నాణ్యతా లోపం.. విద్యార్థులకు శాపం!

ABN , First Publish Date - 2022-11-12T00:12:12+05:30 IST

ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యతతో కూడిన భోజనం అందిస్తూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా చూస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఎప్పటికప్పుడు బయటపడుతునే ఉంది.

నాణ్యతా లోపం.. విద్యార్థులకు శాపం!
గాంధారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు

దీంతో తరచూ అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్న విద్యార్థులు

- శుక్రవారం గాంధారి, నాగిరెడ్డిపేట పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులకు అస్వస్థత

- గతంలో సైతం ఎల్లారెడ్డిలో భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

- తరచూ ఘటనలు జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ కరువు

- విద్యాశాఖ అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు

కామారెడ్డి టౌన్‌, నవంబరు 11: ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యతతో కూడిన భోజనం అందిస్తూ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా చూస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఎప్పటికప్పుడు బయటపడుతునే ఉంది. సరైన భోజనం అందక తరచూ విద్యార్థులు ఆసుపత్రులపాలు అవుతుంటేనే ఉన్నతాధికారుల పర్యవేక్షణ, స్థానిక మండల స్థాయి అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ ధరకు వస్తాయని కాంట్రాక్టర్‌లు, పలువురు మధ్యాహ్న భోజన నిర్వాహకులు కుళ్లిన కూరగాయలు, పురుగుల అన్నం, పాసిపోయిన పప్పులతో విద్యార్థులకు భోజనం పెడుతుండడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహల్లోని వంటలపై పర్యవేక్షణ కొరవడడంతో భోజనం తరచూ వికటిస్తుండడం విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది.

రెండు మండలాల్లో వికటించిన మధ్యాహ్న భోజనం

జిల్లాలోని రెండు మండలాల్లో శుక్రవారం ఒకేరోజు మొత్తం 44 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించి ఆసుపత్రుల పాలయ్యారు. నాగిరెడ్డిపేట మండలం చీనూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో 19 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తీవ్ర వాంతులు చేసుకొని అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. గాంధారి మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 25 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇవేకాక గత మూడు నెలల క్రితం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రభుత్వ బడులు, వసతి గృహాల్లో భోజనం వికటించి పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే భోజనం నాణ్యత ఎలా ఉంటుందో మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారుల పనితీరు ఎలా ఉందో ఊహించుకోవచ్చు. మధ్యాహ్నభోజన నిర్వాహకులు, వసతి గృహాల్లోని భోజనం అందించే నిర్వాహకులు నాసిరకం సామగ్రితో వంట చేసి పిల్లలకు వడ్డిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు గాలికొదిలేస్తున్నారు. విద్యార్థులకు వడ్డించే ముందు నాణ్యత పరిశీలించాల్సిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ సొంత పనుల్లో బిజీగా మారారు. ఫలితంగా విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు.

భోజనం అంటేనే.. భయపడుతున్న విద్యార్థులు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో జిల్లా, మండల పరిషత్‌, ప్రభుత్వ పాఠశాలలు వెయ్యికి పైగానే ఉన్నాయి. 19 కేజీబీవీలు, 6 మోడల్‌ స్కూల్‌లు, 35 గురుకులాలు, 5 ఎయిడెడ్‌ పాఠశాలల్లో సుమారు 1లక్షకు పైగానే విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల్లో దాదాపు అందరు పేద, మధ్య తరగతి గ్రామీణ ప్రాంతాల పిల్లలే చదువుతుంటారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ఆకలితో అలమటించకూడదని రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజన వసతిని కల్పిస్తున్నది. వసతి గృహాల్లోనూ విద్యార్థులకు భోజనాన్ని పెడుతుంటారు. అయితే జిల్లాలో ఇటీవల కాలంలో ప్రభుత్వ బడులల్లో, వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందకపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో భోజనం అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ప్రజాప్రతినిధుల, అధికారుల పర్యవేక్షణ కరువు

ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో భోజనం నాణ్యతపై అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంటుంది. వారంలో కాని పది రోజులకో సారైన విద్యాశాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా విద్యార్థులతో భోజనం చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా కూడా కన్పించదు. కనీసం విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం విషయంలో కానీ వసతి గృహాల్లో వసతి, భోజన సౌకర్యంపై పర్యవేక్షణ పూర్తిగా కరవవుతోంది. ఆయా పాఠశాలల హెడ్మాస్టర్‌లు, వార్డెన్‌లు పర్యవేక్షించకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. విద్యార్థులకు ఇచ్చే మెనూలో నాణ్యత లోపిస్తుండడంతో ఆ భోజనం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు.

పదేపదే భోజనం వికటిస్తున్నా అధికారుల పనితీరులో కనిపించని మార్పు

జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనం వికటిస్తూ విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకోవడం ఆందోళన కల్గిస్తోంది. గతంలో ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లల్లో భోజనం వికటించి పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే మండలంలో ఇందిరానగర్‌ కాలనీ వద్ద గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు. పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల వసతి గృహంలో కలుషిత ఆహారం తిన్న 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే వసతి గృహంలో విద్యార్థులపై ఎలుకలు దాడి చే సిన సంఘటన చోటు చేసుకుంది. అంతేకాకుండా బీర్కూర్‌ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది అక్టోబర్‌ నెలలో బీర్కూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా మరుసటి రోజే అదే పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 113 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నవంబరులో అదే మండలంలోని దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం గాంధారి, నాగిరెడ్డిపేట మండలాల్లో విద్యార్థులు నాణ్యతలేని భోజనం చేసి ఆసుపత్రుల పాలయ్యారు. ఈ తరహాలో తరచూ సంఘటనలు జరుగుతున్నా విద్యాశాఖధికారులు, వసతి గృహ అధికారుల పనితీరులో ఎంత మాత్రం మార్పు కనిపించడం లేదని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖధికారుల పనితీరుపై జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు.

Updated Date - 2022-11-12T00:12:12+05:30 IST

Read more