ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దుర్మార్గమైన ఆలోచన

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిగా ఎత్తేసి, కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టేలా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దుర్మార్గమైన ఆలోచన
బీర్కూర్‌లో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ పోచారం

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బీర్కూర్‌, సెప్టెంబరు 30 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిగా ఎత్తేసి, కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెట్టేలా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన బీర్కూర్‌ ఏఎంసీ కార్యాలయంలో రూ.54 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గోదాం మరమ్మతు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్షగట్టిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిందన్నారు. అయినా సీఎం కేసీఆర్‌ ధాన్యం కొనుగోళ్లు చేపట్టి కేంద్రం కుట్రలను తిప్పికొట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తే కేంద్రం ఓర్వలేకపోతుందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ లాంటి పథకాలను నిలిపేయాలంటూ రాష్ట్రంపై కేంద్రం ఒత్తిడి చేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 30లక్షల 23వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యేదని, ఎనిమిదేళ్లలో కోటి 20 లక్షల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అనంతరం బైరాపూర్‌ గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి స్పీకర్‌ కోలాటం ఆడారు. అన్ని కుల సంఘాల నాయకులు స్వీకర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి,  ఏఎంసీ చైర్మన్‌ అశోక్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సతీష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణగౌడ్‌, మైలారాం పీఏసీఎస్‌ చైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు ఆవారి గంగారాం, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read more