నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-26T05:48:58+05:30 IST

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి, త్రిజగజ్జనని, మణిద్వీప వాసిని భక్త కోటికి కొంగు బంగారమై నిలిచిన జగన్మాత శారదాదేవి ఆలయ నవరాత్రులతో పాటు, దుర్గామాత, పెద్దమ్మ తల్లి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలను సోమవారం నుంచి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్దఎత్తున పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు
శారద దేవి ఆలయ ముఖచిత్రం

- జిల్లాలోని ఆయా మండలాల్లో దుర్గామాత ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

- జ్ఞాన ప్రదాయిని శారదా అమ్మవారు

- తూర్పు హౌజింగ్‌బోర్డు ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత ్సవాలు

- నేడు జిల్లా కేంద్రంలో పెద్దమ్మతల్లి భారీ ఊరేగింపు


కామారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 25: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి, త్రిజగజ్జనని, మణిద్వీప వాసిని భక్త కోటికి కొంగు బంగారమై నిలిచిన జగన్మాత శారదాదేవి ఆలయ నవరాత్రులతో పాటు, దుర్గామాత, పెద్దమ్మ తల్లి  ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలను సోమవారం నుంచి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్దఎత్తున పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నవరాత్రులు వివిధ రూపాల్లో ప్రజలకు దర్శనమిచ్చి భక్తులకు తన దివ్యాశీస్సులను ఇచ్చేందుకు అమ్మవారు నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో కొలువుదీరనుంది. ముఖ్యంగా తూర్పుహౌజింగ్‌ బోర్డు కాలనీలోని శారదాదేవి ఆలయంలో, పెద్దమ్మ తల్లి ఆలయంలో, విద్యానగర్‌ కాలనీలోని, హ్రియానందాశ్రమంలోని చండీ మంత్రాలయంలో ప్రతీ సంవత్సరంలాగానే పెద్దఎత్తున వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి అంగరంగవైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నవదుర్గ వ్రత కార్యక్రమాలు ప్రతిరోజూ నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి వేఽళలో దాండియా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజయదశమి వరకు సంబరాలు జరుపుకోనున్నారు.

జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగనున్న వేడుకలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో దుర్గామాత వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతీ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల తర్వాత అదే స్థాయిలో మండపాలు ఏర్పాటు చేసి నిత్యం వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో యువతి, యువకుల దాండియా నృత్యాలు చేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ చూపరులను ఆహ్లాదంలో ముంచి వేసేందుకు మండపాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలు ఇలా..

బాలా త్రిపురాసుందరి అలంకారంలో, గాయత్రీదేవి, కాత్యాయిని, అన్నపూర్ణాదేవి, శ్రీలలితాత్రిపుర సుందరిదేవి, మహాలక్ష్మీదేవి అలంకారం, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్ధిని, శారదా రాజరాజేశ్వరీదేవి అలంకరణల్లో అమ్మవారు నిత్యం దర్శనం ఇవ్వనున్నారు. ఆయా రోజుల్లో సరస్వతీ హోమం, అక్షారాభ్యాసములు, సామూహిక నవదుర్గ మహావ్రతం, దేవీ ప్రవచనాలు, చండీయాగం, మహచతుషృష్టి పూజ, మహాపూర్ణాహుతి, మహా గణపతి సహిత దేవి మూలమంత్ర హోమంతో పాటు పలుచోట్ల నిత్యాన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అదేవిధంగా సోమవారం ముదిరాజ్‌ కులస్తుల ఆరాద్య దైవం అయిన పెద్దమ్మ దేవి ఊరేగింపు కామారెడ్డి ప్రధాన రహదారుల వెంట ఊరేగించి ఘనంగా నిర్వహించడంతో పాటు నవరాత్రులు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పట్టణ అధ్యక్షుడు గెరిగంటి లక్ష్మీనారాయణ తెలిపారు.

Read more