రుణాలు ఇవ్వరు.. ఉపాధి కల్పించరూ!

ABN , First Publish Date - 2022-12-09T00:12:15+05:30 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతి, యువకులకు సబ్సిడీపై రుణాలు అందించి ఉపాధి కల్పించాలని ఆయా కులాలకు సంబంఽధించిన కార్పొరేషన్‌లను గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.

రుణాలు ఇవ్వరు.. ఉపాధి కల్పించరూ!

- సకాలంలో అందని బీసీ కార్పొరేషన్‌ రుణాలు

- 13వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో..

- బీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించని ప్రభుత్వం

- మిగతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్‌ల పరిస్థితి ఇంతే..

- రుణాలు అందక దరఖాస్తుదారులకు తప్పని నిరీక్షణ

కామారెడ్డి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతి, యువకులకు సబ్సిడీపై రుణాలు అందించి ఉపాధి కల్పించాలని ఆయా కులాలకు సంబంఽధించిన కార్పొరేషన్‌లను గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ప్రతీ ఏటా ఈ కార్పొరేషన్‌లకు ప్రత్యేక బడ్జెట్‌ను నియమించి రుణాలను అందిస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం రెండు పర్యాయాలుగా అధికారంలోకి వచ్చింది. అయితే 2018 నుంచి కార్పొరేషన్‌లకు సకాలంలో నిధులు మంజూరు చేయడం లేదు. ప్రధానంగా బీసీ కార్పొరేషన్‌కు నాలుగేళ్ల నుంచి నయాపైసా కూడా విడుదల చేయకపోవడంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. బీసీ కార్పొరేషనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లకు అడపాదడప నిధులు వస్తున్నా అవి కూడా దరఖాస్తుదారులకు మంజూరు చేయని పరిస్థితి ఉందని సంబంధితశాఖధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు ఇచ్చి ఉపాధి కల్పించాలంటూ బాధిత యువతి, యువకులు డిమాండ్‌ చేస్తున్నారు.

పెండింగ్‌లో 13,548 దరఖాస్తులు

పేదలు, మధ్య తరగతి వర్గాలను ఆదుకోవడానికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా ప్రతీ సంవత్సరం రాయితీ రుణాలను అందించింది. రాష్ట్ర ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. ఎప్పటి మాదిరిగానే ప్రకటనలు విడుదల చేసి అరకొర మందికి అందజేశారు. వేలాది మంది దరఖాస్తులు చేసుకుని నాలుగేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. రుణాలు మంజూరైతే సొంతగా వ్యాపారాలు చేసుకోవాలని దరఖాస్తులు చేసి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2018లో బీసీ కార్పొరేషన్‌ ద్వారా 13,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరి వారిగా రూ.లక్షలోపు రుణాల కోసం 4,815 మంది దరఖాస్తు చేసుకోగా రూ.2లక్షల వరకు 5,090 మంది, 2లక్షల పైనుంచి 12 లక్షల వరకు 3,643 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రూ.50వేల చొప్పున రుణాలు అందుకున్న వారు 1,273 మంది మాత్రమే. అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

నాలుగేళ్ల నుంచి అందని రుణాలు

బీసీ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం 50 నుంచి 100 శాతం సబ్సిడీతో రుణాలు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా రూ.50వేల రుణాలకు వందశాతం రాయితీ ప్రకటించింది. రూ.లక్షకు 80 శాతం, రూ.2లక్షలకు 70 శాతం ఆపై తీసుకునే రుణాలకు 50 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. 2018 ఏప్రిల్‌ వరకు జిల్లా వ్యాప్తంగా 1,213 మందికి మాత్రమే రూ.6.36 కోట్ల రుణాలు అందజేశారు. అప్పటికే ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో నిలిపివేశారు. మిగతా 10,548 మందికి ఎన్నికల తర్వాత పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి దాదాపు నాలుగేళ్లు జరుగుతున్నా మా గురించి పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రుణం రాక ఉపాధి పొందలేక

బీసీ కార్పొరేషన్‌ రుణాలు ప్రతీ సంవత్సరం క్రమంగా విడుదల చేస్తే వేలాది మంది యువకులకు జీవనోపాధి అవకాశం ఉంటుంది. గతంలో ఈ ప్రక్రియ సజావుగా జరిగేది. గత నాలుగేళ్ల నుంచి కార్పొరేషన్‌లకు అరకొర నిఽధులు కేటాయించడం, కేటాయించిన నిధులను కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇటు రుణాలు రాక అటు ఉపాధి పొందలేకపోతున్నామని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రుణాలు పంపిణీ చేస్తే సొంతంగా వ్యాపారాలు పెట్టుకుంటామని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. రుణాలు మంజూరవుతాయనే ఆశతో దరఖాస్తుదారులలోని కొందరు సొంతంగా అప్పులు తెచ్చుకుని వ్యాపారాలు పెట్టుకున్నారు. అయితే సకాలంలో రుణాలు రాకపోవడంతో నెలనెల వడ్డీ చెల్లించాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా బీసీ కార్పొరేషన్‌ రుణాలు కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఎస్సీ కార్పొరేషన్‌కు అడపాదడప నిధులు కేటాయిస్తున్నా సకాలంలో విడుదల చేయక రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఇటీవల మైనార్టీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేసినట్లు తెలిసింది. కానీ ఇందులో ఎంతమేర రుణాలు ఇస్తారో వేచి చూడాలి. రుణాలు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కలెక్టర్‌, ఎంపీడీవోల కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు.

Updated Date - 2022-12-09T00:12:17+05:30 IST