎక్కువగా వస్తున్నట్లు వారి తనిఖిలలో తేలింది. జిల్లాలోని ప్రసవాలు నిర్వహిం చే సుమారు 70కి పైగా ఆసుపత్రుల్లో 50 వరకు ఆపరేషన్‌ థియేటర్‌, లేబర్‌ రూంలు ఉన్న ఇతర ఆసుపత్రుల్లో మాత్రం మౌలిక వసతులు లేనట్లు గుర్తించారు. ప్రసవాలు అయిన తర్వాత సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొన్ని రకాల టెస్టులు ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న టెక్నీషియన్‌లు లేకపోయినా.. ఇతర ల్యాబ్‌ల నుంచి పిలిపించి చేస్తున్నారు. వారిచ్చే నివేదికల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. దీని వల్ల రోగులకు బిల్లులు కూడా భారీగా వేస్తున్నట్లు గుర్తించారు.

గడువు ముగిసిన ఆసుపత్రులు

జిల్లాలో పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు అనుమతులు తీసు కున్న కొన్ని ఆసుపత్రులకు గడువు ముగిసిన మళ్లీ రెన్యూవల్‌ చేయించుకోనట్లు గుర్తించారు. పాత రిజిస్ర్టేషన్‌ ఆసుపత్రులను కొనసాగిస్తున్నారు. ప్రతీ ఆసుపత్రిలో తప్పనిసరిగా 24 గంటలు సేవలు అందించేందుకు వైద్యులు ఉండాలి. అదే రీతిలో నర్సింగ్‌స్టాఫ్‌, పారిశుధ్య సిబ్బంది ఉండాలి. చాలా ఆసుపత్రుల్లో పారిశుధ్యం కూడా లోపించినట్లు గుర్తించారు. కీలకమైన పరికరాలు కూడా కొన్ని ఆపరేషన్‌ థియేటర్‌లు లేబర్‌ రూంలో లేనట్లు తనిఖీల్లో తేలింది. ఆపరేషన్‌ సమయంలో అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్‌లు, కరెంటు పోతే అవసరం కోసం జనరేటర్‌లు కొన్ని ఆసుపత్రుల్లో లేవు. కొన్నింట్లో సెంట్రలైజ్‌ ఆక్సిజన్‌ ఏర్పాట్లు ఉన్న మరికొన్ని ఆసుపత్రులు తాత్కాలిక సిలిండర్‌లతో నిర్వహిస్తున్న ట్లు తనిఖీలు చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ బృందం అధికారులు గుర్తించారు. అంతేకాకుండా వీటిల్లో ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు స్పెషలిస్టు డాక్టర్‌ల పేరున్న రెగ్యులర్‌గా వారు ఆ ఆసుపత్రులకు రావడం లేదు. ఎక్కువమంది అవసరమైన సమయంలోనే పిలిపిస్తూ సేవలను అందిస్తున్నట్లు తనిఖీల్లో భాగంగా తేలడం తో నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

సగం ఆసుపత్రులు వారివే..

జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో దాదాపు సగం వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు సంబంధించినవే ఉండడం వల్ల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఎలాంటి సౌకర్యాలు లేకున్నా..  ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నా.. తమకు ఫిర్యాదులు వస్తున్నా.. వారు పట్టించుకోవడం లేదు. గడిచిన మూడూ సంవత్సరాల్లో రోగులు ఇచ్చిన ఫిర్యాదు లతో ఏ ఆసుపత్రిని తనిఖీ చేయనే లేదు. అంతేకాకుండా  అధిక ఫీజులు వసూలు చేసినా.. వైద్యం అందించడంలో విఫలమైనా.. ఎలాంటి చర్యలు చేపట్టనే లేదు. ప్రభుత్వ వైద్యులకు సంబంధించినవి కావడం, వారు తమకున్న పలుకుబడిని ఉపయోగించడం, కుటుంబ సభ్యుల పేరుతో వాటిని నిర్వహించడం వల్ల ఎవరూ వాటిని పట్టించుకోవడంలేదు.

మందుల విక్రయంలోనూ అధికమే..

ఈ ప్రైవేట్‌ నర్సింగ్‌హోంల్లో వైద్య సేవలతో పాటు మందుల విక్రయంలో కూడా ఎక్కువ మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆసుపత్రులకు వచ్చేవారికి బయట కొనకుండా.. తమవద్దనే కొనేవిధంగా చూస్తున్నారు. వైద్యులు రాసే మందులు బయట షాప్‌లలో తక్కువ రేట్లకు వచ్చినా.. ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న మందుల షాప్‌లలో ఎక్కువ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారు. కొంతమంది రోగులకు సంబంధించిన బంధువులు బయట తెచ్చేందుకు ప్రయత్నం చేసినా.. వారు అంగీకరించడం లేదు. ప్రతీ కంపెనీకి సంబంధించిన మందు లు ఆసుపత్రికి సం బంధంలేని మందుల షాప్‌లలో 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు ఇచ్చినా..  నర్సింగ్‌హోంలలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఇవ్వకుండా మొత్తం వసూళు చేస్తున్నారు. ఈ విషయాలను కూడా తనిఖీ బృందాలు నివేదికలో నమోదు చేసుకున్నాయి. జిల్లాలో ఈ బృం దాలు తనిఖీలను నిర్వహిస్తు న్నా.. ఆసుపత్రులకు సం బంధించిన యాజమాన్యాలు మాత్రం ఎలాంటి ఆందోళన చెందడం లేదు. గతంలో లాగానే నోటీసులు ఇస్తే సమాధానం ఇవ్వొచ్చని వారు భావిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున చర్యలు చేపడితే.. అప్పుడు ఒత్తిళ్తు పెంచవచ్చని వారు ఆ ప్రయత్నాల్లో ఉండడం గమనార్హం.

జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కొనసాగుతున్న తనిఖీలు

: డాక్టర్‌ సుదర్శనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి 

జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖతో పాటు జిల్లా కలెక్టర్‌ ఆద్వర్యంలో నియమించిన బృందాలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రోజుల పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయి. అయితే, ఆసుపత్రుల నిర్వహణ తీరు పట్ల ఇప్పటి వరకు అందిన నివేదికలను అనుసరించి ఏ ఆసుపత్రికి నోటీసులను జారీ చేయలేదు. వీటికి సంబంధించిన పూర్తి నివేదికలు ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్‌ తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వానికి కూడా జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల పరిస్థితిపై నివేదిక పంపించడం జరుగుతుది. 

Updated Date - 2022-09-26T05:42:59+05:30 IST