నగరంలో బైక్‌ దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2022-10-11T05:52:20+05:30 IST

జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో ద్విచక్ర వాహనాలను అపహరించే దొంగల ముఠాను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుంచి సుమారు రూ.70లక్షల విలువైన 42 వివిధ రకాల ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు.

నగరంలో బైక్‌ దొంగల అరెస్టు

42 ద్విచక్ర వాహనాల స్వాధీనం

ఖిల్లా, అక్టోబరు 10: జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో ద్విచక్ర వాహనాలను అపహరించే దొంగల ముఠాను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుంచి సుమారు రూ.70లక్షల విలువైన 42 వివిధ రకాల ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు. నిందితులు అపహరించిన వాహనాలను సోమవారం సీపీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగలు అపహరించిన వాటిలో విలువైన బుల్లెట్లు-11, ఆక్టివాలు-18, పల్సర్‌-8, బర్గ్‌మెన్‌-3, షైన్‌-2లు ఉన్నాయ న్నారు. దొంగలు విలువైన బుల్లెట్లను టార్గెట్‌ చేసుకుని అపహరించి వాటిని కర్నాటకలోని రాయచూర్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌, హైదరాబాద్‌ నగరంలో విక్రయించే వారని సీపీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని హాష్మీకాలనీకి చెందిన షేక్‌ సమదుద్దీన్‌, మహ్మదీయ కాలనీకి చెందిన షేక్‌ రియాజ్‌, తాడ్కోల్‌ గ్రామం బాన్సువాడకు చెందిన మహ్మద్‌ అబ్బాస్‌లు ఉన్నారన్నారు. జిల్లా కేంద్రంలోని బొబ్బిలి వీధికి చెందిన నర్సయ్య తన బుల్లెట్‌ వాహనం దొంగతనానికి గురైందని రెండో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానితుడిని పోలీసులు గుర్తించి ఆ వ్యక్తి కోసం గాలించారన్నారు. ఇందులో భాగంగానే ఏ-1ను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించాడన్నారు. వీరిలో ఏ-1, ఏ-2లు వాహనాలను అపహరించి ఏ-3, ఏ-4లు కలిసి బాన్సువాడ ప్రాంతంలో దాచిపెట్టి ఒకే సారి వాటిని అమ్మడానికి కర్నాటక, రాయచూర్‌, హైదరాబాద్‌కు తరలిస్తారన్నారు. వారు దొంగిలించిన వాహనాలను అమ్మడానికి ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 42వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.  ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు అరవింద్‌బాబు, ఏసీపీ ఏ.వెంకటేశ్వర్‌, ఇన్‌చార్జి సీఐ శ్రీశైలం, ఎస్‌ఐ. పూర్ణేశ్వర్‌, ఏఎస్‌ఐ. రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.

Read more