ప్రజాదర్బర్‌ జరిగేనా?

ABN , First Publish Date - 2022-05-30T06:11:07+05:30 IST

అవినీతి, అక్రమాలపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య గత పది రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధానికి నేటితో తెరపడనుందా? మున్సిపల్‌ ఆవరణలో ప్రజాదర్బర్‌ నిర్వహిస్తామని బీజేపీ నాయకులు నిర్వహించనున్న కార్యక్రమం సక్సెస్‌ కానుందా లేదంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఇరుపార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి కార్యక్రమానికి బ్రేకులు వేస్తారనేది ఉత్కంఠగా మారింది.

ప్రజాదర్బర్‌ జరిగేనా?

- అవినీతి, అక్రమాలపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మాటల యుద్ధం

- భూ కబ్జాలు, అక్రమ వెంచర్లతో మోసం చేస్తున్నారని బీజేపీ నాయకుల ఆరోపణలు

- కొందరు అధికార పార్టీ కౌన్సిలర్‌ల ఆగడాలపై బాధితులతో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నామని వెల్లడి

- రాజకీయ ఎదుగుదల కోసమే బీజేపీ ఎత్తుగడలంటున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

- బీజేపీ నాయకులు, కౌన్సిలర్‌ల అవినీతిపై ప్రజలకు వివరిస్తామంటూ వెల్లడి

- ప్రజాదర్బర్‌కు ఎలాంటి అనుమతులు లేవంటూ పోలీసుల ఆంక్షలు

- కామారెడ్డిలో ఉత్కంఠగా మారిన పరిస్థితులు


కామారెడ్డి, మే 29(ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య గత పది రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధానికి నేటితో తెరపడనుందా? మున్సిపల్‌ ఆవరణలో ప్రజాదర్బర్‌ నిర్వహిస్తామని బీజేపీ నాయకులు నిర్వహించనున్న కార్యక్రమం సక్సెస్‌ కానుందా లేదంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఇరుపార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి కార్యక్రమానికి బ్రేకులు వేస్తారనేది ఉత్కంఠగా మారింది. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని, కౌన్సిలర్‌లుగా ఎన్నుకుంటే ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అనుచరులు, నాయకులతో కబ్జాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తూ మాటల యుద్ధానికి తెర లేపారు. సరైన అనుమతులు లేకుండా అసైన్‌మెంట్‌ భూములు కబ్జాచేసి వెంచర్లు చేస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని వారి సమక్షంలోనే ప్రజాదర్బర్‌ నిర్వహిస్తామని పేర్కొంటున్నారు. ఇక కేవలం రాజకీయ ఎదుగుదల కోసం బీజేపీ నాయకులు ఎత్తుగడలు వేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తూ వ్యాపారులను, అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తామే బీజేపీ నాయకుల, కౌన్సిలర్‌ల అవినీతిపై ప్రజలకు వివరిస్తామని వెల్లడిస్తున్నారు.

ప్రైవేట్‌ వెంచర్‌తో ముదిరిన వివాదం

తాడ్వాయి రెవెన్యూ కార్యాలయం పరిధిలోని ఓ స్థలంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ వెంచర్‌తో ముదిరిన వివాదం చిలికిచిలికి గాలివానల మారి వ్యక్తిగత దూషణలు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలు, అసైన్‌మెంట్‌ భూములు, కలెక్టర్‌ల ఎన్‌వోసీ ప్రక్రియల వరకు కొనసాగింది. ప్రైవేట్‌ వెంచర్‌లో స్కీమ్‌ల పేరిట స్కామ్‌లు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలను మోసం చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు చేసిన కార్యక్రమాలతో వ్యాపారులను, అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు వ్యక్తిగతంగా దూషించుకునే స్థాయికి వ్యవహారం ముదిరింది. రెండు పార్టీలు సోషల్‌ మీడియాలో చేస్తున్న హల్‌చల్‌తో ప్రజలు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచనలో పడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు చేసుకుంటున్న ఆరోపణల్లో వాస్తవమేంత అనేది తెలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నట్లు తెలుస్తోంది.

కామారెడ్డిలో ఉత్కంఠగా మారిన పరిస్థితులు

కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ గత పది రోజుల నుంచి రాజకీయంగా వేడిని పుట్టించారు. ఒకరేమే అసైన్‌మెంట్‌ భూములతో పాటు, పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాదిస్తుంటే మరొక్కరేమో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ రాజకీయంగా ఎదిగేందుకు ఎత్తుగడ వేస్తున్నారని ప్రజల సమక్షంలోనే తమ గలం వినిపిస్తామని పేర్కొంటున్నారు. ప్రజాదర్బర్‌కు తాము కూడా సిద్ధమని ఎవరి అవినీతి ఎంత ఉందనేది ప్రజల సమక్షంలోనే బట్టబయలు అవుతుందని తెలుపుతున్నారు. దీంతో కామారెడ్డిలో సోమవారం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోననే ఉత్కంఠ నెలకొంది. ఒకరోజు ప్రజలు తమ పనులకు బ్రేక్‌ చెప్పి ప్రజాదర్బర్‌కు రావాలని పిలుపునివ్వడంతో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొంటే ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయోననే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రజాదర్బర్‌కు ఎలాంటి అనుమతులు లేవంటూ పోలీసుల ఆంక్షలు

ప్రజలకు ఏదైన అన్యాయం జరిగితే చట్ట ప్రకారం, న్యాయ స్థానాలకు వెళ్లాలి కానీ ఇష్టారీతిన ప్రభుత్వ కార్యాలయాలను వేదికలుగా చేసుకుని అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వ అధికారులకు ఇబ్బందులు కలిగించడంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చూస్తూ ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 30వ యాక్ట్‌ అమలు ఉందని ఎక్కడా కూడా సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తీసుకోకుండా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు కార్యాలయం నుంచి సైతం లేఖను విడుదల చేశారు. ప్రజలకు అసౌకర్యం కల్గించకూడదనే ఉద్దేశ్యంతో పోలీసుశాఖ ముందస్తు చర్యలు చేపట్టనుందని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణ శాంతి భద్రతల దృష్టిలో ఉంచుకుని కార్యక్రమం విరమించుకోవాలని కోరారు.

Updated Date - 2022-05-30T06:11:07+05:30 IST