పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ

ABN , First Publish Date - 2022-06-08T05:20:50+05:30 IST

ప్రభుత్వ నిధులు ప్రైవేట్‌ ఆసుపత్రుల పాలు కాకుండా ఉండేందుకు ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ఆధునికరిస్తోంది. ఈ పథకంలో 70 శాతం నిధులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నాయని గ్రహించిన ప్రభుత్వం అదే స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది.

పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ
కామారెడ్డి అర్బన్‌ పీహెచ్‌సీ

- జిల్లాలో ఈనెల 1 నుంచి ప్రారంభమైన సేవలు

- ప్రభుత్వ నిధులు ప్రైవేట్‌పరంగా కాకుండా చర్యలు

- అందుబాటులో లేని సేవలకై ఆరోగ్యశ్రీ యాప్‌లో ఎంటర్‌ 

- ఆ చికిత్సలకు అప్రూవల్‌ రాగానే ఆ ఆసుపత్రికి రిఫర్‌ చేసేలా చర్యలు


కామారెడ్డి టౌన్‌, జూన్‌ 7: ప్రభుత్వ నిధులు ప్రైవేట్‌ ఆసుపత్రుల పాలు కాకుండా ఉండేందుకు ఆరోగ్యశ్రీని ప్రభుత్వం ఆధునికరిస్తోంది. ఈ పథకంలో 70 శాతం నిధులు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నాయని గ్రహించిన ప్రభుత్వం అదే స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి వైద్యసేవలు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈనెల 1 నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో ఆరోగ్య శ్రీసేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. 

సేవలకు తగ్గట్టు ప్రోత్సాహక నజరానా

జిల్లాలోని 22 మండలాల్లో ఉన్న 23 ఆరోగ్య కేంద్రాలున్నాయి. అందులో ప్రస్తుతం ఉన్న వైద్యులు కాకుండా స్పెషలిస్టులను కూడా ప్రభుత్వం త్వరలో కేటాయించనుంది. పీహెచ్‌సీలో గర్భిణికి సాధారణ ప్రసవం చేస్తే వైద్యుడికి, సిబ్బందికి ప్రోత్సాహం కింద రూ.3 వేలు ప్రభుత్వం అందించనుంది. అంతేకాకుండా పీహెచ్‌సీ మెయింటనెన్స్‌లో కూడా సిబ్బందికి, పరికరాలు, ఇతర వైద్య అవసరాలను వెంటనే తీర్చుకునే వెసులుబాటును కల్పించింది. వైద్యులకు సిబ్బందికి ప్రత్యేక అలవెన్సులు, ఓపీ, ఇతర చికిత్సల ఆధారంగా కూడా వారికి నగదు రూపంలో నజరానాలను ఇవ్వనుంది.

అందుబాటులో లేని సేవల కోసం ఆరోగ్యశ్రీ యాప్‌లో ఎంటర్‌ 

ఆరోగ్యశ్రీకార్డును పీహెచ్‌సీలకు వచ్చే రోగులు వెంటవిధిగా తీసుకురావాలి. దీనివల్ల వచ్చిన రోగికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యుడు పరీక్షించి పీహెచ్‌సీ స్థాయిలో చికిత్సలు అయితే అక్కడే చేసి పంపిస్తారు. ఒకవేళ అక్కడ వైద్యచికిత్సలు అందుబాటులో లేకుంటే వైద్యుడి వద్ద ఉన్న ఆరోగ్యశ్రీయాప్‌ ద్వారా అతడి రోగాన్ని ఎంటర్‌చేసి ఆ రోగానికి ఎక్కడ సరైన వైద్యచికిత్సలు ఉన్నాయని అప్రోల్‌ పంపిస్తారు. అప్రోల్‌ రాగానే వెంటనే సంబంధిత రోగిని ఆసుపత్రికి పంపించి ఉచితంగా వైద్యచికిత్సలు చేయించడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీయాప్‌ వైద్యఆరోగ్యశాఖలోని వైద్యాధికారులు, ఆరోగ్య మిత్రల వద్ద అందుబాటులో ఉంది.

పీహెచ్‌సీలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి

పీహెచ్‌సీలలో సైతం మెరుగైన సేవలు అందించి పెద్ద ఆసుపత్రులకు భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పీహెచ్‌సీలలో కేవలం డెలివరీలు, ప్రాథమిక చికిత్సలకు మాత్రమే పరికరాలు ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా డెలివరీలతో పాటు స్కానింగ్‌లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 53 రకాల రోగాలను పీహెచ్‌సీలో ఆరోగ్యశ్రీ కింద చేర్చారు. అదేవిధంగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సంరక్షణ సేవల పేరుతో మొబైల్‌యాప్‌ను రూపొందించింది. ఈయాప్‌ ద్వారా రోగికి సంబంఽధించిన సమస్యలను ఎంటర్‌ చేసి వారి వివరాలను పొందుపరిస్తే ఎక్కడ ఏ చికిత్స ఉంది. దానికి కావాల్సిన అప్రోల్‌ కూడా వెంటనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read more