అర్హులను ఓటరుగా నమోదు చేయాలి

ABN , First Publish Date - 2022-12-13T00:31:58+05:30 IST

ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని అధికారులను ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా అన్నారు.

అర్హులను ఓటరుగా నమోదు చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 12: ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని అధికారులను ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. సదరం డాటాతో దివ్యాంగుల ఓటర్ల జాబితాను సరిపోల్చి అర్హత ఉంటే ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. ఆధార్‌ అనుసంధానం వేగవంతం చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పేర్కొన్నారు. బూత్‌లెవల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి అర్హత గల ఓటర్ల దరఖాస్తులు స్వీకరించి పేర్లు నమోదు చేయాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ మాట్లాడుతూ జిల్లాలో 790 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 6,18,204 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. కొత్తగా ఓటర్లు నమోదు, సవరణల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఇతరుల అభ్యంతరాలను పరిశీలన చేసి తుది జాబితా పకడ్బందీగా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. రాజంపేట మండలం పొందుర్తి పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఆర్‌డీవోలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీను, ఎన్నికల పర్యవేక్షకుడు సాయిభుజంగరావు అధికారులు పాల్గొన్నారు.

ప్రజావాణికి 69 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 69 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ 53, డీఏవో 1, బీసీ వెల్ఫేర్‌ 2, మైనార్టీ వెల్ఫేర్‌ 1, డీపీవో 2, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 1, ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ 1, మున్సిపల్‌ 3, డీఆర్‌డీవో 2, ఎస్పీ ఆఫీస్‌ 2, రోడ్డు అండ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ 1 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు చేసిన ఫిర్యాదులపై ప్రతీశాఖ త్వరగా స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో సాయన్న, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:31:58+05:30 IST

Read more