సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-07-05T06:26:49+05:30 IST

వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో సీజనల్‌ వ్యాధుల నివారణపై ఆయాశాఖల అధికారులతో కలెక్టర్‌ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌అర్బన్‌, జూలై 4: వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో సీజనల్‌ వ్యాధుల నివారణపై ఆయాశాఖల అధికారులతో కలెక్టర్‌ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, విష జ్వరాలు వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రణాళికబద్ధంగా చేపడుతున్న చర్యల ఫలితంగా జిల్లాలో మలేరియా కేసులు క్రమేన తగ్గుముఖం పట్టాయని 2019లో 30 కేసులు నమోదుకాగా 2020లో 1, 2021లో 2కేసులు నమోదయ్యాయని ఇప్పటి వరకు ఈ యేడాది జిల్లాలో ఒక్కకేసు కూడా నమోదు కాలేదన్నారు. గత యేడాది డెంగ్యూ కేసులు జిల్లాలో 396 నమోదయ్యాయని దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సారి జిల్లావ్యాప్తంగా ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధుల నివారణ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, డీపీవో జయసుధ, డీఆర్‌డీవో చందర్‌నాయక్‌, డీఈవో దుర్గాప్రసాద్‌, జడ్పీ సీఈవో గోవింద్‌ పాల్గొన్నారు

పకడ్బందీగా ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ అమలు చేయాలి

బాలబాలికలను పనులలో కొనసాగించడం నేరమని అలాంటి వారిని గుర్తించేందేకు చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశిం చారు. సోమవారం ప్రగతి భవన్‌లో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయాచోట్ల పనులో కొనసాగుతున్న బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ కార్యక్రమం అంతంతమాత్రంగానే జరిగిందని ప్రస్తుతం పూర్తిస్థాయిలో అమలు చేస్తు మంచి ఫలితాలు సాదించాలన్నారు.

హరితహారం అమలును వేగవంతం చేయాలి

వర్షాలు అనుకూలిస్తున్నందున హరితహారం అమలును మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో ప్రజావాణి అనంతరం అధికారులతో శాఖల వారీగా సమీక్షించారు. ఒక్కొశాఖ వారీగా ప్రణాళికబద్దంగా మొక్కలు నాటాలని అధికారులు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో సమీక్షించాలన్నారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లు, రైతేవేదికలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలంలో మొక్కలు నాటడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఉపాదిహామీ, మన ఊరు మన బడి పనుల్లో నాణ్యత జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-07-05T06:26:49+05:30 IST