లక్ష్యసాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-12-10T01:45:07+05:30 IST

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలులో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు.

లక్ష్యసాధనకు కృషి చేయాలి

నిజామాబాద్‌అర్బన్‌, డిసెంబరు 9: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలులో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ కంటి వెలుగు, మన ఊరు-మన బడి, హరితహారం, తెలంగాణ క్రీడాప్రాంగణాలు, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం, కొత్త ఓటర్ల వివరాల నమోదు, ధరణి, తదితర అంశాలపై సంబంధిత అధికారులను సుదీర ్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ పరీక్షలు చేసేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలో కార్యక్రమంలో మధ్యలో నిలిచిపోకుండా చూడాలన్నారు. మన ఊరు-మన బడి కింద కొనసాగుతున్న పనులు ఈ నెలాఖరునాటికి ఎట్టి పరిస్థితిలో పూర్తిచేయాలని, తొలి ప్రాధాన్యతగా ఉన్న 114 పాఠశాలల్లో సివిల్‌ వర్క్‌, పేంటింగ్‌తో పాటు ఉపాధిహామీ కింద మంజూరు తెలిపిన పనులన్నీ పూర్తిచేయాలని సూచించారు. హరితహారం నిర్వహణపై నిరంతరం దృష్టికేంద్రీకరించి అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఉండేలా పకడ్బందీపర్యవేక్షణ జరపాలన్నారు.

జిల్లాలో 393 ప్రదేశాల్లో తెలంగాణ క్రీడాప్రాంగణాలు ఏర్పాటు కావాల్సిందేనని వారం రోజుల్లో ఏ ఒక్కటీ పెండింగ్‌లో ఉంచవద్దని నామ్‌కేవాస్తి పనిచేస్తే సస్పెన్షన్‌ వేటు తప్పదన్నారు. ఓటరు ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వచ్చిన ప్రతీ దరఖాస్తును తక్షణమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆధార్‌ సీడింగ్‌, మార్పులు చేర్పులు నమోదు పక్కాగా చేయాలన్నారు. ధరణి పెండింగ్‌ దరఖాస్తుల కోసం క్షేత్రస్థాయి సమాచారాన్ని వెంట వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, చిత్రమిశ్రా, డీఆర్‌డీవో చందర్‌, డీఎంహెచ్‌వో సుదర్శన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:45:08+05:30 IST