దరఖాస్తు చేసిన రోజే ధ్రువీకరణ పత్రం

ABN , First Publish Date - 2022-04-25T05:27:42+05:30 IST

పుట్టిన బిడ్డకు జనన, మరణించిన వ్యక్తికి మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాలంటే గతంలో నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఆసుపత్రులలో పుట్టిన బిడ్డకు సంబంధించిన వివరాలు నమోదు చేసిన పత్రాన్ని తీసుకోవాలని ఎంతో మందికి తెలియకపోవడం తీరా జనన ధ్రువీకరణ పత్రం కోసం మీ సేవకు వెళితే అక్కడ పుట్టిన బిడ్డకు సంబంధించి ఆసుపత్రులలో ఇచ్చే పత్రాలను తీసుకుని రావాలని చెప్పడంతో అయోమయానికి గురై ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వచ్చేది.

దరఖాస్తు చేసిన రోజే ధ్రువీకరణ పత్రం

- 24 గంటల్లో జనన, మరణ సర్టిఫికెట్లు

- మున్సిపాలిటీకి రాకుండానే మీ సేవలో పొందే అవకాశం

- బిడ్డపుట్టిన వెంటనే ఆసుపత్రుల్లో వివరాల నమోదు

- సాధారణ, ఆసుపత్రుల్లో మరణించిన యాప్‌లో నమోదు చేసే వెసులుబాటు

- గత నెల 14 నుంచి అమలులోకి తెచ్చిన ప్రభుత్వం

- అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ


కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 24: పుట్టిన బిడ్డకు జనన, మరణించిన వ్యక్తికి మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాలంటే గతంలో నానా అవస్థలు పడాల్సి వచ్చేది. ఆసుపత్రులలో పుట్టిన బిడ్డకు సంబంధించిన వివరాలు నమోదు చేసిన పత్రాన్ని తీసుకోవాలని ఎంతో మందికి తెలియకపోవడం తీరా జనన ధ్రువీకరణ పత్రం కోసం మీ సేవకు వెళితే అక్కడ పుట్టిన బిడ్డకు సంబంధించి ఆసుపత్రులలో ఇచ్చే పత్రాలను తీసుకుని రావాలని చెప్పడంతో అయోమయానికి గురై ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వచ్చేది. మరణ ధ్రువీకరణ పత్రానికి సైతం ఇదే తరహాలో ఆసుపత్రులోనైన, లేదంటే సాధారణంగా మరణించిన తహసీల్ధార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏలు అందజేసే పత్రం ఎక్కడైన పోగొట్టుకుని ఽమరణ ధ్రువీకరణ పత్రం కోసం వెళ్లినా నానా అవస్థలు పడుతూ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఈ సేవలను మరింత సులభతరం చేసింది. ఏ ఆఫీసుకు పోకుండానే మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే చాలు.. అదేరోజు ఆయా సర్టిఫికెట్లను పొందే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్న కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు సకాలంలో మున్సిపాలిటీల్లో వివరాలు అందించకపోవడం వంటి కారణాలతో ధ్రువీకరణ పత్రాల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఇక నుంచి ఆన్‌లైన్‌ సేవలను విస్తృతపరిచి ప్రజలకు మెరుగైన సేవలందించడానికి  బూరియల్‌ గ్రౌండ్‌ యాప్‌ ద్వారా శ్రీకారం చుట్టింది. చిన్న సర్టిఫికెట్‌ కోసం రోజుల తరబడి మున్సిపాలిటీ చుట్టూ తిరగాల్సిన పని లేకుండానే మీ సేవలోనే త్వరగా సర్టిఫికెట్లు పొందేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాలయాల్లోని జనన, మరణ ధ్రువీకరణ విభాగాల సిబ్బంది ఆన్‌లైన్‌లో ప్రక్రియను పూర్తిచేసి ఆయా ఆసుపత్రులు, వీఆర్‌ఏలకు అవగాహన సైతం చేపట్టారు.

లింక్‌ ద్వారా సర్టిఫికెట్‌ పొందే అవకాశం

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జన్మించిన పిల్లలు, మృతి చెందిన వారి వివరాలు ఇక నుంచి హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్ననెన్స్‌ వారు నిర ్వహించే బూరియల్‌ గ్రౌండ్‌ యాప్‌లో ఆయా ఆసుపత్రుల్లోని వారే నమోదుచేయాల్సి ఉంటుంది. వారు వివరాలు నమోదు చేయగానే మున్సిపల్‌ కమిషనర్‌ లాగిన్‌కు వస్తాయి. సంబంధిత పిల్లల కుటుంబ సభ్యులు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే కమిషన్‌ లాగిన్‌లో ఒకే చేయగానే వారి సెల్‌కు మెసేజ్‌ వెళ్తుంది. వెంటనే వారు వెళ్లి మీ సేవ కార్యాలయంలో బర్త్‌ సర్టిఫికెట్‌ లేదంటే ఆసుపత్రి వర్గాలు ఫోన్‌ నెంబర్‌కు పంపిన లింక్‌ ద్వారా వచ్చిన సర్టిఫికేట్‌ను ప్రింట్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆసుపత్రి యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత ఇక ఎప్పటికైనా వివరాలు భద్రంగా ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయంతో ధ్రువీకరణ పత్రాల ప్రక్రియ అంతా పేపర్‌లెస్‌ వర్క్‌గా మారనుంది.

ఇంటి దగ్గర మరణిస్తే..

ఒక వేళ ఇంటి దగ్గర మరణిస్తే దహన సంస్కారాల నిమిత్తం శ్మశానవాటికకు తీసుకువచ్చినప్పుడు వీఆర్‌ఏలు రాసిచ్చే రిసిప్ట్‌ కాకుండా అప్పటికప్పుడు  మృతి చెందిన వ్యక్తి ఆధార్‌ నెంబర్‌, వారి కుటుంబ సభ్యుల సెల్‌ నెంబర్‌ తదితర వివరాలు తీసుకుని బురియల్‌ యాప్‌లో ఎంట్రీ చేసే విధంగా ఇప్పటికే మున్సిపల్‌ అధికారులు వారికి శిక్షణ సైతం నిర్వహించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే మృతి చెందిన వ్యక్తి కుటుంబీకులకు మెసేజ్‌ రూపంలో సమాచారం వెళ్తుంది. అప్పుడు సంబంధిత కుటుంబసభ్యులు దగ్గరలో ఉన్న మీ సేవకు వెళ్లి మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు. ఈ యాప్‌కు సంబంధించి ఇప్పటికే చర్చిలు, మసీద్‌లని పెద్దలకు ఇప్పటికే వివరించినట్లు మున్సిపల్‌ సిబ్బంది పేర్కొంటున్నారు.

పోర్టల్‌లో ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల వివరాలను మున్సిపల్‌ అధికారులు సేకరించారు. ఒక్కో ఆసుపత్రి మున్సిపాలిటీల్లోని జనన, మరణ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ చేసుకోవాలి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా వారికి ఐడీ, పాస్వర్డ్‌ అను కూడా యాజమాన్యాలకు అందించారు. యాప్‌కు సంబంధించిన వివరాలు, ఏ రకంగా ఎంట్రీ చేయాలనే దానిపై అవగాహన కల్పించడంతో యాప్‌లోనే జనన, మరణాలకు సంబంధించిన వివరాలను ఎంట్రీ చేస్తున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డిలో సైతం ఈ ప్రక్రియ చివరి దశకు రావడమే కాకుండా అక్కడ కూడా యాప్‌లోనే వివరాలు నమోదు చేస్తున్నారు.


24 గంటల్లో సర్టిఫికెట్‌ పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది

- దేవేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఇక పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేస్తాం. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులకు అవగాహన కల్పించడంతో పాటు యాప్‌కు సంబంధించిన ఐడీ, పాస్‌వర్డ్‌లను సైతం అందించాం. పుట్టిన పిల్లలు, చనిపోయిన వారి వివరాలను అదేరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో సర్టిఫికెట్‌ అందేలా ప్రభుత్వం చర్యలు చే పట్టింది.


Read more