సర్పంచ్‌లకు తెలియకుండానే నిధుల మళ్లింపు

ABN , First Publish Date - 2022-12-30T00:01:45+05:30 IST

Diversion of funds without the knowledge of Sarpanches

సర్పంచ్‌లకు తెలియకుండానే నిధుల మళ్లింపు

ఫ ఎంపీవోలు, కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు

ఫ డిజిటల్‌ కీతో పంచాయతీ ఖాతాలో జమైన నిధులు డ్రా

ఫ ఆ నిధులతో విద్యుత్‌ బిల్లులు చెల్లించారంటూ మండిపాటు

ఫ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో సర్పంచ్‌ల నిరసన

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 29: కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను నిబంధనలకు విరుద్ధంగా అధికారులు దారి మళ్లించారని సర్పంచ్‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో పంచాయతీలకు విడుదలైన నిధులను పాలకవర్గాలకు తెలియకుండానే డిజిటల్‌ కీ సహాయంతో కార్యదర్శులు, ఎంపీవోలు ఏ విధంగా నిధులు డ్రా చేసి విద్యుత్‌ బిల్లులు చెల్లించారని వారిపై సైబర్‌ నేరం కింద పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధ మవడంతో పాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయే దిశగా ఆలోచన చేస్తున్నారు. గత వారం రోజుల పరిధిలో సదాశివనగర్‌, ఎల్లారెడ్డి మండలాలతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి అధికారుల తీరు నిధుల మళ్లింపు సమావేశమై మండిపడ్డారు. అయితే ఉన్నతాధిఽకారుల ఆదేశాల మేరకే ఆ నిధులను విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు వినియోగించినట్లు తెలుస్తోంది.

తీర్మానం లేకుండానే డ్రా ఎలా చేస్తారంటూ మండిపాటు

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఖాతాలు తెరిపించి 15వ ఆర్థిక సంఘం నిధులను బట్టి రెండు విడతలుగా విడుదల చేసింది. ఆ నిధులతో పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ, మంచినీటి అవసరాలు తదితరాలతో పాటు 50 శాతం నిధులు సీసీ పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి పంచాయతీ తీర్మానంతో పాటు కార్యదర్శి, సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల సంతకాలతో నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది. సాఽధారణంగా ఏ పనులకైన తీర్మానం మేరకు నిబంధనల ప్రకారం వారి ముగ్గురు సంతకాలతో చెక్కు రూపంలో ట్రెజరీ నుంచి నిధులు డ్రా చేస్తారు. కాగా ఇటీవల తనిఖీల పేరుతో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల డిజిటల్‌ సంతకాల కీలను మండల పరిషత్‌ ఆదేశాల మేరకు కార్యదర్శులు తమ వద్దే ఉంచుకున్నారు. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రాచేసి పంచాయతీల్లోని విద్యుత్‌ బిల్లులు చెల్లించినట్లు సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. అయితే విద్యుత్‌ బిల్లులు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో చెల్లించాల్సి ఉండగా కేంద్ర ం నిధులను ఎలా మళ్లిస్తారంటూ సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఇప్పటికే ఎస్‌ఎఫ్‌సీ(స్టేట్‌ ఫైనాన్స్‌కమిషన్‌) నుంచి చెల్లించేలా తీర్మానాలు చేసి పంపుతే ఎస్‌ఎఫ్‌సీ నిధులను ఫ్రీజ్‌ చేసి కేంద్రం తమ గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను డ్రా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇష్టారీతిన తమ ప్రమేయం లేకుండా అధికారులు వారికి నచ్చిన విధంగా చేయడం తగదని ఇక మేము ఉండి ఎందుక నే ప్రశ్నలు లేవదీస్తున్నారు.

సైబర్‌ నేరం కింద ఫిర్యాదు చేసే ఆలోచనలో సర్పంచ్‌లు

ఖాతాలో జమ అయిన నిధులను డిజిటల్‌ కీల సహాయంతో తమకు ఎలాంటి సమాచారం లేకుండా డ్రా చేయడంపై సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు గత మూడు రోజుల కిందట కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధి స్టేడియంలో జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశమై సైబర్‌ నేరం కింద అధికారులపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అయితే ఈ విషయంపై ఆయా మండలాల అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిధులను డ్రా చేసి విద్యుత్‌ బిల్లులను చెల్లించినట్లు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో రూ.లక్ష నుంచి రూ.30 వేల వరకు ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి డ్రా చేసి విద్యుత్‌ బిల్లులకు మళ్లించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-12-30T00:02:46+05:30 IST

Read more