కార్పొరేషన్‌లో అన్నీ ఖాళీలే!

ABN , First Publish Date - 2022-11-21T01:08:23+05:30 IST

నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికార పోస్టులన్నీ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఇప్పటికే సగం వరకు అధికారులు బదిలీపై వెళ్లగా.. ప్రస్తుతం ఇన్‌చార్జీలుగా ఉన్న అధికారులు కూడా విధులకు హాజరుకావడం లేదు.

కార్పొరేషన్‌లో అన్నీ ఖాళీలే!

నగర కార్పొరేషన్‌ కార్యాలయంలో అధికారుల పోస్టులు అన్నీ ఖాళీలే

కార్పొరేషన్‌లోని అన్ని శాఖల్లో ప్రజాప్రతినిధుల జోక్యం

ఇక్కడికి వచ్చేందుకు జంకుతున్న సీనియర్‌ అధికారులు

నిజామాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అధికార పోస్టులన్నీ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఇప్పటికే సగం వరకు అధికారులు బదిలీపై వెళ్లగా.. ప్రస్తుతం ఇన్‌చార్జీలుగా ఉన్న అధికారులు కూడా విధులకు హాజరుకావడం లేదు. ఇటీవల కీలకంగా ఉన్న ఎంఈపై దాడి జరగడంతో ఆయన లాంగ్‌ లీవ్‌లో వెళ్లగా ప్రస్తుతం కార్పొరేషన్‌కు కీలక అధికారులే కరువయ్యారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పది రోజులు లీవ్‌లో వెళ్లారు. దీంతోడీఈకి అదనపు బాధ్యతలను అప్పజెప్పారు. దాడికి గురైన ఈఈ కూడా బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా ఇప్పటి వరకు రెగ్యులర్‌ పోస్టుల్లో అధికారులను నియమించేందుకు ఎలాంటి చర్యలను చేపట్టలేదు.

పెరుగుతున్న ప్రజాప్రతినిధుల జోక్యం

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రెగ్యులర్‌ అధికారులే కరువవుతున్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జోక్యం పెరగడంతో కీలక పోస్టులకు అధికారులు వచ్చేందుకు జంకుతున్నారు. వేరేవారిని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా మున్సిపల్‌ డైరెక్టరేట్‌ నుంచి ఏ అధికారి ముందుకు రావడంలేదు. ఒకవేళ నియమించినా.. ఒకటి రెండు రోజుల్లో పైరవీలు చేసుకుని ఇతర జిల్లాకు వెళ్లిపోతున్నారు. కోట్ల రూపా యల నిధులు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు వస్తున్నా.. రెగ్యులర్‌ అధికారులు లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మున్సిపల్‌లో ఈఈగా ఉంటూ ఎంఈగా ఇన్‌చార్జి హోదాలో పనిచేస్తున్న ఆయనపై పది రోజుల క్రితం దాడి జరగడంతో ఆయన లాంగ్‌ లీవ్‌లో వెళ్లిపోయారు. ఈ దాడిచేసిన వారిపై చర్యలు చేపట్టకపోవడం, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా కొంతమేరకే మాట్లాడడం వల్ల ఆ అధికారి కూడా తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో టెండర్‌లు పిలిచి పనులు ఇవ్వాల్సి ఉన్న డివిజన్‌ల వారీగా ఐదు లక్షల లోపు పనులను ఎక్కువగా ఇవ్వడం, అవి నాణ్యత లేకపోవడం, పనికాకుండానే ఎంబీ రికార్డులు చేయాలని ఏఈలు, డీఈలు ఈఈలపై ఒత్తిళ్లు రావడంతో వారు కూడా పనిచేసేందుకు జంకుతున్నారు. కొంతమంది ఇప్పటికే లీవ్‌లో వెళ్లిపోగా కీలకమైన పోస్టులోకి వచ్చేందుకు ఏ అధికారి ముందుకు రావడంలేదు.

ప్రతి పనికీ ఓ రేటు!

నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో ఏ పని జరగాలన్నా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ప్రమేయ లేకుండా జరగడంలేదు. అభివృద్ధి పనులు చేపట్టడం నుంచి ఇళ్ల నిర్మాణం వరకు వారి ఆమోదం ఉంటేనే పనులు కొనసాగుతున్నాయి. కొన్ని డివిజన్‌ల పరిధిలో ప్రతి పనికి ఇంత రేటు అని నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అవి ఇవ్వని చోట పనులు నిలిపివేయడం లేదా ఇబ్బందులు పెట్టడం చేస్తున్నారు. సహకరించని అధికారులపై ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. తమకు వచ్చే పర్సంటేజీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్పొరేషన్‌ పరిధిలో పన్నుల వసూలు నుంచి అభివృద్ధి పనుల వరకు ఇదే వైఖరి కొనసాగుతోంది. చివరకు ఉద్యోగాల నియామకాల్లో కూడా జోక్యం పెరిగిపోయింది. ప్రతి దానిలో నేతల జోక్యం ఎక్కువ కావడం, నిధులు వచ్చినా పనులు పూర్తిస్థాయిలో చేసే పరిస్థితి లేకపోవడం వల్ల యువ అధికారులతో పాటు సీనియర్‌ అధికారులు కూడా కార్పొరేషన్‌వైపు చూడడంలేదు. మున్సిపల్‌ డైరెక్టరేట్‌ పరిదిలోనే ఉన్నతాధికారులను మేనేజ్‌ చేసుకుని ఇతర జిల్లాల మున్సిపాలిటీలకు వెళ్తున్నారు.

అన్ని పోస్టులు ఖాళీగానే

నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అవి ఇన్‌చార్జిల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా ఉన్నా అదనపు కలెక్టర్‌ వ్యక్తిగత సెలవులో వెళ్లిపోయారు. మున్సిపల్‌ ఈఈ లేకపోవడంతో డీఈకి ఆ బాధ్యతలను అప్పజెప్పారు. ప్రస్తుతం కార్పొరేషన్‌ పరిధిలో రెగ్యులర్‌ పోస్టులో ఏ అధికారి లేరు. అదనపు కమిషనర్‌ పోస్టు రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు భర్తీచేయలేదు. ఈఈ కూడా లీవ్‌గా వెళ్లడంతో డీఈ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో కీలకమైన పన్నులు, అనుమతులు ఇచ్చే వింగ్‌లో రెగ్యులర్‌ అధికారులు లేరు. డిప్యూటి కమిషనర్‌ రవిబాబు ఇక్కడి ఒత్తిళ్లు తట్టుకోలేక మూడు నెలల పాటు లాంగ్‌ లీవ్‌లో వెళ్లారు. అక్కడనే పైరవీలు చేసుకుని ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిపోయారు. ఆ తర్వాత మరో అధికారిని జిల్లాకు బదిలీ చేసిన ఒక్కరోజే పనిచేసి లీవ్‌పెట్టి వెళ్లారు. మరో వారం రోజుల తర్వాత బదిలీ చేసుకుని కరీంనగర్‌కు వెళ్లారు. కార్పొరేషన్‌లో డిప్యూటి సిటీ ప్లానర్‌ పోస్టు గత సంవత్సరకాలంగా ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు ఏ అధికారి నియామకం కాలేదు. వచ్చేందుకు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు జంకుతున్నారు. ఈ పోస్టు కూడా ఇన్‌చార్జిని నియమించారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అధికారులు లేకపోవడం వల్ల ఇతర జిల్లాలకు చెందిన ఇద్దరు అసిస్టెంట్‌ టౌన్‌ ప్లానర్‌లను ఇన్‌చార్జీలుగా నియమించారు. కార్పొరేషన్‌లో కీలకమైన ఎంహెచ్‌వో పోస్టు కూడా గత సంవత్సరకాలంగా ఖాళీగా ఉంది. ఈ పోస్టు కూడా భర్తీచేయడంలేదు. సీనియర్‌ సూపర్‌వైజర్‌ని ఇన్‌చార్జిగా నియమించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్‌లో ఏ అధికారి లేకున్నా జిల్లా ప్రజాప్రతినిధుల దృష్టి మాత్రం పడడంలేదు. కార్పొరేషన్‌కు వందల కోట్ల నిధులు వస్తున్నా రెగ్యులర్‌ అధికారులు లేకపోవడం వల్ల పనులు కూడా అనుకున్న విధంగా జరగడంలేదు. అన్ని పోస్టులకు రెగ్యులర్‌ అధికారులను నియమిస్తే వేగంగా జరిగే అవకాశం ఉన్నా పట్టించుకోవడంలేదు. కొంతమంది ప్రజాప్రతినిధులు కార్పొరేషన్‌ గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల యువ అధికారులు కూడా రావడంలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు దృష్టి సారించి పూర్తిస్థాయిలో అధికారులను నియమిస్తే తప్ప పనులు జరిగే అవకాశం కనిపించడంలేదు.

Updated Date - 2022-11-21T01:08:23+05:30 IST

Read more