పోడు పట్టాలపై ఆశలు

ABN , First Publish Date - 2022-09-22T05:19:19+05:30 IST

పోడు భూముల పట్టాలపై బాధిత రైతుల్లో మరోసారి ఆశలు రేకెత్తుతున్నాయి. పోడు భూముల పరిష్కారం కోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వం సైతం ఆయా జిల్లాల యంత్రంగాలకు కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

పోడు పట్టాలపై ఆశలు
రామారెడ్డి మండలాల్లో ఉన్న పోడు భూములు

- సమన్వయ కమిటీల ఏర్పాటుకు చర్యలు
- జిల్లా కమిటీ ద్వారానే తుది జాబితా
- కమిటీల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించిన యంత్రాంగం
- ఇది వరకే పోడు భూముల కోసం దరఖాస్తుల స్వీకరణ
- జిల్లాలో 27 వేలకు పైగా పోడు భూములకు దరఖాస్తులు
- అత్యధికంగా గాంధారిలో 7,900 దరఖాస్తులు
- త్వరగా పూర్తిచేసి పట్టాలు ఇవ్వాలంటున్న పోడు రైతులు

కామారెడ్డి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): పోడు భూముల పట్టాలపై బాధిత రైతుల్లో మరోసారి ఆశలు రేకెత్తుతున్నాయి. పోడు భూముల పరిష్కారం కోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వం సైతం ఆయా జిల్లాల యంత్రంగాలకు కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోడు భూముల్లో పంటలు సాగుచేసుకుంటున్న అర్హులైన రైతులకు పట్టాలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. గత 10 నెలల కిందటే పోడుభూముల పరిష్కారానికై బాధిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా వేలల్లోనే దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సైతం అధికారులు నమోదు చేశారు. ఎట్టకేలకు ఈ దరఖాస్తుల పరిశీలన కోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనుండడంతో పోడు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని పోడు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
ప్రతీ సీజన్‌లోనే పోడు భూముల సాగుపై వివాదాలు
వానాకాలం, యాసంగి సీజన్‌లు ప్రారంభం నుంచే పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే విషయంలో ఇటు రైతుల్లో, అటు అటవీశాఖ అధికారుల మధ్య వివాదం నెలకొంటూనే ఉంది. ప్రతీ సీజన్‌లోను పోడు భూముల విషయంలో ఏదో ఒకచోట గొడవలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. అటవీ భూముల్లో సాగు చేసుకునే రైతులపై అటవీశాఖ అధికారులు, పోలీసులు కేసులు నమోదు చేస్తునే ఉన్నారు. అయితే ఈ పోడు భూముల పరిష్కారం చేయాలంటూ గిరిజనుల నుంచే కాకుండా పోడు భూముల రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడమే కాకుండా ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో పోడు భూముల పరిష్కారానికి గత ఏడాది డిసెంబరులోనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. అయితే సమన్వయ కమిటీల ఏర్పాటులో కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో పోడు భూముల రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎట్టకేలకు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.
సమన్వయ కమిటీల ఏర్పాటుకు చర్యలు
గత ఏడాది డిసెంబరులో పోడు భూముల పరిష్కారానికి బాధిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి 10 నెలలు గడిచిన తర్వాత మరో అడుగు పడింది. ఈ సమస్యను పరిష్కరించాలని గిరిజన ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని పదేపదే కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో పలు అంశాలపై చర్చించి ప్రణాళికలను రూపొందించారు. ఎవరికి పత్రాలు ఇవ్వాలి, వారిని గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాల్లో భాగంగా గ్రామ, మండల, డివిజన్‌, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత డిసెంబరులోనే పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఏ డివిజన్‌లో, గ్రామాల్లో పోడు భూములు ఎక్కువగా ఉన్నాయో గుర్తించారు. వీటి పరిష్కారానికి  నాలుగు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 15 మంది గ్రామస్థులతో పాటు పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ప్రభుత్వం నియమించిన గ్రామ ప్రత్యేకాధికారి సమక్షంలో కమిటీని ఏర్పాటు చేసి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిని నియమించనున్నారు. జిల్లా కమిటీలో ఇన్‌చార్జ్‌ మంత్రి చైర్మన్‌గా కలెక్టర్‌ కన్వీనర్‌గా ఉన్నతాధికారులు సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రజాప్రతినిధులు ఉండనున్నారు. గ్రామ, మండల డివిజన్‌ స్థాయి కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన వారిని గుర్తించి నివేదికను జిల్లా కమిటీకి ఇవ్వనున్నారు. అర్హులైన పోడు భూముల రైతుల తుది జాబితాను జిల్లా కమిటే తయారు చేయనుంది.
జిల్లా వ్యాప్తంగా 27వేల 75 దరఖాస్తులు
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మూడు డివిజన్‌ల పరిధిలో పోడు భూములు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూముల్లో బాధిత రైతులు పంటలు సాగు చేసుకుంటున్నా హక్కు పత్రాలకు మాత్రం నోచుకోవడం లేదు. గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వ పోడు భూములకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే జిల్లాలో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో గల 395 గ్రామాల్లో పోడు భూములు ఉన్నట్లు గుర్తించి ఆ గ్రామాల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27వేల 75 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులకు గాను మొత్తం 68వేల భూ విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులో ఎస్టీ(గిరిజనులు) 11,365 మంది దరఖాస్తుల చేసుకోగా వీరి పరిధిలో 30,654 ఎకరాల్లో ఉండగా గిరిజనేతరులు 15,710 మంది దరఖాస్తు చేసుకోగా వీరి పరిధిలో 37,851 ఎకరాల్లో ఉన్నట్లు దరఖాస్తుల ద్వారా తేలింది.
మండలాల వారీగా దరఖాస్తుల వివరాలు
జిల్లాలో  పోడు భూముల కోసం అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో అత్యధికంగా గాంధారి మండలం నుంచి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 27వేలకు పైగా దరఖాస్తులు రాగా ఇందులో గాంధారి మండలంలోనే 7,900 దరఖాస్తులు వచ్చాయి. మండలాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండల పరిధిలో 1,725 మంది దరఖాస్తు చేసుకోగా వీటి పరిధిలో 4,179 ఎకరాలు ఉంది. బిచ్కుందలో 974 దరఖాస్తుల్లో 2,193 ఎకరాలు, బీర్కూర్‌లో 26 దరఖాస్తుల్లో 34.26 ఎకరాలు, జుక్కల్‌లో 804 దరఖాస్తుల్లో 2,038 ఎకరాలు, మద్నూర్‌లో 95 దరఖాస్తుల్లో 165 ఎకరాలు, నస్రూల్లాబాద్‌లో 174 దరఖాస్తుల్లో 406.11 ఎకరాలు, నిజాంసాగర్‌లో 1,631 దరఖాస్తులు 2,937 ఎకరాల్లో, పెద్ద కొడప్‌గల్‌లో 334 దరఖాస్తుల్లో 805.36 ఎకరాల్లో, పిట్లంలో 1,200 దరఖాస్తుల్లో 1,562 ఎకరాలు, మాచారెడ్డిలో 2,383 దరఖాస్తుల్లో 7,748 ఎకరాలు, రామారెడ్డిలో 252 దరఖాస్తుల్లో 637 ఎకరాలు, దోమకొండలో 13 దరఖాస్తులకు గాను 16.15 ఎకరాలలో, భిక్కనూరులో 344 దరఖాస్తుల్లో 666.22 ఎకరాలు, రాజంపేటలో 1,327 దరఖాస్తుల్లో 2,331 ఎకరాలు, సదాశివనగర్‌లో 1,207 దరఖాస్తులో 3,172 ఎకరాలు, తాడ్వాయిలో 2 దరఖాస్తులకు 1.25 ఎకరాలు, ఎల్లారెడ్డిలో 527 దరఖాస్తుల్లో 1235.6 ఎకరాలు, గాంధారిలో 7,900 దరఖాస్తుల్లో 24,972 ఎకరాలు, లింగంపేట్‌లో 2,514 దరఖాస్తుల్లో 5,653 ఎకరాల్లో, నాగిరెడ్డిపేటలో 125 దరఖాస్తులో 232.14 ఎకరాలు ఉన్నట్లు తేలింది.

Read more