నిధుల గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2022-11-23T01:36:50+05:30 IST

రైతులకు సహకారం అందించేందుకు ఏర్పాటు చేసుకున్న సంఘాలు పాలక వర్గాల ఏకపక్ష నిర్ణయాలతో నష్టాల ఊబిలోకి జారుకుంటున్నాయి. సంఘాలను బలోపేతం చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం కేటాయించింది.

నిధుల గోల్‌మాల్‌

కొత్తపల్లి సహకార సంఘంలో రూ. 50 లక్షలకుపైగా నిధుల దుర్వినియోగం

సంఘం లావాదేవీల్లో అనుమానాలు

రాజీనామా చేసిన విండో కార్యదర్శి 8 ఆడిట్‌ అధికారుల నోటీసుల జారీ

కోటగిరి, నవంబరు 22 : రైతులకు సహకారం అందించేందుకు ఏర్పాటు చేసుకున్న సంఘాలు పాలక వర్గాల ఏకపక్ష నిర్ణయాలతో నష్టాల ఊబిలోకి జారుకుంటున్నాయి. సంఘాలను బలోపేతం చేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం కేటాయించింది. కొంత కాలంగా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒక్కో సంఘానికి ప్రతి సీజన్‌లో లక్షల రూపాయల కమీషన్‌లు వస్తున్నాయి. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిన పాలకవర్గాలు తమ ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. సహకార సంఘాల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఫలితంగా సహకార సంఘాలపై అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి. కోటగిరి మండలంలోని కొత్తపల్లి సహకార సంఘం ఇందుకు ఉదాహరణగా మారనుంది. ఈ సంఘంలో సుమారు రూ.50 లక్షలకుపైగా నిధులు దుర్వినియోగమైనట్లు ఆడిట్‌ అధికారులు అంచనా వేశారు. సంఘం నిర్వహించిన లావాదేవిల్లో అడుగడుగునా అనుమానాలు తలెత్తుతున్నాయి. రైస్‌మిల్‌ నిర్వహణ, ధాన్యం కొనుగోలు, సాధారణ ఖర్చులు, సిబ్బంది జీత భత్యాలలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంతో విండో కార్యదర్శి విఠల్‌ రాజీనామా చేయడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. ప్రస్తుతం పాలకవర్గం అతని రాజీనామాను ఆమోదించలేదు. సంఘంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌పై ఉన్నతాధికారులకు పూర్తిస్థాయి సమాచారం అందడంతో ఆడిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిధుల గోల్‌మాల్‌పై వచ్చే నెల 3వ తేదీ వరకు పూర్తి వివరాలు అందించాలని పాలకవర్గానికి నోటీసులు జారీ చేశారు.

కొనుగోళ్లలో భారీగా ఆరోపణలు

సహకార సంఘం పరిధిలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అడ్కాస్‌పల్లి, బస్వాపూర్‌, ఎక్లాస్‌పూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లను కోటగిరి మార్కెట్‌ కమిటీకి అప్పగించగా, కొత్తపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో సుద్దులం, కొత్తపల్లి, రాంపూర్‌, లింగాపూర్‌, కొత్తపల్లి తండాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. యేటా వానాకాలం, యాసంగి సీజన్‌లలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ సమయంలో సంఘ సిబ్బందికి తోడు అదనపు సిబ్బందిని నియమించుకుంటున్నారు. సిబ్బంది నియామకంలో భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సహకార నిబంధనల ప్రకారం లక్ష బస్తాలకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తే జీతభత్యాల కింద రెండు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. ఇతర సంఘాల్లో అదనపు సిబ్బందికి జీతభత్యాల కింద రెండు లక్షల వరకు మాత్రమే చెల్లించగా కొత్తపల్లి సంఘంలో ఓ సీజన్‌లో ఏకంగా 13 లక్షలు ఖర్చు చేయడంలో తీవ్ర ఆరోపణలు నెలకొన్నాయి. తాత్కాలిక సిబ్బందికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల లోపు చెల్లించాల్సి ఉండగా ఒక్కొక్కరికి సుమారు 18వేల రూపాయలకుపైగా చెల్లించినట్లు తెలిసింది. అదనపు సిబ్బంది పేర పెద్ద మొత్తంలో చేతివాటం ప్రదర్శించినట్లు తెలిసింది. ఈ చెల్లింపులపై గత సీజన్‌లో ఆడిటర్‌ రియాజుద్దీన్‌ సంఘంలో 28 లక్షల వరకు నిధుల వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆడిట్‌ నిర్వహిస్తున్న అధికారి సుమారు ఏడు లక్షల వరకు ధాన్యం కొనుగోళ్లతో పాటు, కార్యాలయ సాధారణ ఖర్చులు మూడు లక్షల వరకు ఖర్చు పెట్టడంపై అభ్యంతరాలు ఉన్నట్లు ఆడిట్‌ నివేదికలో పొందుపరిచారు.

రైస్‌మిల్‌ మరమ్మతులకు సుమారు రూ.30 లక్షల ఖర్చు

సహకార సంఘానికి రైస్‌మిల్‌ ఉంది. ఈ రైస్‌మిల్‌ మరమ్మతులకు సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. రైస్‌మిల్‌ మరమ్మతులకు పాలకవర్గం పరిశ్రమల శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. తొలి సీజన్‌లో పరిశ్రమల శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.

ఇతర లావాదేవీల్లోనూ..

పదవీ విరమణ పొందిన సిబ్బందికి గ్రాడ్యూటీ పేరిట సుమారు రెండున్నర లక్షలు చెల్లించడంపై ఆడిట్‌లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎరువుల విక్రయానికి లైసెన్స్‌ పేరుతో 50 వేలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లోనూ గ్రేడ్‌-2 ధాన్యం కొనుగోలు చేసి గ్రేడ్‌-1 ధాన్యంగా రైస్‌మిల్‌లకు తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్యదర్శి రాజీనామాతో బహిర్గతం

కొత్తపల్లి విండో కార్యదర్శి విఠల్‌ రాజీనామాతో సంఘంలో చోటు చేసుకున్న అవినీతి ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతోంది. వారం రోజుల క్రితమే విండో కార్యదర్శి పాలక వర్గ ఏకపక్ష నిర్ణయాలతో ఇక్కడ విధులు నిర్వహించలేక రాజీనామా చేశారు. రాజీనామాను పాలకవర్గంతో పాటు ఉన్నతాధికారులకు పంపినా ఇప్పటి వరకు ఆమోదించలేదు. ఆడిట్‌ నివేదికతో సంఘంలో జరిగిన పూర్తిస్థాయి అవినీతి ఆరోపణలు బయటకు వచ్చే అవకాశముంది. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ సహకార సంఘం అధ్యక్షులు సునీల్‌కుమార్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

Updated Date - 2022-11-23T01:36:51+05:30 IST