కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కరువు

ABN , First Publish Date - 2022-05-18T05:40:39+05:30 IST

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కరవవుతున్నాయి. సంబంధిత శాఖలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కరువు
వరిపై సొంత టార్పాలిన్‌లను కప్పుకున్న రైతులు

- కేంద్రాల్లో రైతులకు తప్పని ఇబ్బందులు

- కనీసం టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచని వైనం

- శాఖకు రూ.లక్షల్లో కమీషన్‌ వస్తున్నా సౌకర్యాలు కల్పించని పరిస్థితి

- కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం

- రైతులకు అందని సబ్సిడీ టార్పాలిన్‌లు

- మూడున్నర ఏళ్లుగా పంపిణీ చేయని ప్రభుత్వాలు

- ధాన్యం ఆర బెట్టేందుకు, వర్షం నుంచి కాపాడేందుకు రైతులకు అద్దె టార్పాలిన్‌లే..

- ఆర్థిక భారం అవుతుందంటున్న అన్నదాతలు


కామారెడ్డి, మే 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కరవవుతున్నాయి. సంబంధిత శాఖలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు సమయంలో సహకారశాఖకు లక్షల రూపాయాల్లో కమీషన్లు వస్తున్నా కేంద్రాల్లో మాత్రం సౌకర్యాలను కల్పించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం రైతులకు మూడున్నర ఏళ్లుగా సబ్సిడీపై టార్పాలిన్‌లు అందించడం లేదు. దీంతో కోతల సమయంలో ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు, అకాల వర్షాల నుంచి కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పని పరిస్థితుల్లో అద్దెపై టార్పాలిన్‌లను అందించేవారిని ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలోని సంబంధిత శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యమే కాకుండా కేంద్రాల్లోని రైతులు కుప్పలుగా పోసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవాల్సి వస్తోంది. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనే సుమారు 12వేల క్వింటాళ్లలో ధాన్యం తడిసిపోయినట్లు తెలుస్తోంది. ఇక పంట పొలాల్లో కల్లాల వద్ద తడిసిన ధాన్యానికి లెక్కలేదు. ప్రభుత్వం కోతల సమయంలో సబ్సిడీ టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


సబ్సిడీ టార్పాలిన్‌లను పంపిణీ చేయని ప్రభుత్వం

ప్రభుత్వం ప్రతీఏటా రైతులకు 50శాతం సబ్సిడీపై టార్పాలిన్‌లను అందించేంది. 250 జీఎస్‌ఎం 8 ఫీట్ల పొడవు, 6 ఫీట్ల వెడల్పు ఉన్న టార్పాలిన్‌లను ప్రభుత్వం రూ.2,500 ఉంటే రైతులకు రూ.1,250 అందించేది. అయితే టార్పాలిన్‌ల పంపిణీ మూడున్నర ఏళ్లుగా నిలిచిపోయింది. దీంతో రైతులు టార్పాలిన్‌లను మార్కెట్‌లో రూ.2వేల నుంచి రూ.3 వేలకు కొనుగోలు చేస్తుండగా మరికొందరు రైతులు అద్దెకు తీసుకువచ్చి ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ధాన్యం తీసుకొచ్చి ఆరబోసి వాటిని కాంటా వేసి ట్రాన్స్‌పోర్టు జరిగే వరకు 15 రోజుల నుంచి 20 రోజుల సమయం పట్టడంతో వాటిని వేలలో ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు.


ఉరూరా అద్దె టార్పాలిన్‌ కేంద్రాలు

కోతల సీజన్‌ ప్రారంభం అయితే చాలు ప్రతీ గ్రామంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ నుంచి వందలాది కుటుంబాలు వలస వచ్చి అద్దె టార్పాలిన్‌ కేంద్రాలను నెలకొల్పుతారు. ఒక టార్పాలిన్‌కు రోజుకు రూ.15 చొప్పున అద్దెకు తీసుకుంటున్నారు. ఒక్కో రైతు కనీసం 10 నుంచి 50 టార్పాలిన్లను అద్దెకు తీసుకుని పంట కోత మొదలుకొని 17 శాతం తేమ మాత్రమే ఉండేలా ధాన్యం ఆరబెట్టడం, కాంటా పూర్తయ్యే వరకు కనీసం పక్షం రోజులు వాడుకుని అద్దె చెల్లిస్తున్నారు. ఇలా ఒక్కో రైతు తాను సాగుచేసిన భూమిని అనుసరించి రూ. 2వేల నుంచి రూ.8 వేల వరకు టార్పాలిన్‌లకే అద్దె చెల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. 


కేంద్రాల్లోనూ అందుబాటులో లేని టార్పాలిన్‌లు

జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్‌లలో వరితో పాటు మక్కలు, జొన్నలు, శనగలు ఇతర పంటల కోతల సమయంలో టార్పాలిన్‌లు పంటను ఆరబెట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ప్రధానంగా వరి ధాన్యానికి ఖచ్చితంగా టార్పాలిన్‌లు అందుబాటులో ఉండాలి. ఈ యాసంగి సీజన్‌లోనూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు 340 వరకు కేంద్రాలను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. అయితే కేంద్రాలలో రైతులకు ప్రధానంగా ధాన్యం ఆర బెట్టుకునేందుకు ఆయా అధికారులు టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాలి. గత రెండు సంవత్సరాల నుంచి సహకారశాఖ పాత టార్పాలిన్‌లనే సర్దుబాటు చేస్తూ వస్తోంది. జిల్లాలో వరి కోతలు మొదట బాన్సువాడ డివిజన్‌లో ప్రారంభమవుతాయి. అక్కడ కొనుగోలు పూర్తయిన తర్వాత ఆ టార్పాలిన్‌లను ఎల్లారెడ్డి అక్కడి నుంచి కామారెడ్డి డివిజన్‌లకు సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. ఈ సర్దుబాటులో కేంద్రాల వద్ద సమయానికి టార్పాలిన్‌లు లేకపోవడంతో అకాల వర్షాలు కురిసినప్పుడు రైతుల ధాన్యం తడిసిపోవాల్సి వస్తోంది. అంతేకాకుండా రైతుల నుంచి కొనుగోలు చేసి లారీల్లో లోడ్‌ చేసిన సంచులను సైతం టార్పాలిన్‌లు లేకపోవడంతో వర్షానికి తడిసి మొలకెత్తడంతో ప్రభుత్వానికి సైతం నష్టం వస్తోంది. గత మూడు రోజులుగా జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు బాన్సువాడ డివిజన్‌లోని 30 నుంచి 40 లారీల్లో వందల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయింది. అయితే రైతులు అకాల వర్షాలకు తడవకుండా ఉండేందుకు, కేంద్రాలలో ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు అద్దె టార్పాలిన్‌లనే ఉపయోగించుకుంటున్నారు.


కేంద్రాల్లో వసతులు శూన్యం

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అకాల వర్షాలు కురిసిన సమయంలో కేంద్రాల వద్ద టార్పాలిన్‌లు లేకపోవడం, ధాన్యం తడిసిపోవడమే ఇందుకు నిదర్శనం. నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సహకార సంఘాలు వ్యవసాయ, మార్కెటింగ్‌ కమిటీలు టార్పాలిన్‌లను రైతులకు అందుబాటులో ఉంచాలి. అకాల వర్షాలు కురిసినప్పుడు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడవకుండా కాపాడడానికి టార్పాలిన్‌లు అందించాల్సి ఉన్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. ధాన్యం కొనుగొళ్లతో రూ.లక్షల్లో కమీషన్‌లు పొందుతున్న సహకార సంఘం నామ్‌కే వాస్తేగా పాతవి, చిరిగిపోయిన టార్పాలిన్‌లను ఉంచి చేతులు దులుపుకుంటున్నారు. కొన్నిచోట్ల ఆర్థిక భారం సాకుతో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కనీసం తాగడానికి మంచి నీరు, ఉండడానికి నీడ సౌకర్యం కూడా కల్పించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్యాడీ క్లీనర్‌, తేమ శాతం యంత్రాలు కూడా సరిపడా లేకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం నెలకొంటుందని రైతులు చెబుతున్నారు.


రైతులు కూడా సమకూర్చుకోవాలి

- వసంత, జిల్లా సహకారశాఖ అధికారి, కామారెడ్డి

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సహకార శాఖ ద్వారా అందుబాటులో ఉన్న టార్పాలిన్‌లను సమకూర్చడం జరిగింది. కేంద్రాలకు సరిపోయేంత టార్పాలిన్‌లు లేకపోవడంతో సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. రైతులు కూడా టార్పాలిన్‌లను సమకూర్చుకుంటే బాగుంటుంది.


టార్పాలిన్‌లు లేక వర్షానికి తడిసిపోతున్నాయి

- నర్సాగౌడ్‌, పోచారం, నాగిరెడ్డిపేట మండలం

పోచారం గ్రామ శివారులోని కొనుగోలు కేంద్రానికి ఐదు రోజుల కిందట ధాన్యాన్ని తీసుకువచ్చాను. స్థానికంగా టార్పాలిన్‌లు లేకపోవడంతో రెండు సార్లు కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. పదేపదే ధాన్యాన్ని ఎండబెట్టాల్సి వస్తోంది. టార్పాలిన్‌లు ఇచ్చినట్లయితే వర్షానికి ధాన్యం తడిసిపోయి ఉండేది కాదు. తడిసిన ధాన్యంతో తీవ్రంగా నష్టపోతున్నాం. 30 క్వింటాళ్ల వరకు ధాన్యం వర్షం తాకిడికి కొట్టుకుపోయింది.


కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి

- మధుసూదన్‌రెడ్డి, నాగిరెడ్డిపేట

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి. కనీసం ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాలి. రైతులకు ఉచితంగా టార్పాలిన్‌లు ఇచ్చినట్లయితే బాగుంటుంది. అద్దెకు తీసుకోవడంతో అదనపు భారం పడుతుంది. అధికారులే కేంద్రాలలో టార్పలిన్‌లను సమకుర్చాలి.

Read more