ఇళ్ల పథకంపై చిగురిస్తున్న ఆశలు

ABN , First Publish Date - 2022-12-13T23:49:40+05:30 IST

సొంత జాగా ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేరనుంది.

ఇళ్ల పథకంపై చిగురిస్తున్న ఆశలు

- సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారికి సహాయం

- రూ.3లక్షల వరకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు

- విధివిధానాలను ఖరారు చేసే పనిలో ప్రభుత్వం

- త్వరలోనే దీనిపై ప్రకటన చేసే అవకాశం

- డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు అందని పేదలకు ప్రాధాన్యత

- జిల్లాలో నత్తనడకన డబుల్‌ ఇళ్ల నిర్మాణం

కామారెడ్డి, డిసెంబరు 13(ఆంద్రజ్యోతి): సొంత జాగా ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేరనుంది. గతంలో మంత్రి కేటీఆర్‌ ఓ సమావేశంలో, ఇటీవల సీఎం కేసీఆర్‌ సైతం సొంత జాగా ఉన్న వాళ్లకు రూ.3లక్షల స్కీం అమలు చేస్తామని, ఇందుకు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ప్రకటించారు. దీంతో సొంత ఇంటి స్థలం ఉండి ఈ స్కీం కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వారి ఆశలు చిగురిస్తున్నాయి. ఇందులో బడ్జెట్‌లో రూ.12 వేల కోట్ల నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ముందుగా చెప్పిన రూ.5లక్షల యూనిట్‌ను రూ.3 లక్షలకు కుదించింది. పేదల కలల డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల పథకం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కొనసాగుతునే ఉంది. దీంతో పాటు సొంత జాగా ఉన్నవారికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు ఇటీవల పలువురు మంత్రులు పేర్కొనడం గమనార్హం.

నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు

సొంత స్థలం ఉన్న వాళ్లు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం 3 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనుంది. ప్రతీ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాలకు మొత్తం 3,500 యునిట్లు మంజూరుకానున్నాయి. ఈ లెక్కన జిల్లాకు రూ.10.50కోట్ల నిధులు అవసరం కానున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీంను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కీంకు సంబంధించి ఇంకా మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఖాళీ జాగా వంద గజాలు ఉండాలా లేక తక్కువ ఉన్నప్పటికి స్కీంను అమలు చేస్తారా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

డబుల్‌ ఇళ్లు మంజూరైనవి కొండంత.. పూర్తయినవి గొరంత!

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 10,317 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేసింది. బాన్సువాడ నియోజకవర్గానికి 5,401, జుక్కల్‌ నియోజకవర్గానికి 1,466, కామారెడ్డికి 1,715, ఎల్లారెడ్డికి 1,681 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేసింది. బాన్సువాడ , కామారెడ్డి నియోజకవర్గాల్లో మినహాయిస్తే జుక్కల్‌, ఎల్లారెడ్డిలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3,711 ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వడమే కాకుండా లబ్ధిదారులకు కేటాయించారు. మిగతా 1,309 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలోను 1,445 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో కేవలం 300లకు పైగానే ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తయినా అందులో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఇప్పటికీ పంపిణీకి నోచుకోవడం లేదు. 270 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 43 ఇళ్లు పూర్తి కాగా 612 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. జుక్కల్‌ నియోజకవర్గంలో 120 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా 652 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి.

నత్తనడకన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం జిల్లాలోని పలు నియోజకవర్గంలో నత్తనడకన సాగుతున్నాయి. 2015లో ఈ పథకానికి శ్రీకారం చుట్టగా ఏళ్లు గడిచినా నేటికి పనులు అసంతృప్తిగానే ఉండడంతో అర్హులకు నిరీక్షణ తప్పడం లేదు. జిల్లాకు రెండు విడతలుగా డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేయగా కొన్ని ప్రాంతాల్లో నేటికి పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. నిర్మాణాలు చేపట్టినవి కూడా పూర్తికాలేదు. కొన్నిచోట్ల ఇంటి నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు నిరుపయోగంగా ఉండగా ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు నిరీక్షణ తప్పడం లేదు. బాన్సువాడ నియోజకవర్గంలోనే స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడమే కాకుండా లబ్ధిదారులకు కేటాయించారు. సుమారు 3,700లకు పైగా డబుల్‌బెడ్‌ రూం ఇళ్లలో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోనూ 400 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గంలో ఏ ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారులకు కేటాయించలేదు. ఈ ప్రాంతంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయాలంటూ పేదలు నిరసన వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి.

Updated Date - 2022-12-13T23:49:40+05:30 IST

Read more