అద్దె భవనాలే దిక్కు!

ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST

పాలన సౌలభ్యం కోసం కొత్త రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు ఏర్పాటు చేసి ఐదేళ్లు గడుస్తున్నా సొంత భవనాలకు కనీసం స్థలాలు కూడా చూడడం లేదు.

అద్దె భవనాలే దిక్కు!
అద్దె చెల్లించలేదని ఇటీవల రాజంపేట ఎంపీడీవో కార్యాలయానికి యజమాని తాళం వేసిన దృశ్యం

- పాలనలో ఎదురవుతున్న అసౌకర్యం

- సొంత భవనాలకు నోచుకుని డివిజన్‌, మండల కార్యాలయాలు

- ఇటీవల రాజంపేట మండలంలో అద్దె చెల్లించలేదంటూ ఎంపీడీవో కార్యాలయంకు తాళం వేసిన యజమాని

- అరకొర వసతుల మధ్యే అధికారుల విధులు

- ఇప్పటికీ స్థల సేకరణ చేయని పరిస్థితి

- నిధులు వచ్చేదెన్నడో.. నిర్మాణాలు చేపట్టేదెన్నడో!


కామారెడ్డి టౌన్‌, మార్చి 5: పాలన సౌలభ్యం కోసం కొత్త రెవెన్యూ డివిజన్‌లు, మండలాలు ఏర్పాటు చేసి ఐదేళ్లు గడుస్తున్నా సొంత భవనాలకు కనీసం స్థలాలు కూడా చూడడం లేదు. కలెక్టరేట్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయాలు తప్ప డివిజన్‌, మండలాల కార్యాలయాల నిర్మాణాలకు ప్రస్తావనే లేదు. రెండేళ్ల కిందట పల్లెప్రగతి కోసం రైతు వేదికలు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులకు శరవేగంగా స్థల సేకరణతో పాటు నిర్మాణాలు సైతం పూర్తయి అక్కడ కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. కానీ కొత్త డివిజన్‌లు, మండలాలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే పాలన కొనసాగిస్తున్నారు. ఈ అద్దెభవనాలు సైతం అధికారులు అరకొర వసతులతోనే వెళ్లదీస్తున్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల ఇళ్లలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండడం వాటికి నెలల తరబడి అద్దెలు చెల్లించడం లేదంటూ ఇంటి యజమానాలు తాళాలు వేస్తుండడంతో అధికారులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

డివిజన్‌ కార్యాలయాలు సైతం అద్దె భవనాల్లోనే..

జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్‌లను ఏర్పాటు చేశారు. అలాగే బీబీపేట, రాజంపేట, రామారెడ్డి, నస్రూల్లాబాద్‌, పెద్దకొడప్‌గల్‌ మండలాలు ఏర్పాటు అయ్యాయి. పంచాయతీల విభజనలో పలు తండాలు పంచాయతీలుగా ఆవిర్భవించాయి.  పరిపాలన కేంద్రీకరణ జరిగి ఐదేళ్లు అవుతున్నా  సౌకర్యాలు మాత్రం కల్పించడంలో సర్కారు విఫలమైంది. దీంతో అసౌకర్యాల మధ్యే పాలన కొనసాగుతోంది. అధికారులు, సిబ్బంది కూర్చోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాన్సువాడలో డీఎస్పీ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. డివిజన్‌ స్థాయి ఇతర శాఖల కార్యాలయాలు కూడా అరకొర సౌకర్యాలు ఉన్న భవనాల్లోనే ఉన్నాయి. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఐకేపీ భవనంలోనే ఉంది. డీఎస్పీ కార్యాలయం నీటిపారుదల శాఖకు చెందిన పాత భవనంలో కొనసాగుతోంది. ఎక్సైజ్‌ కార్యాలయం ప్రైవేట్‌ అద్దె భవనం ఇతర శాఖల కార్యాలయాలవి ఇదే పరిస్థితి. 

కొత్త మండలాలకు పూర్తిస్థాయి కార్యాలయాలు ఎప్పుడో?

పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కిందట కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు తండాలకు సైతం కొత్త గ్రామ పంచాయతీలుగా ప్రకటించింది. అయితే ఈ కొత్త మండలాలకు, గ్రామ పంచాయతీలకు సైతం పూర్తిస్థాయి సొంత కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతోంది. రాజంపేట మండల పరిషత్‌ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగగా ఇటీవల 6 నెలల అద్దె చెల్లించలేదని ఇంటి యజమాని తాళం వే యడంతో మూడు నెలల అద్దె చెల్లించి ఆ కార్యాలయాన్ని నూతనంగా నిర్మించిన ఎంఈవో కార్యాలయ భవనంలోకి మార్చారు. తహసీల్దార్‌ కార్యాలయాన్ని పీహెచ్‌సీ పాత భవనంలో నిర్వహిస్తున్నారు. పోలీసుస్టేషన్‌ పాత సహకార కార్యాలయంలో, ఐకేపీ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. ఇలా పెద్దకొడప్‌గల్‌, నస్రూల్లాబాద్‌, రామారెడ్డి మండలాల్లో కూడా ఇదే తరహాలో గ్రామ పంచాయతీ భవనాలతో పాటు ప్రభుత్వ భవనాలు అద్దె భవనాలు, విద్యాశాఖ, వైద్యశాఖ భవనాలలో కొనసాగించాల్సి వస్తోంది.

ఇప్పటికీ గుర్తించని స్థలాలు

జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్‌లు, మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి అడుగు కూడా ముందుకు పడడం లేదు. కొత్త జిల్లాగా ఏర్పడినప్పటికీ కేవలం కొత్త కలెక్టరేట్‌, ఎస్పీ సమీకృత భవనాల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇక కొత్త డివిజన్‌ మండలాలు, గ్రామ పంచాయతీల పరిస్థితి అంతంత మాత్రమే. వీటికి ఇప్పటి వరకు కనీసం స్థలాలను కూడా గుర్తించలేదు. దీంతో ఆయా కార్యాలయాలు అరకొర వసతులు ఉన్న భవనంలోనే నడుస్తున్నాయి. సొంత భవనాల నిర్మాణంపై సర్కారు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST