ఎన్నికల కోసమే సీఎం సమీక్షలు

ABN , First Publish Date - 2022-11-30T00:33:26+05:30 IST

ఎన్నికలు వస్తున్నాయనే హడావిడితో సీఎం కేసీఆర్‌ నగరాభివృద్ధిపై సమీక్షలు చేస్తున్నారని ఎనిమిదేళ్లలో జిల్లాతో పాటు నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు.

ఎన్నికల కోసమే సీఎం సమీక్షలు

టీఆర్‌ఎస్‌ హయాంలో జిల్లాలో అభివృద్ధి శూన్యం

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌

నిజామాబాద్‌అర్బన్‌, నవంబర్‌ 29: ఎన్నికలు వస్తున్నాయనే హడావిడితో సీఎం కేసీఆర్‌ నగరాభివృద్ధిపై సమీక్షలు చేస్తున్నారని ఎనిమిదేళ్లలో జిల్లాతో పాటు నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, అర్బన్‌ ఇన్‌చార్జి తాహెర్‌బిన్‌ హుందాన్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరాభివృద్ధికి ఎనిమిదేళ్లలో రూ.658 కోట్ల నిధులు ఖర్చు చేశామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారని 65 ఏళ్లలో కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో రాష్ట్రంలో 65వేల కోట్ల అప్పు చేస్తే కేవలం 8 ఏళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత కేసీఆర్‌దన్నారు. అభివృద్ధికి నిధులు తెచ్చామని చెబుతున్న నేతలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామని ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలోనే మెడికల్‌ కాలేజ్‌, తెలంగాణ యూనివర్సిటీ, విమానాశ్రయానికి భూమి కేటాయిస్తే 8 ఏళ్లలో కనీస నిధులు కూడా కేటాయించకుండా మెడికల్‌ కాలేజ్‌ సమస్యల నిలయంగా, తెలంగాణ యూనివర్సిటీ వివాదాలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. జిల్లాలో ఐదుగురు శాసన సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్‌ తదితర పదవులతో ఉన్నా జిల్లా అభివృద్ధికి ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. గంగస్థాన్‌లో కాంగ్రెస్‌ హయాంలో స్టేడియానికి స్థలం కేటాయిస్తే ఇప్పటికీ ఆ స్థలం ఏమైందో తెలియదని, రాజారాం స్టేడియానికి చుట్టూ కనీసం గోడలు కూడా కట్టడంలేదన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు జిల్లా నుంచి వస్తున్నా క్రీడలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.

రైతుబంధు పేరుతో మోసం

రైతులకు మద్దతు ధర లేకపోగా రైతుబంధు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినా అర్హులకు ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కోట్లు వెచ్చించి కట్టి న కలెక్టరేట్‌ వర్షంవస్తే మునిగిపోయే స్థితిలో ఉందని బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరి అమ్మేసే పరిస్థితి ఉందన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు మధ్యలోనే ఆగిపోయిందన్నారు. రాష్ట్రంలో భూములన్నీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు కబ్జా చేస్తున్నారని, జిల్లాతో పాటు నగరంలో అధికార పార్టీ నేతలు చేసిన కబ్జాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్‌ శేఖర్‌గౌడ్‌, రాంభూపాల్‌, విపుల్‌గౌడ్‌, వేణురాజ్‌, నరేందర్‌గౌడ్‌, ఈసా, జావెద్‌ అక్రం, రత్నాకర్‌, రేవతి, ఏజాజ్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:33:27+05:30 IST