భూ మాఫియా కోసమే ధరణి

ABN , First Publish Date - 2022-09-28T05:58:51+05:30 IST

భూ మాఫియా లాభం కోసమే ధరణీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో ‘ధరణితో రైతుల ఇబ్బందులు’ అనే కార్యక్రమాన్ని వారం రోజులుగా చేస్తున్నారు.

భూ మాఫియా కోసమే ధరణి
మాట్లాడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌

ఫ    ధరణిని అడ్డం పెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుంది
ఫ    ప్రజల కోసం ఉద్యమాలు చేస్తే అరెస్టు చేయిస్తున్నారు
ఫ    ఇదే పోలీసులతో కల్వకుంట్ల కుటుంబాన్ని జైలులో వేస్తాం
ఫ    నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌
ఫ    ఆమరణ నిరహార దీక్షకు పూనుకున్న వెంకట రమణారెడ్డి
ఫ    దీక్షను భగ్నం చేసి అరెస్టు చేసిన పోలీసులు

కామారెడ్డి టౌన్‌/సదాశివనగర్‌, సెప్టెంబరు 27:
భూ మాఫియా లాభం కోసమే ధరణీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో ‘ధరణితో రైతుల ఇబ్బందులు’ అనే కార్యక్రమాన్ని వారం రోజులుగా చేస్తున్నారు. మంగళవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు యత్నిస్తుండగా పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆయనను ఇంటివద్దనే అరెస్టు చేసి డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ అక్కడి నుంచి రామారెడ్డి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ ఆయనను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పంటలు పండించుకుంటూ వ్యవసాయ భూమినే జీవనాధారంగా చేసుకున్న రైతులను ధరణి  అనే ఆన్‌లైన్‌ తీసుకువచ్చి రోడ్ల మీదకు తెచ్చే పరిస్థితిని తీసుకువచ్చారని అన్నారు. ధరణిలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ ఫీజులంటూ కట్టించుకుని రిజెక్ట్‌ చేస్తూ తిరిగి రైతులకు డబ్బులు ఇవ్వడం లేదని అన్నారు. ధరణితో ఇబ్బందులు పడుతున్న వారిలో తాను ఒక్కరినని అన్నారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల వేల కోట్ల విలువ గల భూములు ధరణిని అడ్డంపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందని అన్నారు. రైతుబంధు పేరుతో రైతులకు చారానా ఆశచూపి బారానా దోచుకునేందుకే ధరణిని తీసుకువచ్చారని తెలిపారు. ప్రజల కోసం ఉద్యమాలు చేస్తే పోలీసులతో ఇబ్బందులు పెడుతున్నారని, ఇదే పోలీసులతో కల్వకుంట్ల కుటుంబాన్ని జైలులో వేస్తామని అన్నారు. రైతులు ధరణితో అవస్థలు పడుతుంటే ఏ ఒక్కఅధికారి గాని, అధికార పార్టీ నాయకుడు గాని స్పందించి వారికి పరిష్కారం చూపిన దాఖలాలు ఉండడం లేదని అన్నారు. దళితబంధు తీసుకువచ్చి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, నాయకులకు ఇస్తున్నారని ఇప్పుడు మునుగోడు ఎన్నికల వేళ గిరిజనబంధు అంటూ తీసుకువచ్చారని నిత్యం పోడు భూముల కోసం గిరిజనులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధరణిపై వెంకట రమణారెడ్డి చేస్తున్న ఉద్య మాన్ని బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్‌ నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దీక్ష శిబిరాన్ని తొలగించిన పోలీసులు
బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వెంకట రమణారెడ్డి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకోగా ఆయనను పట్టణ పోలీసులు అరెస్టు చేసిన అనంత రం మున్సిపల్‌ కార్యాలయం వద్దకు దీక్ష శిబిరంలో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను సైతం డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా నిజాంసాగర్‌ చౌరస్తా వద్దకు బీజేపీ శ్రేణులు వెళ్లారు. ఎక్కడి వారిని అక్కడే అరెస్టు చేసి నియోజకవర్గంలోని అన్ని పోలీసుస్టేషన్‌లకు తరలించారు. అరెస్టు చేసిన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్‌జైన్‌, నరేందర్‌రెడ్డి, మండ ల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాగా మంగళవారం రాత్రి వెంకట రమణారెడ్డిని పోలీసులు ఇంటి వద్ద విడిచి వెళ్లారు. ఇంటి వద్దనే వెంకట రమణారెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు.

Read more